అమ్మే కదా ఆది దైవం

అమ్మంటే ప్రేమ.. అమ్మంటే త్యాగం.. అమ్మంటే సేవ.. అమ్మంటే సహనం! ఇన్ని మహనీయ గుణాలు మూర్తీభవించిన మాతృమూర్తికి ఈ లోకంలో ఇంకెవరూ సాటిరారు. అమ్మస్థానం హిమాలయంలా మహోన్నతం. గంగానదిలా పరమపవిత్రం.

Updated : 09 May 2024 06:56 IST

మే 12 మాతృ దినోత్సవం

అమ్మంటే ప్రేమ.. అమ్మంటే త్యాగం.. అమ్మంటే సేవ.. అమ్మంటే సహనం! ఇన్ని మహనీయ గుణాలు మూర్తీభవించిన మాతృమూర్తికి ఈ లోకంలో ఇంకెవరూ సాటిరారు. అమ్మస్థానం హిమాలయంలా మహోన్నతం. గంగానదిలా పరమపవిత్రం. మాతృత్వ స్థానంతో ఆధ్యాత్మికంగానూ మహోన్నత స్థితికి చేరుకునే అమ్మను మించిన దైవం అవనిలోనే లేదు.

దమూడేళ్ల బాలుడు. ఆ రాత్రి రాజ ప్రాసాదం లాంటి తమ ఇంట్లో ఎప్పటిలానే ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు. కానీ ఆ నిశి రేయి నిశ్శబ్దంగా తన జీవితంలో పెను విషాదాన్ని మోసుకొస్తోందని అతను ఊహించలేదు. అర్ధరాత్రి హఠాత్తుగా ఆ ఇంటి వృద్ధదాసి పరుగుపరుగున గదిలోకి వచ్చింది. ‘బాబూ! జరగకూడనిది జరిగిపోయింది. అమ్మ మనల్ని విడిచి వెళ్లిపోయింది’ అంటూ అతన్ని పొదివి పట్టుకొని భోరున విలపించింది. అందాకా మరణమంటే ఏంటో తెలియని బాలుడికి.. మృత్యువంటే మరలిరాని లోకాలకు తరలిపోవటమని, అమ్మ అక్కడికి వెళ్లిపోయిందని అర్థమైంది. అప్పుడు శోకం తుపానులా ఆ పసిమనసుపై విరుచుకుపడిôది. కన్నతల్లికిచ్చిన కన్నీటి వీడ్కోలు అతనికి ఆజన్మాంతమూ మాయని గాయమై మిగిలిపోయింది. అనంతర కాలంలో ఆ ఆవేదనకు అక్షరాల ఆనవాలుగా ‘వసంత ప్రభాతాలలో విచ్చుకుంటున్న మల్లెపూలు పిడికెడు ఉత్తరీయం కొనకు కట్టుకొని వెర్రివాడిలాగా తిరిగినప్పుడు.. విరిసీవిరియని ఆ మల్లెమొగ్గలను పదే పదే నా నుదుటికి అద్దుకుంటున్నప్పుడు.. ప్రతినిత్యం మా అమ్మ చేతి వేళ్లు గుర్తుకు వచ్చేవి. అద్భుతమైన ఆ స్పర్శ మల్లెపూలలో నిర్మలంగా ప్రస్ఫుటమయ్యేది’ అంటూ రాసుకొని తన జ్ఞాపకాల పుటల్లో పదిలపరచుకున్నారు. అనంతమైన ఆ శోకం అతనిలో అంతర్మథనానికి దారితీసింది, అంతర్ముఖుణ్ణి చేసింది. అంతర్యామి అన్వేషణకు ఆదిమూలమై నిలిచింది. కాలాంతరంలో ఆయన మనోలేఖిని నుంచి ఆలోచింపచేసే అక్షరసుమాలు విరిశాయి. ఆ మహాకవి, తత్వవేత్తే రవీంద్రనాథ్‌ టాగోర్‌. అర్ధంతరంగా ఆయనను విడిచివెళ్లిన ఆ మాతృమూర్తే శారదాదేవి. ఆమె స్ఫూర్తితో రచించిన భక్తి భావాంజలే నోబెల్‌ పురస్కారం అందుకున్న ‘గీతాంజలి’.

మాతృత్వంలో ఉండే మాధుర్యం మాటలకు అందనిది. తండ్రి కన్నా గురువు కన్నా తల్లే గొప్పదని మన ధర్మశాస్త్రాలు నొక్కి వక్కాణించాయి. ‘గురూనాం మాతా గరీయసి’ అన్నది రుషివాక్యం. అంటే గురువుల్లో కెల్లా శ్రేష్ఠమైంది మాతృమూర్తి అన్నమాట. తండ్రి కంటే తల్లిని వేయిరెట్లు ఎక్కువ గౌరవించాలంటోంది మనుస్మృతి. తల్లితో సమానమైన గురువు లేడని ఘంటాపథంగా చెబుతూ ‘నాస్తి మాతృ సమో గురుః’ అంటోంది మహాభారతం. యక్షుడు ప్రశ్నల పరంపరలో భాగంగా- ‘భూమి కన్నా ఎవరికి ఎక్కువ సహనం?’ అనడిగితే.. ‘తల్లికి’ అని బదులిచ్చాడు ధర్మరాజు. లలితా సహస్రనామ స్తోత్రం కూడా ‘శ్రీమాతా’ అనే నామంతోనే ఆరంభమవుతుంది.

దివ్యత్వానికి ప్రతీక..

అమ్మ- అనే భావనలోనే దివ్యత్వం దాగి ఉంది. అందుకే అమ్మను ఆరాధించి తరించే తాత్త్వికత మన ధర్మంలో సంప్రదాయమైంది. మాతృత్వం అంటే వాత్సల్యం, త్యాగం, రక్షణ, క్షమ అనే మహోన్నత లక్షణాల సమాహారం. తల్లి ఇచ్చే సాంత్వన, ధైర్యం, స్ఫూర్తి మరెవ్వరూ ఇవ్వలేరు. నిరంతరం ఆ మాతృసాన్నిధ్య భావనను మనకు ప్రసరింపజేయటానికే జగదంబ ఆరాధన. అలాగే ‘తైత్తిరీయోపనిషత్తు’ మాతృస్థానానికి అత్యున్నత గౌరవాన్నిస్తూ ‘మాతృదేవో భవ’ అంటూ తల్లిని దైవంతో సమానంగా పూజించమని ప్రబోధించింది. ‘దేవీ మాహాత్మ్యం’ అమ్మవారిని స్తుతిస్తూ-

యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

సర్వజీవుల్లో మాతృస్వరూపమై నిలిచి ఉండే దేవికి పదేపదే నమస్కారాలు- అంటూ నీరాజనాలు అర్పించింది. తను ఊపిరితో ఉన్నప్పుడే కాదు, భౌతికంగా లోకాన్ని విడిచివెళ్లినా బిడ్డలకు స్ఫూర్తిగా నిలిచే అనుబంధం మాతృమూర్తిది. పుట్టిన నేలను మాతృభూమి అని, పుట్టిన దేశాన్ని మాతృదేశమని, జన్మతః వచ్చిన భాషను మాతృభాష అంటున్నామంటే అది అమ్మ విశిష్టత.

భౌతికంగా బిడ్డకు జన్మనివ్వటమే మాతృత్వం కాదు. శిశువుకు జన్మ ఇవ్వనంత మాత్రాన తల్లి కాకుండా పోరు. మాతృత్వభావన అనేది భౌతిక పరిమితులకు మించింది. ఏ బిడ్డను చూసినా మనసు స్పందించటం, వాత్సల్యం పొంగిపొరలటం అమ్మతనమే అవుతుంది. హృదయంలో మమత నిండిన ప్రతి మహిళా మాతృదేవతే! అందుకే ఓ కవి ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా? కరుణించే ప్రతి దేవత అమ్మే కదా’ అన్నారు. అందరినీ అక్కున చేర్చుకొని లౌకిక సాంత్వనను, పారలౌకిక జ్ఞానాన్నీ పంచే మాతా అమృతానందమయి; అనాథలు, అభాగ్యుల పాలిట కరుణామయిగా నిలిచిన మదర్‌థెరిసా వంటివారు అమ్మలకే అమ్మలు కాదా?!

వైరాగ్యంలోనూ వీడని బంధం..

సర్వసంగ పరిత్యాగులైనవారు కూడా మాతృమూర్తికి మహోన్నత స్థానాన్నిచ్చారు. భవబంధాలు దుఃఖహేతువులని హితవు పలికినా, పేగుబంధాన్ని మాత్రం మినహాయించారు. వృద్ధాప్యంలో నీళ్ల కోసం తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేక తన తపోశక్తితో నది పాయనే ఇంటి పక్కకు మరలించారు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి తమ మాతృమూర్తులను ఆఖరిశ్వాస వరకు చెంతనే ఉంచుకొని కంటికి రెప్పలా చూసుకున్నారు. ‘నేనీ ప్రపంచంలో అమితంగా ఆరాధించే వారెవరైనా ఉన్నారంటే అది మా అమ్మే. ఆమె పూజలు, ఉపవాసాల ఫలితమే నేను’ అంటూ ఉద్విగ్నతకు లోనయ్యేవారు స్వామి వివేకానంద. బాల్యంలో చిన్న కప్పులో నీరు తీసుకొని తల్లి వద్దకు పరుగెత్తేవాడు. ఆమె కాలిబొటన వేలిని అందులో పెట్టమనేవాడు. ఆ నీటిని భక్తిగా తాగేవాడు. అంత ఆరాధన అమ్మ అంటే! అహింసామూర్తి గాంధీజీ ‘మా అమ్మ పరమసాధ్వి. ఆమెకు దైవచింతన అధికం. పూజ చేయకుండా ఎన్నడూ భోజనం చేసేది కాదు. ఆమె ప్రార్థన, పవిత్రతలే మా కుటుంబానికి రక్ష అని నమ్ముతాను’ అన్నారు.

కన్నీరుమున్నీరైన ఆది శంకరాచార్య

జగద్గురువులు ఆది శంకరాచార్యులు, తన తల్లి ఆర్యాంబ కన్నుమూసినప్పుడు కన్నీరుమున్నీరుగా విలపించారు. దుఃఖభారంతో ‘మాతృపంచకం’ రచించారు. ‘నన్ను నవమాసాలు మోసి, భోజనం రుచించక, నీరసించి, ప్రసూతి వేదన అనుభవిస్తూ కూడా నోటి నుంచి ఒక్క పరుష వాక్యం పలుక లేదు. నేను సన్యాసం స్వీకరించానని తెలిసి పరుగెత్తుకొని వచ్చావు. నన్ను ఆలింగనం చేసుకొని రోదించావు. అంతే తప్ప నన్ను తప్పుపట్టలేదు, తూలనాడలేదు. అందుకు బదులుగా చేతులు జోడిôచి నమస్కరించటం కన్నా ఇంకేం చేయగలనమ్మా?!’ అని దుఃఖిస్తూ నివాళులర్పించారు.

లోకంలో అమ్మ స్థానం కంటే అపురూపమైంది లేదు. అవతారమూర్తి అయినా అమ్మ లాలనతోనే.. అంతటివాడవుతాడు. కనుక తల్లిని మించిన దైవం లేదు, ఆమెని ఆదరించటం, ఆరాధించడం కంటే పుణ్యం లేదు.

శ్రీశారద


నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు. కానీ నేను పనిచేస్తే భగవంతుడు నన్ను గౌరవిస్తాడు.

సంతోషంగా ఉండటం చాలా సులువైన సంగతే. కానీ నిరాడంబరంగా ఉండటం మహా కష్టమైన విషయం.

లోకంలో ఏదైనా మన దగ్గరికి వస్తుంది. కాకపోతే దాన్ని అందుకోగల సామర్థ్యం మనలో ఉండాలి. 

రవీంద్రనాథ్‌ టాగోర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు