దేవతలను శపించిన పార్వతీదేవి

పార్వతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత శంకరుడు నూరు దివ్య సంవత్సరాలు దాంపత్య సుఖం అనుభవించాడు. అయినా వారికి సంతానం కలగ లేదు.

Published : 29 Feb 2024 00:03 IST

పార్వతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత శంకరుడు నూరు దివ్య సంవత్సరాలు దాంపత్య సుఖం అనుభవించాడు. అయినా వారికి సంతానం కలగ లేదు. ఒకరోజు బ్రహ్మాది దేవతలు శివుని సమీపించి ‘మీ తేజ ప్రభావంతో కలిగే పుత్రుణ్ణి లోకాలు భరించలేవు. అందువల్ల సంతాన యోచన విరమించి మీరిద్దరూ తపస్సు ఆచరిస్తేనే ముల్లోకాలు క్షేమంగా ఉంటాయి. ఆ తేజస్సును మీలోనే నిలిపి, లోకాలను కాపాడండి’ అని ప్రార్థించారు.

మహేశ్వరుడు ‘ఇకపై నిలువరిస్తాం సరే.. కానీ ఇప్పటికే స్వస్థానం నుంచి కదలిన తేజస్సును ఎవరు భరిస్తారు?’ అనడిగాడు. భూదేవి మాత్రమే భరించగలదన్నారు దేవతలు. పరమేశ్వరుడి తేజస్సు పర్వతాలు, వనాలతో నిండిన భూమి మీద వ్యాపించింది. అగ్ని, వాయు దేవుళ్లను కూడా శివ తేజస్సును భరించమని దేవతలు ఆజ్ఞాపించారు. దాంతో అగ్నితో కూడిన శివ తేజస్సు శ్వేత పర్వతమైంది. అక్కడ అగ్ని, సూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సు గల రెల్లు గడ్డి ఏర్పడింది. అక్కడే కుమారస్వామి జన్మించాడు. కృత్తికలు పాలిచ్చి పెంచడం వల్ల కార్తికేయుడిగా, అగ్ని ధరించడం వల్ల అగ్ని సంభవుడుగా ప్రసిద్ధి చెందాడు శివనందనుడు.
ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి దేవతల మీద కోపించింది. ‘నా భర్తతో పుత్రుని పొందాలన్న కోరిక తీరనివ్వలేదు కనుక మీకు భార్యలతో సంతానం కలగదు. వాళ్లు సంతానవతులు కాలేరు’ అంటూ ఆగ్రహంతో శపించింది.
భూదేవినుద్దేశించి ‘నువ్వు చౌడునేల లాంటి రూపాలు పొందుతావు. ఎందరో రాజులకు భార్యవై, వాళ్ల పాలనలో ఉంటావు. నీక్కూడా సంతాన సుఖం ఉండదు’ అని శపించింది. అది మొదలు దేవతలు, భూదేవి సంతానభాగ్యం కోల్పోయారు.

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని