ధర్మమార్గంలోనే ధన్యత

మనం సమగ్రంగా రూపొందడానికి చేకూర్చుకోవాల్సిన సంపద శీలం. లోకంలో మనుషులు రెండు రకాల స్వభావాలను కలిగుంటారు.

Published : 16 May 2024 00:27 IST

 


మనం సమగ్రంగా రూపొందడానికి చేకూర్చుకోవాల్సిన సంపద శీలం. లోకంలో మనుషులు రెండు రకాల స్వభావాలను కలిగుంటారు. సద్గుణాలతో దైవలక్షణాలు కలవారు కొందరైతే, చెడు లక్షణాలతో అసుర ప్రవృత్తి కలవారు మరికొందరు. గీతలో శ్రీకృష్ణభగవానుడు శీల స్వభావాలను గురించి స్పష్టంగా ప్రవచించాడు. నిర్భయత్వం, ఇంద్రియనిగ్రహం, అంతఃకరణశుద్ధి, సత్యభాషణం, అహింస, త్యాగం, క్షమ, ధైర్యం వంటి సద్గుణాలే దైవీసంపద. కపటం, దర్పం, పౌరుషం, కామం, క్రోధం వంటి లక్షణాలు రాక్షస సంపత్తి. వీరు విషయభోగాలే సుఖమని భావిస్తారు. లౌకికవాంఛలను నెరవేర్చుకునేందుకు ఇతరులకు ఎంత హాని చేసేందుకైనా వెనకాడరు. పరుల సొమ్మును ఆశించటం, పరకాంతావ్యామోహం, ఒకరిని దూషించడం, హింసించడం వంటి లక్షణాలు ఉన్నవారి గురించి ఆదిశంకరాచార్యులు- ‘శారీరక అందాలు మాంసపుముద్దలు మాత్రమే. వాటిని చూసి మోహావేశాలెందుకు? ఆత్మావలోకనం ముఖ్యం. యుక్తాయుక్త విచక్షణాజ్ఞానాన్ని కోల్పోకూడదు..’ అంటూ తేటతెల్లంగా వివరించారు. సద్గుణసంపన్నులైన సజ్జనులను గురించి సుభాషితకర్త భర్తృహరి- ‘ఇతరులు తమను నిందించినా, ప్రశంసలు కురిపించినా, సంపదలు ఉన్నా, పోయినా, ఏది దక్కినా, అన్నీ చేజారినా.. నీతికోవిదులైనవారు ధర్మమార్గాన్ని మాత్రం ఎన్నడూ వదలరు’ అంటూ స్పష్టంచేశాడు. ‘సంపదలు గనుక పోతే ఏమీ నష్టం లేదు. ఆరోగ్యం పోతే కొంత చేజారినట్టు. అదే శీలం పోతే మట్టుకు సర్వం కోల్పోయినట్లు..’ అంటూ ఆంగ్లంలో నానుడి ఉంది. కనుక సౌశీల్యం అనేది దేశంతో, కాలంతో సంబంధం లేకుండా ఎక్కడైనా, ఎవరికైనా చాలా ముఖ్యమైంది. కనుక ధర్మమార్గంలో నడిచి ధన్యులమవుదాం.

 

 

- మామడూరు శంకర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని