శ్రీకృష్ణుడి విశ్వరూపం

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని దర్శింపచేశాడు.

Published : 28 Mar 2024 00:05 IST

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని దర్శింపచేశాడు. అంతేనా.. ఆ పరంధాముడు తన విశ్వ రూపాన్ని బాల్యావస్థలోనే పెంపుడు తల్లి యశోదకు తొలుత చూపించాడు. ‘మన్ను తిన్నావా?’ అని దండిôచ బోయినప్పుడు నోరు తెరిచి తన నిజస్వరూపాన్ని చూపాడు. ఉద్యోగపర్వంలో రాయబారం కోసం ధృతరాష్ట్రుని కొలువుకు వెళ్లినప్పుడు కౌరవులు శ్రీకృష్ణుణ్ణి బంధించాలని ప్రయత్నించారు. వారిని హెచ్చరించటానికి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కురుక్షేత్ర యుద్ధసమయంలో భగవద్గీతను బోధిస్తూ విజయుడికి నిజస్వరూపాన్ని ప్రదర్శింపజేయడం జగద్విదితమే! ఇక చివరిసారి మహా భారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు సోదరి సుభద్రను తీసుకుని ద్వారకకు బయల్దేరాడు. మార్గమధ్యంలో ఉదంకుడు అనే రుషి ఆతిథ్యాన్ని స్వీకరించాడు. యుద్ధ విషయం తెలియని ఆ మహర్షి కౌరవుల క్షేమ సమాచారాలు అడిగాడు. వారు సమరంలో చనిపోయారని శ్రీకృష్ణుడు చెప్పాడు. అది విన్న ఉదంకుడు అతడిపై ఆగ్రహించాడు. ‘నీకు యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్నా! ఆపలేదు’ అంటూ శపించబోయాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ‘ఓ మునీ! నీ తపోశక్తిని వృథా చేసుకోవద్దు. నేను సర్వాంతర్యామిని’ అంటూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఇలా భారత, భాగవతాల్లో నాలుగుసార్లు శ్రీకృష్ణుడు తన దివ్యమైన విశ్వరూపాన్ని చూపాడు.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు