ముందుకు సాగిపో!

కట్టెలు కొట్టి జీవనం సాగించే నిరుపేద వ్యక్తిని చూసిన ఒక సాధువుకు సానుభూతి కలిగింది. అతని దగ్గరకు వెళ్లి ‘ఎన్నాళ్లిలా చెట్లు నరుకుతూ ఇక్కడే ఉండి కష్టపడతావు? ముందుకు వెళ్లు’ అన్నాడు. సాధువు సలహా పాటించి అతడు అరణ్యంలో కొంచెం ముందుకు వెళ్లాడు.

Published : 21 Mar 2024 00:07 IST

పరమహంస కథలు

ట్టెలు కొట్టి జీవనం సాగించే నిరుపేద వ్యక్తిని చూసిన ఒక సాధువుకు సానుభూతి కలిగింది. అతని దగ్గరకు వెళ్లి ‘ఎన్నాళ్లిలా చెట్లు నరుకుతూ ఇక్కడే ఉండి కష్టపడతావు? ముందుకు వెళ్లు’ అన్నాడు. సాధువు సలహా పాటించి అతడు అరణ్యంలో కొంచెం ముందుకు వెళ్లాడు. అక్కడ చందన వృక్షాల వనం కనిపించింది. ఆ గంధం చెట్లను నరికి, విక్రయించి ధనికుడయ్యాడు. ‘సాధువు ఇక్కడ ఆగిపొమ్మనలేదు, ముందుకు వెళ్లమన్నాడు కదా!’ అనుకున్న శ్రామికుడు ఇంకా ముందుకు వెళ్లాడు. అక్కడ అతనికి రాగి గని కనిపించింది. ఆ లోహాన్ని తవ్వి, అమ్ముతూ మరింత ధనవంతుడయ్యాడు. అక్కడితో ఆగిపోకుండా ఇంకా ఇంకా ముందుకు వెళ్లగా.. కట్టెలు కొట్టే వ్యక్తికి వెండి, ఆపైన బంగారు గనులు తారసపడ్డాయి. చివరికి అతనికి వజ్రాల గని కనిపించింది. దాంతో అతడు కుబేరుడైపోయాడు. గురుదేవులు రామకృష్ణ పరమహంస- శిష్యులకు తరచూ ఈ కథ చెప్పేవారు. ‘ఆధ్యాత్మిక ప్రయాణంలో చిన్న చిన్న అనుభూతులు, దర్శనాలతో సంతృప్తి చెందకూడదు. సాధనల విషయంలో ఇంకా, ఇంకా ముందుకు వెళ్లాలి. పారమార్థిక చైతన్యానికి ముగింపు అంటూ ఏమీ లేదు. సాధన తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఆధ్యాత్మిక అనుభూతి సాంద్రత మరింత పెరుగుతుంది’ అంటూ హితవు పలికేవారు.

చక్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు