ప్రకృతే గురువు

హిమాలయమంత ఉన్నతమైంది, గంగా జలంలా పవిత్రమైంది హిందూధర్మం. అందుకే ఈ ధర్మం యుగయుగాలుగా మనుగడ సాగిస్తూ కొనసాగుతోంది. ఇది వేదాల్లోంచి జనించినందువల్లే ఇంతటి శక్తి కలిగుంది.

Published : 25 Apr 2024 00:07 IST

హిమాలయమంత ఉన్నతమైంది, గంగా జలంలా పవిత్రమైంది హిందూధర్మం. అందుకే ఈ ధర్మం యుగయుగాలుగా మనుగడ సాగిస్తూ కొనసాగుతోంది. ఇది వేదాల్లోంచి జనించినందువల్లే ఇంతటి శక్తి కలిగుంది. అందుకే మనదేశాన్ని వేదభూమి, కర్మభూమి, ధర్మభూమి, పుణ్య భూమి- అంటూ వర్ణించారు. సమైక్యంగా, ప్రేమభావంతో జీవించమని ఉపదేశిస్తున్నాయి వేదాలు. కుటుంబంలోనూ ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలో బోధిస్తాయి. తండ్రిని అనుకరించాలని, తల్లి మనసును నొప్పించకూడదని, భార్యాభర్తలు పరస్పర అవగాహనతో ఉండాలని తెలియజేస్తున్నాయి. తోడపుట్టినవాళ్లు కలహించుకో కూడదని పేర్కొంది అధర్వణవేదం. కుటుంబమే కాదు, సమాజశ్రేయస్సూ ముఖ్యమని, సకల ప్రాణికోటీ ఐకమత్యంగా ఉండాలని బోధిస్తుంది రుగ్వేదంలోని సంవనన సూక్తం. సంవనన అంటే జయించడం అనే అర్థముంది. అంటే అవసరమైనవి సాధించుకునేలా ప్రేరేపిస్తుందిది. ఇలా వేద ఆధారితమైన హిందూధర్మం- ‘సర్వేజనాః సుఖినో భవంతు’ అంటూ సర్వ జనావళి సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తుంది. ప్రకృతిలో అణువణువునా పరమాత్మను దర్శిస్తుంది. ప్రకృతినే గురువుగా భావిస్తుంది. పకృతి నుంచే పాఠాలు నేర్చుకోమంటుంది. తులసిమొక్కకి పవిత్ర స్థానం ఇచ్చింది హిందూధర్మం. సర్వతీర్థాలను, దేవతలను కలిగున్న తులసిని తులసీమాతగా కీర్తించింది. హిందూధర్మం ప్రవచించే సూత్రాలన్నింటిలో ఆధ్యాత్మికత ఇమిడి ఉంటుంది. మన ఆచారాలు భక్తిని ప్రేరేపించడమే కాదు, ప్రశాంతతనిచ్చి, అభ్యున్నతి దిశగా నడిపిస్తాయి.

నూతి శివానందం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని