జలమూ జగన్నాథుడే!

జలాలు మన మనుగడకు జీవనాడులు. ఈ పుడమిపై అమృత వాహినులుగా ప్రవహించే ఆ అంతర్యామి ఆశీర్వచనాలు. ‘రాయి కన్నా జలం బలమైంది. ప్రకృతిలోని అన్ని వనరులతో పోలిస్తే నదులు చైతన్య ప్రవాహంతో కూడినవి’ అన్నారు ఓ ఆధ్యాత్మిక గురువు.

Updated : 21 Mar 2024 00:18 IST

మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం

జలాలు మన మనుగడకు జీవనాడులు. ఈ పుడమిపై అమృత వాహినులుగా ప్రవహించే ఆ అంతర్యామి ఆశీర్వచనాలు. ‘రాయి కన్నా జలం బలమైంది. ప్రకృతిలోని అన్ని వనరులతో పోలిస్తే నదులు చైతన్య ప్రవాహంతో కూడినవి’ అన్నారు ఓ ఆధ్యాత్మిక గురువు. లౌకికంగా, పారమార్థికంగా కూడా జలం ఎంతో విలువైంది. అపర భగీరథుడిగా ప్రసిద్ధుడైన ఆర్థర్‌ కాటన్‌ జలాన్ని ‘ప్రవహించే బంగారం’ అన్నాడు.

దీనదాలను పరమపావనంగా భావించే సంప్రదాయం మనది. కైలాసవాసుడి జటాజూటం నుంచి జాహ్నవి, కోదండరాముడి నుంచి వరాన్ని పొంది శబరి తరంగిణులై ప్రవహిస్తున్న నేల మనది. పంచభూతాల్లో ఒకటైన నీరే సృష్టికి ప్రధాన కారణమన్నారు మన మహర్షులు. నరుల నాగరికతా బీజాలు నదీË తీరాల్లోనే అంకురించి, ఆ నదుల వెంటే తీగలు సాగాయి. అయోధ్య నిర్మాణ సమయంలో.. రాజధాని నగరం నది ఒడ్డునే ఉండాలని రుషులు సంకల్పించి తపస్సు చేశారట. ఆ తపోఫలంగా పవిత్రమానస సరోవరం నుంచి ఒక పాయ సరయూ నదిగా ప్రవహించిందని ఇతిహాస కథనం. ఈ సరయూ తీరంలోనే అయోధ్య నిర్మితమైంది.

గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధిం కురు

అనాదిగా స్నానం చేసే ముందు పై మంత్రాన్ని చదివి, అన్ని పవిత్రమైన నదులనూ స్మరించుకోవటం మన ఆచారంలో భాగం. భారతీయ సంస్కృతి, నాగరికత, ఆధ్యాత్మిక జీవన స్రవంతిలో నదీనదాల ప్రాధాన్యం విశేషమైంది. నరుడనే నామాంతరం ఉన్న భగవంతుడు జలాలను సృష్టించాడన్నది పురాణ వచనం. అందుకే నీళ్లకు నారములని కూడా పేరు. అలాంటి నారములకు స్థానంగా ఉండటం వల్ల ఆయనను నారాయణుడని పిలుస్తారు. ‘నీరే నారాయణుడు’ అని స్తుతిస్తారు. ‘జలే విష్ణుః’ అని కీర్తిస్తారు. జలాల్లో ఆ జనార్దనుడు కొలువై ఉంటాడని నమ్మకం.

ఆధ్యాత్మికతకు ఆనవాలు

‘వేగంగా ప్రవహించే నదులు, జలరాశితో నిండిన సముద్రాలు మనల్ని రక్షించుగాక!’ అంటోంది రుగ్వేదం. ‘నీరు పుడమిని పునీతం చేయునుగాక!’ అంటోంది యజుర్వేదం. తరంగిణులను నదీమతల్లులుగా కొలవటం మన ఆధ్యాత్మిక సంప్రదాయం. నదుల పుష్కరాలు మనకు మహోత్సవం. నదికీ, మానవుడికీ మధ్య ఆత్మీయతను, అనుబంధాన్ని పెంచే ఉత్సవమిది. దేవతామూర్తులతో సమంగా నదులను స్తుతించడం, ఆరాధించడం మన ప్రత్యేకత. శంకరాచార్యుల వంటి జగద్గురువులు గంగ, నర్మద తదితర నదుల్ని స్తుతించి పులకించిపోయారు. ‘అలకనందా నది ప్రవాహ సడి నాకు కేదార రాగంలో వినిపిస్తుంది’ అన్నారు స్వామి వివేకానంద. వేదాలతో పాటు భారత, భాగవత, రామాయణాలను తేట తెలుగులోకి అనువదించిన దాశరథి రంగాచార్య- ‘నది బిందువుగా మొదలవుతుంది. జీవితమూ అంతే. నదిలో ఉపనదులు కలిసి.. విశాలమై, ప్రశాంతంగా ప్రవహిస్తుంది. కానీ కదలిక కనిపించదు. కొండలూ, కోనలూ ఎదురవుతాయి. నది జలపాతం అవుతుంది. హోరును సృష్టిస్తుంది. అలాగే జీవితంలో ఆపదలు ఎదురవుతాయి. అప్పుడే జీవితనాదం వినిపిస్తుంది. అది వికసిస్తుంది, ఇంద్రధనుస్సులు సృష్టిస్తుంది’ అంటూ నదిని జీవితంతో పోల్చారు.

ఘన సింధువులు

పవిత్ర భారతావనిలో ఒక్కో నదికి ఒక్కో విశిష్టత. ప్రతి నదీ ఓ ప్రత్యేక సింధువే! రచయిత, చిత్రకారుడు అడివి బాపిరాజు- ‘గంగానది రుషుల నది. యమున ప్రేమికుల నది. కృష్ణ శిల్పుల నది. కావేరి సంగీతకారుల నది, గోదావరి కవుల నది’ అన్నారు. అది అక్షరసత్యం. ఎందరో మునులు గంగాతీరాన్ని తమ ఆధ్యాత్మిక సాధనలు, బోధనలకు తావుగా చేసుకున్నారు. రామకృష్ణ పరమహంస ఆ నదీతీరంలోని దక్షిణేశ్వరాన్నే తమ సాధనాక్షేత్రంగా మలచుకున్నారు. యమునానది శ్రీకృష్ణ ప్రియవాహినిగా ఆయన అవతారాలతో పునీతమైంది. భారత, భాగవతాల్లో ఎన్నో ఘట్టాలు యమున ఒడ్డునే జరిగినట్లు ఆధారాలున్నాయి. అక్కడే రాధామాధవుల ప్రేమగంధం పరిమళించింది. విజయవాడ కనకదుర్గ, శ్రీశైల మల్లికార్జున వంటి ఆలయాల నిర్మాణానికి కృష్ణానది సాక్షీభూతంగా నిలిచింది. పవిత్ర కావేరీ తీరంలోనే సంగీత త్రిమూర్తులుగా ప్రసిద్ధులైన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి తమ గళాలను, కావేరీ గలగలలతో సమంగా సవరించుకున్నారు. గోదావరి నీటిలో, ఆ గాలిలో, ఆ తీరంలో కవిత్వాన్ని మేల్కొలిపే లక్షణమేదో ఉంది. నన్నయ, శ్రీనాథుడు వంటి కవిసార్వభౌములు అక్కడే తమ ఘంటాలకు ఒరవడి పెట్టారు. నర్మదానది విహారాన్ని ఆధ్యాత్మిక సాధనగా భావిస్తారు. ఎందరో సాధకులకు నర్మదానది అమ్మవారి రూపంలో దర్శనమిస్తుంది అనడానికి ఎన్నో ఆధారాలున్నాయి.

కవితా ‘స్రవంతులు’

నదులను నేపథ్యంగా చేసుకుని కవితలల్లిన భక్తకవులున్నారు. పాండురంగడి భక్తుడు ఏకనాథ్‌ కవిత్వంలోనూ నదుల ప్రస్తావన కనిపిస్తుంది. గోదావరి గలగలల్లో వేదఘోషనే వినగలిగారు ఆరుద్ర. ‘వేదంలా ఘోషించే గోదావరి..’ అంటూ పదాలతో ప్రణామాలు అర్పించారు. కృష్ణానది అంటే వేటూరి సుందరరామమూర్తికి మహా ప్రీతి. ఓ గీతంలో ‘కృష్ణా తరంగాల సారంగ రాగాలు, కృష్ణలీలా తరంగిణీ భక్తిగీతాలు’ అని ప్రస్తుతించారు. ‘కృష్ణలీలా తరంగిణి’ రచించిన నారాయణతీర్థుల జన్మస్థలం కృష్ణాతీరమైన మంగళగిరి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గోదావరి సింధువులో బిందువుగా మారిపోయి ‘గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై, జలజలనీ పారు సెల పాటలై తేటనై..’ అంటూ జలంతో మమేకమయ్యారు.
నదులను పూజించటం అంటే పరిశుద్ధంగా ఉంచటం, పరిరక్షించుకోవటం. నిత్యచైతన్య స్రవంతులైన నదులను స్వచ్ఛంగా ప్రవహించనిద్దాం. ‘నదులు, ఓషధులు, భూమాతను హింసించవద్దు’ అంటోంది యజుర్వేదం. ‘ఆపోభవస్తు పీతమ్‌’ అంటూ.. మీరు తాగటానికి శుద్ధమైన జలం ఈ భూమి మీద ఉండాలని ఆశీర్వదించింది. ‘నదులను అపవిత్రం చేయడమంటే దేవతలను అవహేళన చేయడమే’ అంది భాగవతం. జగ్గీవాసుదేవ్‌ వంటి ఆధ్యాత్మిక గురువులు నదుల పరిశుభ్రతకు, పరిరక్షణకు ఉద్యమాలే చేస్తున్నారంటే వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు.

బి.సైదులు


నీరంటే ప్రాణద్రవం

తాత్త్వికుడు, ఆధ్యాత్మిక పిపాసి సూర్యదేవర సంజీవదేవ్‌ యుక్తవయసులో హిమాలయాల్లోని మాయావతి అనే రమ్యమైన ప్రదేశానికి వెళ్లారు. రామకృష్ణమిషన్‌ అద్వైత ఆశ్రమంలో అతిథిగా ఉండి, ఆధ్యాత్మిక తరగతులకు హాజరయ్యారు. ప్రకృతి లీలానికేతనంగా నిలిచే హిమగిరుల పాదపీఠంలో పర్యటించారు. అరణ్యాలతో నిండిన లోయలు, జలజలా పారుతున్న సెలయేళ్లు ఆయనలోని రసజ్ఞుడిని మేల్కొలిపాయి. పారమార్థిక భావాలకూ ప్రాణం పోశాయి. అలా పర్యటిస్తూ సరయూనది తీరానికి చేరుకున్నారు. ఆ మనోహర తరంగిణిని చూసి తన్మయుడై, ఆ జలాలను తలపై చల్లుకుంటూ ‘నదీప్రవాహాలు విచిత్రమైనవి. ఎక్కడో నిర్జన పర్వతాËల్లో పుట్టి, జనారణ్యాల్లో ప్రవహించి, జీవరాశుల, వృక్షాల దాహం తీర్చి, ఆహారం అందిస్తాయి. జలమంటే ప్రాణద్రవం. సాక్షాత్తూ జగన్నాథుడి స్వరూపం’ అన్నారు. ఆ అనుభూతులను ‘తెగిన జ్ఞాపకాలు’ పుస్తకంలో పులకితులై రాసుకున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని