నిష్కామం.. నిర్వచనం

‘గురువర్యా! నిష్కామం అంటే ఏమిటో బోధపడలేదు’ అన్నాడో శిష్యుడు. బదులుగా స్వామి చిన్మయానంద- ‘ఓ కథ చెబుతా, విను! ఒక ధనికుడు తాను నిష్కామినని చెప్పేవాడు.

Published : 16 May 2024 00:31 IST

 


‘గురువర్యా! నిష్కామం అంటే ఏమిటో బోధపడలేదు’ అన్నాడో శిష్యుడు. బదులుగా స్వామి చిన్మయానంద- ‘ఓ కథ చెబుతా, విను! ఒక ధనికుడు తాను నిష్కామినని చెప్పేవాడు. నిజానికి అతడిలో అనేక కోరికలు, లోభాలు, మోహాలు ఉండేవి. ఎవరి పట్లా ఎందులోనూ సంతృప్తి కలిగేది కాదు. ఒకసారి తన వద్దనున్న పనివాళ్లు సమర్థులు కారనే అశాంతితో దేవుణ్ణి ఆరాధించి.. శరవేగంగా పనిచేసే వరవ్యక్తిని పొందాడు. పని చెబుతూనే ఉండాలని దేవుడు హెచ్చరించగా.. ఒకటి పూర్తవకుండానే ఇంకో పని చెబుతానన్నాడతడు. వరవ్యక్తి ఏ పనైనా క్షణాల్లో పూర్తిచేసి ఇంకో పని చెప్పమనసాగాడు. ధనికుడికి ఏం చెప్పాలో తోచక.. ఇంటి ముంగిట ఉన్న తాటిచెట్టు ఎక్కమన్నాడు. క్షణంలో చెట్టెక్కి, మరో పని అడిగితే.. కిందికి దిగమన్నాడు. అతడు దిగేసి ఇంకో పని చెప్పమంటే.. ‘కొత్తపని చెప్పే వరకూ ఎక్కి, దిగడమే నీ పని’ అన్నాడు. ఒకే పని పదేపదే చేయని వరవ్యక్తి అక్కణ్ణించి వెళ్లిపోయాడు. ఇందులో దాగిన మర్మం ఏమిటో అర్థమైందా? ధనికుడిలా నమ్మకం, తృప్తి లేకుంటే ఆపదలు కొనితెచ్చుకున్నట్టవుతుంది. పైగా పెత్తనం చేయడమే కాదు, తాను కూడా కష్టపడితేనే పని విలువ తెలుస్తుంది. గౌరవం దక్కుతుంది. వచ్చే ప్రతిఫలం ఆనందాన్ని ఇస్తుంది. తనకూ, ఇతరులకూ కూడా శ్రేయస్సు చేకూర్చే పనులు చేస్తూ, విరామ సమయాల్లో ఆధ్యాత్మిక విషయాల పట్ల ధ్యాసపెడితే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిష్కామం అంటే దేనిమీదా కోరిక లేకపోవడం. ఐహిక బంధాల మధ్య జీవిస్తున్నప్పుడు నిష్కామంగా ఉండనవసరం లేదు. ప్రేమ, దయలతో వ్యవహరిస్తే చాలు’ అంటూ వివరించారు.      - లక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని