పట్టణమే అరణ్యమైంది!

ఇక్ష్వాకు మహారాజు కుమారుడు దండుడు అందరినీ హింసించేవాడు. అలాంటి దుర్మార్గుణ్ణి దూరంగా ఉంచడమే సముచితమని భావించిన మహారాజు అతణ్ణి వింధ్యపర్వతాలకు పొమ్మన్నాడు. అలా వెళ్లిన దండుడు ఆ పర్వతాలకు దక్షిణాన మధుమంతం పట్టణాన్ని నిర్మించి, పాలించాడు.

Published : 21 Mar 2024 00:04 IST

 

క్ష్వాకు మహారాజు కుమారుడు దండుడు అందరినీ హింసించేవాడు. అలాంటి దుర్మార్గుణ్ణి దూరంగా ఉంచడమే సముచితమని భావించిన మహారాజు అతణ్ణి వింధ్యపర్వతాలకు పొమ్మన్నాడు. అలా వెళ్లిన దండుడు ఆ పర్వతాలకు దక్షిణాన మధుమంతం పట్టణాన్ని నిర్మించి, పాలించాడు. రాక్షసులతో స్నేహం చేసి, గురువైన శుక్రాచార్యుని వద్ద విద్య అభ్యసించాడు. ఒకసారి ఆశ్రమానికి వెళ్లినప్పుడు ఒంటరిగా తపస్సు చేస్తున్న శుక్రాచార్యుని కుమార్తె అరజను చూశాడు. ఆ సౌందర్యానికి ఆకర్షితుడై దగ్గరకు వెళ్లాడు. దండుడి చూపులను పసిగట్టిన అరజ ‘నేను శుక్రాచార్యుని పుత్రికని. గురుపుత్రి సోదరితో సమానం. వెంటనే వెళ్లిపో’ అంది. ఆమె మాటను లక్ష్యపెట్టక, బలవంతంగా రమించాడు. తండ్రి రాగానే విలపిస్తూ జరిగిందంతా చెప్పింది అరజ. ఆగ్రహించిన అతడు- దండుడు సపరివారంగా నేలపాలు అవుతాడని, మధుమంతం పట్టణం చుట్టూ నూరు యోజనాల మేర ఏడురోజుల వరకూ మట్టివాన కురుస్తుందని, ఆ ప్రాంతం జనశూన్యం అవుతుందని శపించాడు. శుక్రుని శాప ప్రభావంతో మధుమంతం పట్టణం మట్టిదిబ్బ అయ్యింది. ఆ ప్రదేశమంతా అరణ్యంగా మారింది. ఆ అరణ్యమే దండుని పేరుతో దండకారణ్యంగా ప్రసిద్ధి చెందింది. అక్కడికే శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్లాడు.

శరత్‌ చంద్రిక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని