కాఠిన్యమూ హింసే!

ఉద్వేగం కలిగించకుండా, బాధించకుండా, ప్రియంగా మాట్లాడటం వాచిక తపస్సని సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రబోధించాడు. మాటకి అధిదేవత ‘అగ్ని’ అనేది పురాణ వచనం.

Published : 22 Feb 2024 00:08 IST

ద్వేగం కలిగించకుండా, బాధించకుండా, ప్రియంగా మాట్లాడటం వాచిక తపస్సని సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రబోధించాడు. మాటకి అధిదేవత ‘అగ్ని’ అనేది పురాణ వచనం. అగ్ని ఎంత ఉపయోగకరమో, అంత ప్రమాదకరం కూడా! కనుక వాక్కును నిప్పులా ఎంతో పదిలంగా, ప్రయోజనకరంగా ఉపయోగించుకునే విజ్ఞత ఉండాలి. యుద్ధంలో శరీరానికి తగిలిన బాణాలను ఎలాగైనా తొలగించుకోవచ్చు. కానీ మనసును గాయపరిచే కఠినమైన మాటల బాణాలను ఏ ఉపాయంతోనూ తొలగించలేమని మహాభారతం కూడా హితవు పలికింది. మనసు నొచ్చుకునేలా మాట్లాడటం హింసతో సమానమని హెచ్చరించింది. మన సభ్యత, సంస్కారం మాట్లాడే తీరులోనే బయటపడతాయని స్పష్టం చేసింది. దుర్భాషలాడటం, కసురుకోవటం, పెళుసుతనం, సూటిపోటీలు- ఇవన్నీ వాచిక తపస్సుకు ఆటంకాలు. ‘ఇతరుల మనసు నొచ్చుకునేలా భాషించకూడదు. ఆ ధోరణిని కొనసాగిస్తే చివరకు అదే నీ స్వభావం అయిపోతుంది. సున్నితత్వాన్ని కోల్పోతే నీ మాటలకు హద్దూ అదుపూ లేకుండా పోతుంది’ అన్నారు జనని శారదాదేవి. ‘మాటపై అదుపు లేదంటే, మనపై మనకు అదుపులేదని అర్థం. అది రాక్షసత్వానికి నిదర్శనం. కటువుగా మాట్లాడే వాళ్లు వేటగాళ్లతో సమానం. మానసికంగా బాధించడమూ హింసే. దానికి శిక్ష తప్పదు’ అని హెచ్చరిస్తున్నాయి ధార్మిక గ్రంథాలు.

చక్రి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని