నిత్యానందమే నిజమైన పారమార్థికత

షిల్లాంగ్‌ రామకృష్ణ ఆశ్రమంలో ఒకరోజు ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మఠానికి ఆనుకొని ఓ కుటుంబం ఉండేది. ఓ రోజు సాధు బృందమంతా రాత్రి భోజనం చేస్తున్న సమయంలో హఠాత్తుగా పక్కింటి పెద్దాయన ప్రత్యక్షమయ్యాడు.

Published : 02 May 2024 00:10 IST

షిల్లాంగ్‌ రామకృష్ణ ఆశ్రమంలో ఒకరోజు ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మఠానికి ఆనుకొని ఓ కుటుంబం ఉండేది. ఓ రోజు సాధు బృందమంతా రాత్రి భోజనం చేస్తున్న సమయంలో హఠాత్తుగా పక్కింటి పెద్దాయన ప్రత్యక్షమయ్యాడు. స్వాములందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడా గృహస్థు ‘క్షమించండి! స్వామీజీ ఇలా రావటం పొరపాటే! కానీ మా ఆవిడతో చిన్న వివాదం తలెత్తింది. అందుకే ఇలా వచ్చాను!’ అని వివరించాడు. ‘ఏమిటది?’ ఆశ్చర్యంగా ప్రశ్నించారు స్వామీజీలు. ‘మీ భోజనాల గదికి కొన్ని అడుగుల దూరంలోనే మా ఇల్లు ఉన్నందున మీ మాటలన్నీ వినిపిస్తుంటాయి. మీరంతా తినేటప్పుడు చాలా సరదాగా మాట్లాడుతుంటారు. ఆ నవ్వులు, కోలాహాలు విని మా ఆవిడ ‘స్వామీజీలు రుచికరమైన అనేక వంటలతో భోజనం చేస్తుంటారేమో! అందుకే వాళ్లు చాలా ఉల్లాసంగా ఉంటారు’ అంటుంటుంది. నేనేమో ‘లేదు! ఆశ్రమం ఆర్థికంగా అంత మంచి స్థితిలో లేదు. అన్ని రకాల వంటలు చేసుకునే అవకాశం లేదు. అలాంటప్పుడు స్వామీజీలు అద్భుతమైన పదార్థాలు ఎలా తినగలరు? వాళ్ల తత్త్వం అలాంటిది. సహజంగానే సంతోషంగా ఉంటారు’- అని చెబుతుంటాను. కానీ మా ఆవిడ నా మాటలను అంగీకరించటం లేదు. అందువల్ల నేను స్వయంగా చూసి తెలుసుకొని, నా భార్యకి అసలు సంగతేమిటో చెబుతామని వచ్చాను’ అన్నాడు. అప్పుడు స్వామీజీలందరూ మరింత ఉల్లాసంగా ఆయనను కూడా తమతో కలిసి తినమని ఆహ్వానించి, తమతో పాటు సాధారణ భోజనమే వడ్డించారు. ‘ఆనందం అనేది పరిస్థితుల్లో, పదార్థాల్లో ఉండదు. మన మనసులో ఉండాలి. ఆధ్యాత్మికతకు అదే ఆనవాలు’ అని నిరూపించారు. భర్త అనుభవపూర్వకంగా చూసి చెప్పగా.. ఆ గృహణికి విషయం బోధపడింది. అప్పటి నుంచి ప్రత్యేక దినాల్లో స్వయంగా తనే మిఠాయిలు, ఇతర ప్రత్యేక వంటకాలు తయారు చేసి ఆశ్రమానికి పంపిస్తుండేది.

- ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని