యోగక్షేమాలు అంటే...

‘నిశ్చల మనసుతో నా యందే నిష్ఠ కలిగి ఎవరు నిరంతరం నన్ను సేవిస్తుంటారో వారి యోగక్షేమాలు నేను వహిస్తుంటాను’ అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అభయమిచ్చాడు.

Published : 29 Feb 2024 00:08 IST

మీకు తెలుసా

నిశ్చల మనసుతో నా యందే నిష్ఠ కలిగి ఎవరు నిరంతరం నన్ను సేవిస్తుంటారో వారి యోగక్షేమాలు నేను వహిస్తుంటాను’ అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అభయమిచ్చాడు. మనందరికీ అవసరమైనవి యోగం, క్షేమం. అందరూ కోరుకునే ఇహలోక, పరలోక ప్రయోజనాలన్నీ యోగక్షేమాల్లోనే ఇమిడి ఉన్నాయి. యోగమంటే అవసరమైన వాటిని సమకూర్చటం. క్షేమమంటే సమకూరిన వాటిని సంరక్షించటం. ఎంతో కొంత ఆధ్యాత్మిక స్పృహ ఉన్నవాళ్లు జీవితావసర వస్తువులే కాక ఆత్మజ్ఞానం కూడా ఆకాంక్షిస్తారు. ఆ రెండూ సంప్రాప్తించటమూ యోగమే! భగవత్‌ ధ్యానంతో ఆత్మజ్ఞాన సంపద లభిస్తుంది. కానీ ఏదైనా సంపాదించగానే సరిపోదు.. దాన్ని నిలబెట్టుకోవడమూ ముఖ్యమే. కనుకనే ఆ సంపదలు చేజారిపోకుండా, క్షీణించకుండా తానే కాపాడుతూ వృద్ధి చేస్తుంటాడు దేవుడు. దీన్నే క్షేమం అంటారు. యోగక్షేమమంటే అశుభాలు, అనర్థాలను పోగొట్టి, శుభాన్ని, పుణ్యాన్ని కలిగిస్తుందనే అర్థమూ ఉంది. తనను నమ్ముకున్న భక్తులకు భౌతికంగా, పారమార్థికంగా అవసరమైనవాటిని చేకూర్చి, వాటిని సంరక్షించే బాధ్యత ఆ స్వామిదే. అందువల్ల నిరంతరం ఆయనను మనసులో స్థిరపరచుకుని ఆరాధించాలి. దైవం మన యోగక్షేమాలు చూడాలంటే- మన అర్హత అది. అందుకే గురుదేవులు రామకృష్ణ పరమహంస ‘మన భారాన్ని మోసే బాధ్యతను భగవంతుడికి ఇచ్చేయండి! సమకూర్చటం, సంరక్షించటం అంతా ఆయనే చూసుకుంటాడు’ అనేవారు.

చక్రి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని