ఈదుల్‌ ఫితర్‌.. పేదల పండుగ

రంజాన్‌ మాసం ఆరంభమైంది మొదలు.. అల్లాహ్‌ కారుణ్యాలు కురిశాయి. ఉపవాసాలతో మానవత్వం పరిమళించింది. ఇఫ్తార్‌ విందులతో ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరిశాయి. ఫితర్‌ దానాలతో దాతృత్వం ఉప్పొంగింది.

Updated : 11 Apr 2024 10:56 IST

నేడు రంజాన్‌

రంజాన్‌ మాసం ఆరంభమైంది మొదలు.. అల్లాహ్‌ కారుణ్యాలు కురిశాయి. ఉపవాసాలతో మానవత్వం పరిమళించింది. ఇఫ్తార్‌ విందులతో ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరిశాయి. ఫితర్‌ దానాలతో దాతృత్వం ఉప్పొంగింది. ఈద్గాహ్‌లో నమాజులు, ఆలింగనాలు సోదరభావాన్ని పెంచాయి. ఇప్పుడిక అసలైన పర్వదినం వచ్చేసింది.

కసారి రంజాన్‌ రోజున.. నమాజ్‌ కోసం ముహమ్మద్‌ ప్రవక్త ఈద్గాహ్‌కు బయల్దేరారు. మార్గమధ్యంలో ఒక వీధిలో ఓ బాలుడు చేతులతో కళ్లు నులుముకుంటూ రోదిస్తున్నాడు. అది గమనించిన ప్రవక్త బాలుడి దగ్గరికెళ్లి- ‘పండుగపూట ఎందుకిలా ఏడుస్తున్నావు?’ అనడిగారు. ‘నాకు అమ్మానాన్నలు లేరు. పండుగకు తొడుక్కోవడానికి కొత్త బట్టలు లేవు’ అనడంతో ప్రవక్త ‘అమ్మానాన్నా లేరని బాధ పడకు! నీకు నేనున్నాను’ అనడంతో.. పిల్లాడు ఏడవటం ఆపి, చిరునవ్వు చిందించాడు. ప్రవక్త ఆ బాలుణ్ణి తన ఇంటికి తీసుకెళ్లారు. ‘ఇక నుంచి ఆయెషా నీకు అమ్మ. నన్ను తండ్రిగా భావించు’ అని ఓదార్చారు. స్నానం తర్వాత కొత్త బట్టలు ధరింపచేసి ఈద్‌ నమాజ్‌కు తీసుకెళ్లారు. దుఃఖాన్ని దూరంచేసి నవ్వులు పూయించారు. తల్లి తండ్రుల్లేని లోటు తీర్చారు. నిరుపేదలు, అనాథలు, నిరాదరణకు గురైన వారిని ఆదుకోవాలన్నదే రంజాన్‌ శిక్షణ ఉద్దేశం. కఠోర ఉపవాసాలు హృదయాలను సున్నితంగా మారుస్తాయి. తోటివారిని ఆదరించేలా మానవత్వాన్ని నేర్పుతాయి. 

ఈద్‌ అంటే..

రంజాన్‌ నెలలో ఉపవాసాలు, దైవారాధనలు నియమబద్ధంగా పాటించినవారికి ‘ఈదుల్‌ ఫితర్‌’ నిజంగా సంతోషదాయకమే. రోజాలు దిగ్విజయంగా ముగించి.. పేద, ధనిక తేడాల్లేకుండా అంతా సంతోషాలు పంచుకునే రోజు. ఈ సంతోషాల్లో అభాగ్యులు, వితంతువులను.. అందరినీ భాగస్వాములను చేసేందుకు ఫితర్‌ దానం చేస్తారు. ఒక్కో వ్యక్తికి సుమారు రెండు కిలోల గోధుమలు లేదా అంత సొమ్మును లెక్కకట్టి ఇంట్లో ఎందరుంటే అందరి పేరున పేదలకు అందిస్తారు. ఆహార పదార్థాలు, వస్త్రాలు, నగదు ఏ రూపంలో అయినా ఫితర్‌ చెల్లించవచ్చు.

ప్రేమ పరిమళాలను పంచిన రోజాలు

రంజాన్‌ నెల రోజాలు నిగ్రహాన్ని నేర్పాయి.. పరోపకారాన్ని బోధించాయి.. సానుభూతిని తెలియ జేశాయి.. దేవుడు చూస్తున్నాడన్న తలంపును తట్టిలేపాయి.. కనుకనే 14 గంటల పాటు అన్న పానీయాలకు దూరంగా ఉన్నారు. జీవన గ్రంథమైన ఖురాన్‌కు అనుగుణంగా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునేందుకే ఉపవాసాలు. ఆ ఉపవాసాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతగా చేసుకునేదే ఈ ఈదుల్‌ ఫితర్‌ పర్వదినం.

నమాజ్‌కు ఎంతో ప్రాధాన్యత

నమాజ్‌కు ఎంతో ప్రాధాన్యత. సంతోషంలో అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలపడానికి, దుఃఖంలో సహాయాన్ని అర్థించడానికి మార్గం కావాలి. ఇలా సందర్భం ఏదైనా ముహమ్మద్‌ ప్రవక్త ఆయుధం నమాజ్‌. ముస్లిముల అత్యంత ముఖ్యమైన రెండు పండుగల్లోనూ ఈద్‌ నమాజ్‌తోనే పండుగ సంతోషాలు ప్రారంభమవుతాయి. ఇస్లామ్‌ ధర్మంలో నమాజ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ‘నమాజ్‌ అశ్లీల కార్యాలను అరికడుతుంది’ అని దివ్య ఖురాన్‌ ఉద్బోధ. ‘రంజాన్‌ ఉపవాసాలు పాటించి, రాత్రుళ్లు తరావీ నమాజుల్లో నిలబడిన దాసులకు ఇచ్చేందుకు అల్లాహ్‌ వద్ద ఎన్నో బహుమానాలున్నాయి. నమాజ్‌లో నేలమీద తలవంచి చదివే వాక్యాల చప్పుడు ఆకాశంపైనున్న ప్రభువు వింటాడు. నమాజ్‌తో చేకూరే శుభాల గురించి తెలిస్తే లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ పాకుకుంటూ మస్జిద్‌కు వస్తారు’ అన్నారు ప్రవక్త.

అజాన్‌.. నమాజ్‌కు ఆహ్వానం!

అల్లాహు అక్బర్‌.. అంటూ మస్జిద్‌ మినార్ల నుంచి వచ్చే అజాన్‌.. నమాజ్‌కు ఆహ్వానించే పిలుపు వంటిది. అజాన్‌ పలుకులు వినగానే నమాజ్‌కు వెళ్లాలి. ఆ సమయంలో మౌనంగా ఉండాలి. అజాన్‌ పలుకుల్ని లోలోపలే ఉచ్చరించాలి. 

కాలినడకన నమాజు...

ఇంటిదగ్గర పరిశుద్ధత పొంది, నమాజ్‌ కోసం మస్జిద్‌కు కాలినడకన వెళ్లే వారికి అడుగడుగునా పుణ్యం లభిస్తుంది. ఒక్కో అడుగుకు ఒక్కో పాపాన్ని తుడిచేస్తాడు అల్లాహ్‌. అజాన్‌ విన్న ప్రతీ ముస్లిమ్‌ మస్జిద్‌కు వెళ్లాలి. తమ ఇంటికి మస్జిద్‌ దూరమైతే ఇంట్లోనే నమాజ్‌ చేసుకునేందుకు అనుమతి ఉంది. మస్జిద్‌కు దగ్గర్లో ఉండేవారు, ఆరోగ్యవంతులు సామూహికంగా నమాజ్‌లో పాల్గొనడం ఉత్తమం. ఐదుసార్లు చేసే నమాజుల్లో తెల్లవారుజామున చేసే ఫజర్‌ నమాజ్, రాత్రి చేసే ఇషా నమాజ్‌ అత్యంత ప్రధానమైనవి. ఎవరైనా ఇషా నమాజ్‌ను సామూహికంగా ఆచరిస్తే.. వారు అర్ధరాత్రి దైవారాధనలో గడపటంతో సమానం. అలాగే ఫజర్‌ నమాజ్‌ను సామూహికంగా ఆచరిస్తే రాత్రంతా నమాజ్‌ చేయడంతో సమానం.          

-ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని