హంస.. వేటగాడు

ఒక వేటగాడు అడవిలో ఎంతసేపు తిరిగినా ఒక్క జంతువూ దొరకలేదు. అలసట, నిరాశ కమ్ముకోగా.. చెట్టు కింద పడుకున్నాడు.

Published : 14 Mar 2024 00:03 IST

క వేటగాడు అడవిలో ఎంతసేపు తిరిగినా ఒక్క జంతువూ దొరకలేదు. అలసట, నిరాశ కమ్ముకోగా.. చెట్టు కింద పడుకున్నాడు. ఇంతలో ఒక హంస అటుగా వచ్చింది. ఎండ పడటం వల్ల వేటగాడు ఇబ్బంది పడుతున్నాడు. అది చూసి సాయం చేయదలచింది. అతడికి నీడ కల్పిస్తూ రెక్కలు చాపి కొమ్మ మీద కూర్చుంది. ఇదేమీ గమనించని వేటగాడు ఆ నీడలో హాయిగా నిద్రించసాగాడు. అప్పుడో కాకి అదే కొమ్మ మీద వాలి, హంసతో ఊసులాడింది. తర్వాత తన సహజ అలవాటు ప్రకారం రెట్ట వేసి, మరో కొమ్మ మీదికి వెళ్లిపోయింది. మీద రెట్టపడి మేల్కొన్న వేటగాడు ఎదురుగా కనిపించిన హంసను బాణంతో కొట్టాడు. హంస గిలగిలా కొట్టుకుంటూ ‘నీకు నీడనిచ్చి సేవ చేశాను. కానీ నువ్వు బాణంతో గాయపరిచావు’ అంది బాధగా. పక్కన మరో కొమ్మ మీదున్న కాకిని చూసి జరిగిందేమిటో గ్రహించాడు. పశ్చాత్తాపం చెంది ‘నీది ఉన్నత జన్మ. నీ శరీరంలాగే నీ ఆలోచనలూ అందంగా, ఆహ్లాదంగా ఉంటాయి. కష్టంలో ఉన్నవారికి సేవ చేయాలనే సదుద్దేశం నీది. ఇన్ని సద్గుణాలు ఉంటేనేం.. ఒక్క పొరపాటు చేశావు. కాకి నీ చెంతకు వచ్చినప్పుడు దాన్ని తరిమేయాలి లేదా నువ్వే వెళ్లిపోవాలి. అలా చేయలేదు కనుకనే దాని సాంగత్యం నిన్ను మరణ ద్వారం వద్దకు తీసుకెళ్లింది’ అన్నాడు వేటగాడు. సజ్జన సాంగత్యం హితం చేకూరుస్తుంది, దుర్జనులతో చెలిమి చేటు చేస్తుంది- అని ఉదాహరిస్తూ ఓ గురువు తన శిష్యులకు చెప్పిన కథ ఇది.               

రమా శ్రీనివాస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని