ఉపకారం ఊపిరిగా.. జీవితం సార్థకం

బతుకును అర్థవంతంగా రూపొందించుకోవడం ఎలాగంటే.. జ్ఞాన సముపార్జన ద్వారా ఇతర జీవుల నుంచి విడివడిన మనం.. సద్గురువుల సూచనల మేరకు.. ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటూ విజ్ఞతను పెంచుకోవాలి.

Published : 16 May 2024 00:55 IST

కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం. ఈ జననమరణ చక్రంలో రెప్పపాటే జీవితం. అనిశ్చితికి ఆలవాలం. ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి. కానీ మనిషి మాత్రం తన అస్తిత్త్వాన్ని తెలియజేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ ప్రయత్నంలో భావోద్వేగాల నాలుగు స్తంభాలాటలో నలిగిపోతూనే ఉంటాడు.

 వృత్తిలో తపోనిష్ఠ

 బతుకును అర్థవంతంగా రూపొందించుకోవడం ఎలాగంటే.. జ్ఞాన సముపార్జన ద్వారా ఇతర జీవుల నుంచి విడివడిన మనం.. సద్గురువుల సూచనల మేరకు.. ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటూ విజ్ఞతను పెంచుకోవాలి. మాలిన్యాలేమైనా ఉంటే.. వదిలించుకోవాలి. మనకు నిర్దేశితమైన వృత్తి, ఉద్యోగాదులను తపోనిష్ఠతో నెరవేర్చాలి. వృత్తి మీద పూర్తి ధ్యాసతో కర్తవ్యాన్ని నూటికి నూరు శాతం నిర్వర్తించగలిగితే.. జీవితాన్ని సఫలం చేసుకున్నట్లే. బాధ్యతలను సక్రమంగా, ధర్మబద్ధంగా నిర్వహిస్తే.. తగిన ప్రతిఫలంతో పాటు గొప్ప మనశ్శాంతి లభిస్తుంది. అదొక్కటి చాలు జీవనం సాఫీగా సాగటానికి. అప్పుడు జీవితం అర్థవంతంగా, ఆదర్శప్రాయంగా ఉంటుంది. 

పూలే కాదు.. ముళ్లూ రాళ్లూ..

అనేక పరిస్థితులు అందరికీ ఒకలానే ఉంటాయి. వాటినెలా చూస్తున్నాం, మనసుకు ఎలా అందిస్తున్నాం- అనే దాన్ని బట్టి ఆనందమో, ఆందోళనో పర్యవసానమవుతుంది. అంటే సజావుగా సాగటం అనేది మనచేతిలో పనే. మనం నడిచే బాటలో అన్నీ పూలే కాదు.. ముళ్లూ రాళ్లూ కూడా ఎదురవుతాయి. ఆ కష్టనష్టాలను తప్పించుకుంటూ పుష్ప పరిమళాలను ఆఘ్రాణించడంలోనే చతురత, బతకనేర్చినతనం ఉంటాయి. అవరోధాలూ, అడ్డంకులను అధిగమిస్తూ సర్వదా సంతోషంగా ఉండేందుకు ఆధ్యాత్మిక చింతన ఎంతగానో ఉపకరిస్తుంది.

అసలు జీవితం అంటే ఏమిటి? ఏదైనా అర్థం ఉందా? అర్థం పరమార్థం ఏమీ లేకుండా పుట్టుక నుంచి మరణించే వరకూ సాధారణంగా కాలం గడపాల్సిందేనా.. అంటే.. అది సరికాదని చెబుతుంది మన భారతీయ సంప్రదాయం. బతికినంత కాలం బహుబాగు అనిపించుకుంటూ.. చనిపోయాక కూడా అందరికీ ఆదర్శంగా ఉండాలంటోంది. అందుకు మార్గం ఉందని, మనం సౌఖ్యంగా ఉంటూ, నలుగురి శ్రేయస్సుకు తోడ్పడే జీవనశైలిని అలవరచుకోమనీ హితవు పలుకుతోంది.

అర్థం పరమార్థం

సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణీ తనదైన పద్ధతిలో జీవితాన్ని గడుపుతుంటుంది. ఇది సహజం. వాటిలో ఒక జీవి మనిషి. మనకీ ఇతర జీవులకీ తేడా ఒకటుంది.. అదే జ్ఞానం. అది అక్షరజ్ఞానం కావచ్చు, లేదా అనంత విశ్వాన్ని అర్థం చేసుకుని జీవించగల శక్తీ కావచ్చు. జీవులన్నిటికీ ఆకలి, నిద్ర, భయం, మైథునం లాంటివన్నీ సమానమే. మరి మనం ఆ జీవుల నుంచి విడివడి మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాం అంటే.. జ్ఞాన సంబంధమైనవి, జీవితానికి అర్థాన్ని కల్పిస్తున్నవీ అయిన చతుర్విధ పురుషార్థాలను అనుసరిస్తుండటమే ప్రధాన కారణం. ధర్మార్థకామమోక్షాలు.. ఒకదాన్ని అనుసరించి ఒకటుంటాయి. అన్నీ సమ పాళ్లలో ఉన్న జీవితమే అర్థవంతమైన జీవితమని పెద్దలు నిర్ధరించారు. ధర్మంగా అర్థ సంపాదన, దాన్ని అనుసరించే హద్దుమీరని కోరికలతో మోక్షమనే లక్ష్యాన్ని చేరుకోవాలి.

ధ్యానమార్గం

జీవితానికి అర్థం చేకూరాలంటే చతుర్విధ పురుషార్థాలను సాధించాలి. మరి పరమార్థ సాధన ఎలా?- అనే ప్రశ్నకు సమాధానం ధ్యానం. ఆ మార్గం ద్వారా పరమాత్మను చేరగలగాలి. ధ్యానం అనేది రెండు విధాలుగా ఉంటుంది. అచ్చంగా సర్వసంగ పరిత్యాగంతో తపోనిష్ఠతో చేసేది ఒక రకం.. పురుషార్థాల సాధన మార్గంలో తపస్సులా చేసేది రెండో రకం.

అక్షరాలా నాటకమే..

జీవితమంటే నాటకమే. రంగస్థలం మీద నాటక ప్రదర్శనలో తనకిచ్చిన పాత్ర ఎలాంటిదైనా కావచ్చు.. దానికి తగ్గ హావభావ ప్రకటనలు, సంభాషణలతో న్యాయం చేకూర్చాలి. అంతేగానీ.. నేనిలాంటి పాత్ర పోషించటం ఏమిటి- అనుకుంటే ప్రేక్షకుల ముందు నవ్వులపాలవడం తథ్యం. సేవకుడి పాత్ర పోషిస్తే.. రాజు పాత్రకు వినయంగా నమస్కరిస్తూ, సమయానికి అన్నీ అందిస్తూ.. సేవ చేయాలి. అలా ఆ పాత్రలో లీనమై నటించాలే గానీ అందుకు భిన్నంగా ప్రవర్తించకూడదు. తాను కూడా మహారాజులా ఠీవిగా ఉండాలనుకుంటూ, అలా లేనందుకు అశాంతితో కుమిలిపోతే.. ఆ పాత్రలో జీవం ఉండదు. కొన్నిసార్లు అవసరార్థం నటించమని సూత్రధారుడు.. బలవంతంగా రంగస్థలం మీదికి నెట్టేస్తుంటాడు. అలాంటి హడావుడిలో.. ఆ వేషం తాలూకు మీసమో మరేదో చెదిరిపోతుంది. ఎదురుగా ఉన్న ప్రేక్షకులు నవ్వుతుంటారు. అలాంటప్పుడు దిగులుతో డీలాపడిపోతూ ‘అయ్యో ఇదేం ఖర్మ?’ అనుకునే కన్నా సమయస్ఫూర్తితో సందర్భానికి తగిన సంభాషణ అందుకుంటే.. నవ్వుతున్న నోళ్లు మూతపడతాయి. అలా చాకచక్యంగా వ్యవహరించాలే తప్ప.. అవమానంగా భావించడం, కుంగుబాటుకు గురవటం సముచితం కాదు. అలా అయితే.. ఎదుటివారు హేళన చేయడం తథ్యం. జీవితం కూడా అలాంటిదే. సమయస్ఫూర్తి, సందర్భానుసరణలతో జీవించగలిగితే అర్థవంతంగా ఉంటుంది. అందరి నుంచి మెప్పు పొందవచ్చు. లేదంటే నలుగురిలో నగుబాటే అవుతుంది.

కళాత్మకం.. సార్థకం

జీవితం అర్థవంతంగా సాగేందుకు కళాత్మక దృక్కోణం అవసరం. ‘అందమె ఆనందం.. ఆనందమె జీవన మకరందం..’ అంటూ నిర్వచించాడో కవీశ్వరుడు. ఆ వాస్తవాన్ని నిరంతరం గుర్తుచేసుకుంటూ, కళాత్మకతను పెంపొందించుకోవడం అవసరం. కనిపించే ప్రతిదాంట్లో అందాన్ని ఆస్వాదిస్తూ, అర్థం కానివాటిని శోధిస్తూ, సాధిస్తూ ముందుకు సాగాలి. అలాంటి సందర్భాల్లో మహనీయుల సూక్తులు ఎంతగానో తోడ్పడతాయి. అప్పుడిక జీవితం అర్థవంతంగా నిలుస్తుంది.. ఆహ్లాదాలు పంచుతుంది. అలా కాని పక్షంలో నీటి బుడగలా ఎప్పుడు అంతమవుతుందో తెలియని జీవితం ఏ అర్థం, పరమార్థం సాధించకుండానే మాయమవుతుంది. ఇక నిరుత్సాహమే మిగులుతుంది. మనవంటూ ముద్రలేవీ మిగల్చకుండానే బతుకు పరిసమాప్తమవుతుంది. ‘పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా..’ చందమవుతుంది. అందుకే జీవితం సార్థకం కావాలి. ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అన్న పండితవాక్యాన్ని అనుసరించి ఇతరులకు సాయం చేయడంలో సంతోషం, సంతుష్టి, సాఫల్యం అన్నీ ఉన్నాయి.
 డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని