చూపంతా చాపమీదే..

ఒకసారి భక్త తుకారాం భజన నిర్వహించేందుకు పొరుగూరు వెళ్లాడు. కార్యక్రమం మొదలైనప్పుడు చాలామందే వచ్చారు. గంటలు గడిచినకొద్దీ జనం తరిగిపోయారు. భజన సాగుతోంది. రాత్రయ్యేసరికి జనం వెళ్లిపోసాగారు.

Published : 15 Feb 2024 00:20 IST

కసారి భక్త తుకారాం భజన నిర్వహించేందుకు పొరుగూరు వెళ్లాడు. కార్యక్రమం మొదలైనప్పుడు చాలామందే వచ్చారు. గంటలు గడిచినకొద్దీ జనం తరిగిపోయారు. భజన సాగుతోంది. రాత్రయ్యేసరికి జనం వెళ్లిపోసాగారు. భక్తి పారవశ్యంతో భజన చేస్తున్న తుకారాంకి భక్తులు వెళ్లిపోతున్న సంగతి తెలియదు. తెల్లవారింది. భజన ముగించిన తుకారాంకి ఒకే ఒక్క వ్యక్తి ఎదురుగా కనిపించాడు. సంతోషించిన తుకారాం ‘నువ్వు ధన్యుడివి నాయనా! వెళ్లిపోయిన వారికి దొరకని భాగ్యం నీకు కలిగింది. భక్తిలో మునిగి.. తెల్లవార్లూ నిద్రించకుండా నాతో పాటు దేవుని స్మరించావు. మన భజనకు నృత్యం చేసిన పాండురంగణ్ణి చూసే ఉంటావుగా’ అంటూ మెచ్చుకున్నాడు. ఆ మాటలకు బదులిస్తూ.. ‘లేదు.. నాకేం కనిపించలేదు స్వామీ! తమరు కూర్చున్న చాప నాదే! భజన పూర్తయితే దాన్ని తీసుకెళ్దామని మెలకువగా ఉన్నాను’ అన్నాడు. అతడి మాటలకు విచారించిన తుకారాం ‘పిచ్చివాడా! అల్పమైన చాప మీది వ్యామోహంతో చూడాల్సిన దైవాన్ని చూడలేకపోయావు. ఈ చాప మీదున్న ధ్యాస, దృష్టి స్వామి మీదుంటే ఎంత బాగుండేది! ప్రాపంచిక అంశాలపై ఉన్న శ్రద్ధాసక్తులు దేవునిపై ఉండటంలేదు. అందుకే జనులు పదేపదే జనన మరణ చక్రంలో పడి వేదన అనుభవిస్తున్నారు. మన దృష్టి దేవుడి మీద నిమగ్నమైతే అనవసర ఆలోచనలు మదిని కల్లోలపరచవు. దేవుణ్ణి కళ్లారా చూసే అవకాశం కలుగుతుంది’ అంటూ వివరించాడు. భజనలో ఉన్న పరమార్థం అర్థం కానట్టే.. తుకారామ్‌ చేసిన ప్రబోధ కూడా అతడికి అర్థం కాలేదు. తన చాపను తీసుకుని మౌనంగా వెళ్లిపోయాడు.

పద్మజ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని