మొదలు.. చివర..

ఒకసారి సుందర చైతన్యానంద ప్రవచనం చెప్పేందుకు వెళ్లారు. అదయ్యాక శ్రోతలను ఉద్దేశించి ‘మీరు ఓ గంట కదలకుండా నేను చెప్పిన విషయాలు విన్నారు. వాటిలో మీకు ఎన్ని గుర్తున్నాయో, మరెన్ని జ్ఞాపకం లేవో నాకు తెలియదు.

Published : 01 Feb 2024 00:14 IST

కసారి సుందర చైతన్యానంద ప్రవచనం చెప్పేందుకు వెళ్లారు. అదయ్యాక శ్రోతలను ఉద్దేశించి ‘మీరు ఓ గంట కదలకుండా నేను చెప్పిన విషయాలు విన్నారు. వాటిలో మీకు ఎన్ని గుర్తున్నాయో, మరెన్ని జ్ఞాపకం లేవో నాకు తెలియదు. కనుక ఆ విషయాలన్నీ ఒకసారి క్లుప్తంగా చెబుతున్నాను.. కాగితం, కలం తీసి రాసుకోండి’ అన్నారు. అందరూ రాసేందుకు సిద్ధమయ్యారు. అప్పుడాయన ‘మొదట దేవుడు, తర్వాత ప్రపంచం, చివరికి నేను’ అంటూ ఒక్క ముక్కలో చెప్పి వెళ్లిపోయారు. ఒక శ్రోత వద్ద కాగితం లేదు. ఆ మాటలను మననం చేసుకుంటే.. స్వామి చెప్పిన వాక్యం- ‘ముందు ప్రపంచం, తర్వాత దేవుడు, చివరికి నేను’ అని మారింది. ఇల్లు చేరాక కాగితం తీసుకుని.. ‘ముందు నేను, తర్వాత ప్రపంచం, చివరికి దేవుడు’ అని రాశాడు. ఇంతలో తనతోపాటు ప్రసంగం విన్న భార్య వచ్చింది. కాగితం చూసి.. ‘ఇలా కాదు. స్వామి ఏం చెప్పారంటే- మనకు జన్మనిచ్చిన దేవుణ్ణి మొదట తలచుకుని శ్రద్ధాభక్తులతో ఆరాధించాలి. దాంతో స్వామి ఆశ్రయం, అభయం లభిస్తాయి. తర్వాత ప్రపంచం. అంటే తన చుట్టుపక్కల వారికి ప్రాధాన్యత ఇచ్చి చేతనైన ఉపకారం చేయాలి. ఈ రెండూ చేసిన మీదట ‘నేను’ అనే అహంకారం నశించిపోయి, నేను అనేదానికి ప్రాధాన్యత ఉండదనే జ్ఞానం కలుగుతుంది. అలా అన్నివిధాలుగా శాంతి లభిస్తుంది’ అంటూ వివరించింది.

లక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని