అసమాన ఆచార్యులు రామానుజులు

భక్తితో మోక్షసాధన సుసాధ్యం అని ప్రబోధించిన పరమాచార్యులు రామానుజులు. విశిష్టాద్వైత మతాన్ని తన పథంగా చేసుకుని.. కుల, మత, జాతులకు అతీతంగా అందరినీ తన మార్గంలోకి ఆహ్వానించారు.

Published : 09 May 2024 00:16 IST

మే 12 రామానుజ జయంతి

క్తితో మోక్షసాధన సుసాధ్యం అని ప్రబోధించిన పరమాచార్యులు రామానుజులు. విశిష్టాద్వైత మతాన్ని తన పథంగా చేసుకుని.. కుల, మత, జాతులకు అతీతంగా అందరినీ తన మార్గంలోకి ఆహ్వానించారు. ఆధ్యాత్మికంగా జాగృతం చేశారు. తమిళనాడులోని పెరంబదూర్‌లో జన్మించిన రామానుజులు.. బాల్యం నుంచే విభిన్నమైన ఆలోచనలతో అందరినీ ఆకర్షించారు. వైష్ణవ మత ప్రచారకుడైన యామునాచార్యుని మనవరాలి కుమారుడు రామానుజుడు. ఇతని భక్తికి ముచ్చటపడిన యామునాచార్యులు.. తనకు ఎందరో శిష్యులున్నా ఆధ్యాత్మిక వారసుడిగా రామానుజుడినే ఎన్నుకుని, తన తదనంతరం అతడే శ్రీరంగనాథ దేవాలయ ప్రధాన పూజారి కావాలని, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయాలని, విశిష్టాద్వైత మఠాధిపతి కావాలని ఆకాంక్షించారు. మరణశయ్యపై ఉన్నప్పుడు వాగ్దానం కూడా తీసుకున్నారు. రామానుజుల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల గొప్పతనం అంతటిది. జ్ఞానయోగాన్ని పునాదిగా చేసి, భక్తియోగాన్ని మహాసౌధంగా నిలిపి, కర్మయోగానికి పెద్దపీట వేసిన ఆచార్యులు రామానుజులు.

జాతిని జాగృతపరచి.. ‘అహం బ్రహ్మాస్మి.. నేనే బ్రహ్మను’ అంటూ అనర్హులెందరో అహంకరిస్తున్న రోజులవి. సర్వం మాయ, భ్రాంతి, మిథ్య- అంటూ వాటికి అర్థం తెలియని వాళ్లు మెట్టవేదాంతం వల్లిస్తూ, సాటి మనుషుల కన్నీళ్లు తుడిచేవారు కరువైన కాలమది. సమాజంలో అధిక, అధమ- వర్ణాల తారతమ్యం పెచ్చుమీరిన సమయంలో.. సామాన్యులకు అందనిది మతమే కాదని జాతిని జాగృతం చేశారు. అంతరాలను బాపి, ఆధ్యాత్మిక భావాల్ని అట్టడుగు వర్గాలకూ చేర్చారు.

ఆ ఆలయాల్లో ఆయన ముద్ర.. శ్రీరంగం శ్రీరంగనాథుని ఆలయం, కాంచీపురం శ్రీవరదరాజస్వామి ఆలయం, తిరుమల వేంకటేశ్వరస్వామి కోవెల- ఈ మూడింటితో రామానుజాచార్యుల జీవితం ముడిపడి ఉంది. ఆయన తిరుమల దర్శించిన సమయంలో శైవులు, వైష్ణవుల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రామానుజులు చొరవ తీసుకొని వాటిని రూపుమాపారు. తిరుమలేశుడే విష్ణు మూర్తి అని ఆధారాలతో రుజువు చేశారు. శ్రీవేంకటేశ్వరుని విగ్రహానికి శంఖచక్రాదులను అలంకరించి, అక్కడి ఆలయ వ్యవస్థకు రూపకల్పన చేశారు. అలాగే తిరుపతి గోవింద రాజస్వామి ఆలయాన్ని పునరుద్ధరించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

వైతాళికుడు.. విశాల హృదయుడు.. వర్ణవివక్ష, అంటరాని తనం, మూఢాచారాలు, స్వసుఖం, స్వీయముక్తి అనే స్వార్థ భావాలను రూపు మాపేందుకు ఎంతగానో కృషి చేశారు రామానుజులు. సంఘసంస్కరణ, సమాజశ్రేయస్సు, మానవ అభ్యుదయం కోసం పరిశ్రమించిన మహాచార్యుడు. దీనజనోద్ధరణ కోసం పరితపించిన విశాల హృదయుడు.

తరింపజేసే మంత్రం.. రామానుజులు ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ప్రచారం చేశారు. ‘కలియుగంలో తరింపజేసే మంత్రమిదే’ అనేవారాయన. ఆ మంత్రజపం జ్ఞానాన్నే కాదు శరణాగతినీ ప్రసాదిస్తుందని తెలియజేశారు. వ్యక్తి ఆనందానికి, సకలజనుల సౌభాగ్యానికి, ప్రపంచశాంతికి- ఈ మంత్రాన్ని మించింది లేదని ఘంటాపథంగా చెప్పారు. దివ్యజీవితాన్ని గడిపిన రామానుజులు, జీవితాంతం ఆ మంత్ర విశిష్టత గురించి చెబుతుండేవారు.
వినయమే జ్ఞానానికి వెలుగు.. జ్ఞానానికి ప్రకాశాన్నిచ్చేది వినయమేనని రామానుజులు నిరూపించారు. అద్వైతమత విజ్ఞానఖని అయిన యాదవ ప్రకాశుడనే పండితుడు.. రామానుజుని తర్కశాస్త్ర పరిజ్ఞానాలకు ఆశ్చర్య పోయారు. ఇలాంటి ఎందరో మేధావులను ఒప్పించారు, మెప్పించారంటే.. అందుకు రామానుజుల మేధ ఒక్కటే కాదు, వారి అణకువ, వినయ విధేయతలు, ప్రేమతత్వం, సహనం కూడా కారణాలు. వినయమే జ్ఞానానికి వెలుగును ప్రసాదిస్తుందని ఆచరణలో చూపిన ఆచార్యులాయన.   

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని