రావణునికి వృషభ శాపం

అమృతం కోసం దేవతలు, రాక్షసులు చేసిన క్షీరసాగర మథనంలో ఎన్నో వస్తువులు ఆవిర్భవించాయి. వాటన్నింటితో పాటు హాలాహలం ఎగజిమ్మింది. దేవదానవులందరూ భయపడ్డారు.

Published : 11 Apr 2024 00:04 IST

మృతం కోసం దేవతలు, రాక్షసులు చేసిన క్షీరసాగర మథనంలో ఎన్నో వస్తువులు ఆవిర్భవించాయి. వాటన్నింటితో పాటు హాలాహలం ఎగజిమ్మింది. దేవదానవులందరూ భయపడ్డారు. అప్పుడు జగద్రక్షకుడైన పరమశివుడు ఆ హాలాహలాన్ని పరమ ప్రీతితో సేవించాడు. ఆ ప్రయత్నంలో కొన్ని విషపు చుక్కలు నేలపై చిందబోతుండగా - వెంటనే వాటిని నందీశ్వరుడు తాగేశాడు. అది చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. నందీశ్వరుడికి ఏమవుతుందోనని ఆందోళన చెందారు. అప్పుడా మహాదేవుడు అభయమిస్తూ ‘నంది నా నమ్మినబంటు. నన్ను శరణుజొచ్చినవాడు. అందుకే నా శక్తులన్నీ అతడికి సంక్రమించాయి. నందికి నా రక్షణ ఎన్నటికీ ఉంటుంది’ అన్నాడు. తనను విశ్వసించిన వారికి పరమేశ్వరుడు ఎంత శక్తినిస్తాడో ఆ సంఘటన స్పష్టం చేసింది. పరమేశ్వరుడి వాహనమైన వృషభాన్ని ధర్మానికి ప్రతిరూపంగా భావిస్తారు. ‘వృష’ అంటే ఉత్కృష్టమైన, ‘భ’ అంటే ప్రకాశం అని అర్థం. ఆ రెండూ కలిసి ‘వృషభం’ అనే నామం నందికి సార్థకమైంది. మహేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు రావణుడు ఒకసారి కైలాసానికి వెళ్లగా నందీశ్వరుడు అతణ్ణి అడ్డగించాడు. దాంతో కోపగించిన లంకాధీశుడు ‘నువ్వో సామాన్యమైన ఎద్దువి! నన్ను అడ్డగిస్తావా?’ అంటూ తూలనాడాడు. పైగా కోతిలా కనిపిస్తున్నావని వెక్కిరించాడు. దాంతో వృషభం ఆగ్రహించి.. ‘కోతి చేతిలో నీ సామ్రాజ్యం దహనమవుతుంది. వానర మూక దాడి చేయడంతో నువ్వు పతనమవుతావు’ అని శపించింది. పరమేశ్వరుడు ‘పరమాత్మ’కు ప్రతీక అయితే, ‘వృషభం’ జీవాత్మకు ప్రతీక అని మన ధర్మగ్రంథాలు వ్యాఖ్యానించాయి.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని