నమ్మకం కోల్పోకూడదు..

ఒక ధనికుడికి దైవభక్తి ఎక్కువ. అతడో రోజు సొంత పడవలో సముద్రంలో ఒంటరిగా షికారుకి వెళ్లాడు. ఉవ్వెత్తున అలలు రావడంతో పడవ ధ్వంసమైంది.

Published : 02 May 2024 00:34 IST

ఒక ధనికుడికి దైవభక్తి ఎక్కువ. అతడో రోజు సొంత పడవలో సముద్రంలో ఒంటరిగా షికారుకి వెళ్లాడు. ఉవ్వెత్తున అలలు రావడంతో పడవ ధ్వంసమైంది. గబుక్కున సముద్రంలోకి దూకి, అతి కష్టమ్మీద ఒక ద్వీపానికి చేరుకున్నాడు.

ఆ ద్వీపంలో మనుషుల జాడ లేదు. చుట్టూ నీళ్లు తప్ప మరేం కనిపించలేదు.

 ధనికుడు మొదట బాధపడినా.. వెంటనే తేరుకుని, తనను మరణం నుంచి రక్షించిన భగవంతుడు, తన ప్రాంతం చేరేందుకు కూడా దారి చూపిస్తాడు- అనుకుని స్థిమితపడ్డాడు. ఒంటరిగానే జీవిస్తూ, దొరికే పండ్లు, దుంపలూ తినడం అలవాటు చేసుకున్నాడు. కొంతకాలానికి అతడి ఆశలు నీరుగారినా.. దేవుడిపట్ల నమ్మకం మాత్రం తగ్గలేదు. బాధపడుతూనే ఓ గుడిసె నిర్మించాడు. తీరా పిడుగు పడి గుడిసె కాలిపోయింది. అతడు దుఃఖిస్తూ ‘దేవుడా! నీకిది న్యాయమా, ఎన్ని కష్టాలెదురైనా నీపై విశ్వాసాన్ని కోల్పోలేదు. కానీ నువ్వెందుకు దయ చూపడంలేదు?’ అంటూ దుఃఖించాడు. అంతలో ఓ పడవ వచ్చింది. ఇద్దరు వ్యక్తులు పడవ దిగి ‘మంటలు కనిపించడంతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారేమోనని రక్షించడానికి వచ్చాం. మీరీ గుడిసెను కాల్చి ఉండకపోతే, ఇక్కడో మనిషి ఉన్నట్టు తెలిసేది కాదు’ అన్నారు.

ధనికుడు పశ్చాత్తాపంతో ‘నన్ను రక్షించడానికే పిడుగు పడిందని గ్రహించలేకపోయాను. నువ్వు నా సహనాన్ని పరీక్షించావు. నేనందులో విఫలమయ్యాను. నమ్మినవారిని నిశ్చయంగా కాపాడతావని మరోసారి నిరూపించావు. నన్ను మన్నించు ప్రభూ’ అంటూ నమస్కరించాడు.
ఎంతటి కష్టంలోనూ దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోకూడదు- అంటూ ఓ గురువు చెప్పిన కథ ఇది.    

- రమా శ్రీనివాస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని