ఆధ్యాత్మిక పథంలో అజరామర సేవలు

స్వామి వివేకానంద అమెరికాలో ఓ సత్సంగంలో.. ఎమిలి అనే యువతితో ‘నేనిక్కడ సమ్మోహితుణ్ణి అయిపోయాను’ అన్నారు. ‘మిమ్మల్నలా చేసిన స్త్రీ ఎవరు?’ అందామె సరదాగా. స్వామీజీ నవ్వి ‘నన్ను ఆకర్షించింది యువతి కాదు, ఈ దేశ ప్రజల సంఘటిత కార్యాచరణ శక్తి’ అన్నారు.

Updated : 25 Apr 2024 06:59 IST

మే 1 రామకృష్ణ మిషన్‌ ఆవిర్భావ దినోత్సవం

స్వామి వివేకానంద అమెరికాలో ఓ సత్సంగంలో.. ఎమిలి అనే యువతితో ‘నేనిక్కడ సమ్మోహితుణ్ణి అయిపోయాను’ అన్నారు. ‘మిమ్మల్నలా చేసిన స్త్రీ ఎవరు?’ అందామె సరదాగా. స్వామీజీ నవ్వి ‘నన్ను ఆకర్షించింది యువతి కాదు, ఈ దేశ ప్రజల సంఘటిత కార్యాచరణ శక్తి’ అన్నారు. ప్రాపంచిక విజయాలకే కాదు, పారమార్థిక పురోగతిలోనూ సంఘ ప్రాధాన్యతను గుర్తించారు. ఆ స్ఫూర్తితోనే దేశానికి తిరిగొచ్చాక గురుదేవుల పేరు మీద రామకృష్ణ సంఘానికి శ్రీకారం చుట్టారు. ఆత్మసాక్షాత్కారం కోసం సర్వం త్యజించి అరణ్యాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, సమాజంలో ఉంటూనే నిష్కామ సేవాకార్యక్రమాలతో సుసాధ్యం చేసుకోవచ్చని నిరూపించారు. ఆధ్యాత్మిక సాధనకు సరికొత్త నిర్వచనాన్నిచ్చారు.

జీవసేవే శివసేవ

ఇది పరమహంస మాట. ఆ ప్రేరణతో స్వామి వివేకానంద 1897 మే 1న రామకృష్ణ మిషన్‌ను ప్రారంభించారు. గురుదేవుల సతీమణి శారదాదేవి ఆశీస్సులు, మార్గదర్శకత్వంతో విధివిధానాలను రూపొందించారు. ‘కాషాయ వస్త్రధారణ త్యాగానికి ప్రతీక. త్యాగమంటే సమాజానికి దూరంగా వెళ్లడం కాదు. పరుల సుఖం కోసం స్వీయసుఖాన్ని త్యజించటమే నిజమైన త్యాగం’ అంటూ కొత్త సన్యాస సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. సేవతో కూడిన సాధన, భగవంతుణ్ణి గుర్తించటంలో తోడ్పడుతుందని ఆచరణాత్మకంగా చూపారు. వివేకానంద అడుగు జాడల్లో పయనిస్తూ కాలాంతరంలో సంఘ సాధువులు, భక్తులు.. దేశ, విదేశాల్లో మిషన్‌ కేంద్రాలను స్థాపిస్తున్నారు. విద్య, వైద్య, సహాయక సేవాకార్యక్రమాలను చేపడుతున్నారు. తుపాను, ఉప్పెన, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రామకృష్ణ మిషన్‌ సంస్థలు అపారంగా సేవ చేస్తున్నాయి. ఈ ప్రభావంతో ఇతర ఆధ్యాత్మిక సంస్థలు కూడా సామాజిక, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాయి. అలా మన ధర్మ ప్రవాహానికి కొత్త ఒరవడిని సృష్టించిన స్వామి వివేకానంద నవీన యుగానికి స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. రామకృష్ణ మఠం సాధువుల, జిజ్ఞాసువుల తపోమయ జీవితానికి కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది.

ఆ ఇరువురి ఆదర్శాల సమన్వయం

‘ఈ జగత్తు అశాశ్వతం. శాశ్వతమైన ఆత్మ సాక్షాత్కారమే మన లక్ష్యం’ అన్నారు ఆదిశంకరులు. ‘బహుజన హితం కోసం దయార్ద్ర హృదయులై చరించండి, తరించండి’ అంటూ ఉపదేశించాడు గౌతమ బుద్ధుడు. వీరిద్దరి సిద్ధాంతాలను సమన్వయపరుస్తూ, స్వామి వివేకానంద ‘మోక్షసిద్ధి కోసం ప్రయత్నిస్తూ, పరుల సేవలో తరిస్తూ..’ అనే నూతన సిద్ధాంతాన్ని ప్రబోధించారు. ఆ నినాదంతోనే రామకృష్ణ సంఘానికి బీజం వేశారు. అలాగే సన్యాస ధర్మానికి కొత్త నిర్వచనాన్నిస్తూ ‘కాషాయ వస్త్రాలు ఉన్నతస్థానంలో ఉన్నామని ప్రదర్శించుకునేందుకు కాదు. ఇవి వీరత్వానికి చిహ్నం. పేదలు, అజ్ఞానులు, బాధితులు.. వీరందరినీ దైవంగా భావించు. వీరికి సేవ చేయటంలోనే ఉన్నతమైన మతం దాగి ఉందని గ్రహించు’ అన్నారు.

పదహారుమంది యువ సన్యాసులతో ఆరంభమైన సంఘం నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కేంద్రాలు, రెండువేలమంది సాధువులతో ముందుకు సాగుతోంది. వివిధ మతాలు, దేశాల వారు కూడా ఆకర్షితులవుతుండటం విశేషం. విద్య, వైద్య, ఆధ్యాత్మిక, సారస్వత రంగాల ద్వారా రామకృష్ణ సంఘం తన వంతు కృషి చేస్తోంది. స్వామి వివేకానంద ఈ సంస్థను పవిత్రీకరణ ఉపకరణంగా (ప్యూరిటీ డ్రిల్లింగ్‌ మిషన్‌) అభివర్ణించారు. పరోపకారగుణం పవిత్రతను చేకూరుస్తుంది, నిస్వార్థ సేవతో అహంకారం తగ్గి, ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడుతుంది - అన్నారు.

దీనులసేవ కూడా దేవతార్చనే!

‘మీరు ఆలయానికి వెళ్లేటప్పుడు పూలూ, పండ్లూ తీసుకెళ్తారు కదా! అలాగే ఆసుపత్రిని ఆలయంగా, వ్యాధిగ్రస్తులను భగవత్‌ స్వరూపులుగా భావిస్తూ మందులు, పండ్లు, సాంత్వనపరిచే మాటలతో వెళ్లండి’ అని హితవు పలికారు వివేకానంద. పరమహంస శిష్యుడు స్వామి అఖండానంద అనాథ బాలలకు స్నానం చేయించేటప్పుడు పురుషసూక్తం పఠించేవారు. సాక్షాత్తూ నారాయణుడికే అభిషేకం చేస్తున్నానని భావించేవారు. అలాగే రామకృష్ణులకు అర్పించక ముందే నైవేద్యాన్ని పేద పిల్లలకు పంచేవారు. హరిద్వార్‌, వారణాసిల్లో రోగులకు రేయింబవళ్లు పరిచర్యలు చేస్తూ ‘రోగినారాయణ’ సేవకే తమ జీవితాన్ని అంకితం చేశారు. రామకృష్ణ ఆశ్రమాలు, వైద్య, విద్యాలయాల్లో ఇలాంటి మనోహర దృశ్యాలెన్నో! 

చిహ్నం రూపకల్పన స్వామీజీదే!

స్వామి వివేకానంద న్యూయార్క్‌లో ఉన్నప్పుడు రామకృష్ణ సంఘం కోసం చిహ్నాన్ని రూపొందించాలనుకున్నారు. ఆ ఆలోచన మనసులో మెదలగానే నమూనా గీశారు. భారత్‌కు తిరిగొచ్చాక ఓ రూపాన్నిచ్చారు. రామకృష్ణమఠ చిహ్నంలోని తరంగజలం కర్మయోగానికి సంకేతం. పద్మం భక్తియోగానికి ప్రతీక. ప్రభాత సూర్యుడు జ్ఞానయోగానికి సూచిక. చుట్టుకొని ఉన్న పాము రాజయోగం నిర్దేశించే కుండలినీశక్తి జాగృతికి నిదర్శనం. తరంగాల్లో తేలియాడే హంస పరమాత్మకు ప్రతిరూపం. కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగాల సమన్వయంతో పరమాత్మ దర్శనం లభిస్తుందన్న భావనతో ఈ చిహ్నాన్ని రూపొందించారు.

మోదీకి మార్గనిర్దేశం..

మన ప్రధాని నరేంద్రమోదీ యుక్త వయసులో ఉన్నప్పుడు రామకృష్ణ సంఘంలో చేరాలని రాజ్‌కోట్‌లో (గుజరాత్‌) ఉన్న మఠానికి వెళ్లారు. ఆ సమయంలో మఠం బాధ్యతలు నిర్వహిస్తున్న స్వామి ఆత్మస్థానంద ‘నీ సేవలు దేశానికి మరోరూపంలో అవసరం’ అని చెప్పి పంపించేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రామకృష్ణ సంఘం తనకు మార్గనిర్దేశకంగా నిలుస్తుందని, ప్రధాని మోదీ నేటికీ ఆరాధనాభావంతో రామకృష్ణ మఠాలను సందర్శిస్తూ, సంఘ సాధువుల ఆశీస్సులు స్వీకరిస్తుంటారు.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని