కృష్ణభక్తితోనే ముక్తి

రాధాకృష్ణ సంప్రదాయాన్ని నిరంతరాయంగా కొనసాగించిన మహాభక్తుడు చైతన్య మహాప్రభు. బెంగాల్‌, ఒడిశా మొదలైన ప్రాంతాల్లో ఆ మతానికి విస్తృత ప్రచారం కల్పించిన ఆయన్ను సాక్షాత్తూ శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తారు కొందరు. చైతన్య మహాప్రభు తన తల్లిదండ్రులకు పదో సంతానం.

Published : 21 Mar 2024 00:02 IST

మార్చి 25 శ్రీ చైతన్య మహాప్రభు జయంతి

రాధాకృష్ణ సంప్రదాయాన్ని నిరంతరాయంగా కొనసాగించిన మహాభక్తుడు చైతన్య మహాప్రభు. బెంగాల్‌, ఒడిశా మొదలైన ప్రాంతాల్లో ఆ మతానికి విస్తృత ప్రచారం కల్పించిన ఆయన్ను సాక్షాత్తూ శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తారు కొందరు. చైతన్య మహాప్రభు తన తల్లిదండ్రులకు పదో సంతానం. ఎనిమిది మంది శిశువులుగానే చనిపోగా తొమ్మిదోవాడైన విశ్వరూపుడు బాల్యంలోనే సన్యాసి అయ్యాడు. చైతన్యుడి అసలు పేరు ‘విశ్వంభరుడు’. సన్యాసం స్వీకరించి, శ్రీకృష్ణ చైతన్యుడయ్యాడు. చిన్నతనంలోనే శాస్త్రాలను, పురాణాలను చదివాడు. పాఠశాల స్థాపించి విద్యార్థులకు తర్కం, వ్యాకరణం బోధించాడు. పదకొండో ఏట తండ్రి చనిపోగా, శ్రాద్ధకర్మలు చేయడానికి గయకు వెళ్లాడు. అప్పుడే అతడిలో వైరాగ్య భావనలు ఉత్పన్నమయ్యాయి. ఇక సంసారానికి స్వస్తి పలికి, కేశవభారతి అనే సన్యాసి ద్వారా సన్యాస దీక్ష పొందాడు. తర్వాత అతడు పూరీక్షేత్రంలో, బృందావనంలో నివసించాడు. సమాధి స్థితికి చేరి బ్రహ్మానందాన్ని అనుభవించాడు. ఆయన ప్రత్యేకంగా ఒక మతాన్ని స్థాపించకపోయినప్పటికీ.. అతని శిష్యులు వ్యాసమహర్షి రచించిన బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానాలు రాశారు. అవి చైతన్య మతంగా ప్రచారం అయ్యాయి. ఆయన శిష్య కోటిలో రూపగోస్వామి సుప్రసిద్ధుడు. భక్తిని ఒక రసంగా ప్రవచించడమే కాదు, ‘భక్తి రసామృత సింధువు’ అనే గ్రంథాన్ని కూడా రాశాడితడు.

చైతన్య మహాప్రభు బోధనలు ‘దశమాలబోధనలు’గా ప్రసిద్ధి చెందాయి. ఆయన దృష్టిలో శ్రీకృష్ణపరమాత్మే దేవ దేవుడు. ఆయనే అనంతసత్యం. ఆ స్వామే రస సముద్రుడు, జీవులకు ఆధారం. కృష్ణభక్తితోనే ముక్తి లభిస్తుంది. శ్రీకృష్ణుణ్ణి ప్రేమించడమే మనందరి పరమ లక్ష్యం కావాలని చెప్పేవాడు. ఎందరికో స్ఫూర్తినిచ్చిన చైతన్య మహాప్రభు 48వ ఏట నిర్యాణం చెందాడు. ఆయన బోధనలే ఇస్కాన్‌ వ్యవస్థాపకులైన భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులకు ప్రేరణ కలిగించాయన్నది విజ్ఞుల అభిప్రాయం.

ఆచార్య మసన చెన్నప్ప


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని