పదోఅంతస్థు

శంకరులవారి భజగోవిందంలో ‘మా కురు ధనజనం యవ్వన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వం..’ అనే శ్లోకానికి- ‘స్నేహితులను తలచుకుని లేదా యుక్త వయసులో ఉన్నానని గర్వించవద్దు.

Published : 11 Apr 2024 00:03 IST

శంకరులవారి భజగోవిందంలో ‘మా కురు ధనజనం యవ్వన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వం..’ అనే శ్లోకానికి- ‘స్నేహితులను తలచుకుని లేదా యుక్త వయసులో ఉన్నానని గర్వించవద్దు. సమయం వచ్చినప్పుడు క్షణంలో నశిస్తాయవి. భ్రాంతులు, మాయా ప్రపంచం నుంచి బయటపడండి’ అన్నది భావం. అది చెబితే తనకు సరిగా అర్థం కాలేదన్నాడో శిష్యుడు. శంకరులు సందేహనివృత్తి చేస్తూ ‘ఒక ధనికుడు పెద్ద భవనం కట్టాడు. పదో అంతస్థును మరింత ప్రత్యేకంగా కళ్లు చెదిరేలా నిర్మించాడు. నగరానికి సాధువు వచ్చాడని తెలిసి, తన భవనాన్ని సందర్శించేందుకు ఆయన్ను ఆహ్వానించాడు. నిజానికి ఆ రూపంలో వచ్చింది మహాశివుడే. సాధువు పదో అంతస్థు కూడా చూసిన తర్వాత.. ఎలా ఉందని అడిగాడు ధనికుడు. ‘ఇది నిశ్చయంగా అద్భుతమైన భవనం. కానీ నీ మరణం తర్వాత శవాన్ని కిందికి తీసుకెళ్లడం మాత్రం కష్టం’ అనేసి వెళ్లిపోయాడాయన. ఆ మాటతో ధనికుడికి కళ్లు తెరుచుకున్నాయి. అప్పటి వరకు తన సంపదలు చూసి గర్వించిన అతడికి వస్తు సంపదల పట్ల విముఖత్వం కలిగింది. దానధర్మాల్లాంటి సత్కార్యాలతో పుణ్యం సంపాదించడమే అసలైన సంపద అని తెలిసొచ్చింది. తర్వాతెన్నడూ ధనికుడు తన భవనం చూడమంటూ ఎవరినీ ఆహ్వానించలేదు. ధనరాశులను చూసుకుని మురిసిపోలేదు. సేవాకార్యక్రమాలతో తరించాడు. శిష్యా! నేను రాసిన ఈ పాదం వెనుక ఇంత లోతైన అంశాలున్నాయి. ధనం, అనుచరగణం, యౌవనం ఉన్నాయని గర్వించకూడదు. ఇవన్నీ నిమిషంలో హరించిపోతాయి. ఈ ప్రపంచమంతా భ్రమతో కూడిన మాయాజాలమని గ్రహించి, ఎవరైతే ఆ పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేస్తారో వారికి మాత్రమే ఆత్మానుభూతి కలుగుతుంది అన్నది ఇందులోని అంతరార్థం’ అంటూ కథ రూపంలో వివరించారు.

ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని