ధర్మస్వరూపుడు శ్రీరాముడు

‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ రాముడి వ్యక్తిత్వాన్ని గురించి రావణాసురుడికి చెబుతూ శత్రువైన మారీచుడు పలికిన మాటలివి. అంటే ధర్మానికి రూపం ఇస్తే అది రాముడన్నమాట. సూర్యుడు తీక్షణతకు, చంద్రుడు ఆహ్లాదానికి ప్రతీక. ఈ రెండు లక్షణాలనూ కలబోసుకుని సూర్యవంశంలో జన్మించిన రాముడు తన వ్యక్తిత్వంతో రామచంద్రుడయ్యాడు.  రమింపజేసేవాడు రాముడు. అంటే ఆనందాన్ని కలిగించేవాడు. తండ్రి మాట జవదాటడు, ఏకపత్నీవ్రతుడు అంటూ కీర్తిస్తాం.

Published : 11 Apr 2024 00:07 IST

ఏప్రిల్‌ 17 శ్రీరామనవమి

‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ రాముడి వ్యక్తిత్వాన్ని గురించి రావణాసురుడికి చెబుతూ శత్రువైన మారీచుడు పలికిన మాటలివి. అంటే ధర్మానికి రూపం ఇస్తే అది రాముడన్నమాట. సూర్యుడు తీక్షణతకు, చంద్రుడు ఆహ్లాదానికి ప్రతీక. ఈ రెండు లక్షణాలనూ కలబోసుకుని సూర్యవంశంలో జన్మించిన రాముడు తన వ్యక్తిత్వంతో రామచంద్రుడయ్యాడు.  

మింపజేసేవాడు రాముడు. అంటే ఆనందాన్ని కలిగించేవాడు. తండ్రి మాట జవదాటడు, ఏకపత్నీవ్రతుడు అంటూ కీర్తిస్తాం. సకలగుణాభిరాముడిగా ఆరాధిస్తాం. అయితే చంద్రుడిలో మచ్చ ఉన్నట్లే శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వంలోనూ కళంకాలున్నాయి- అనేవారున్నారు. నిజానికిది లోతైన విశ్లేషణ కాదు. పైపైన చూసి చేసిన విమర్శ. రాముణ్ణి శంకించేవారు చెప్పే ప్రధాన సంఘటనలు వాలివధ, సీత అగ్ని ప్రవేశం.

వాలి విషయమై మనకు కొన్ని సందేహాలున్నాయి కదా! అంతకంటే ఎక్కువ వాలికున్నాయి. అతడు రాముణ్ణి ఉద్దేశించి ‘రామా! నేను నీతో యుద్ధం చేయడం లేదు. నీ ఎదురుగానైనా లేను. మనిద్దరి మధ్యా ఆస్తి తగాదాలు లేవు. నా చర్మమో, మాంసమో నీకు పనికిరాదు. మరెందుకు బాణం వేశావు? నువ్వు ధర్మాత్ముడిగా చలామణి అవుతున్నావు కానీ నిజానికి మహా అధర్మపరుడివి. అసలు రావణాసురుడి చెరలో ఉన్న సీతను తెచ్చేందుకు సుగ్రీవుడి బదులు నన్ను అడిగితే.. పది నిమిషాల్లో సీతను నీ ముందు ఉంచేవాణ్ణి కదా’ అంటూ ఉక్రోషాన్ని ప్రదర్శించాడు వాలి.

చెట్టుచాటుగా ఎందుకంటే..

వాలి ప్రశ్నలు విన్న రామచంద్రుడు ‘పెద్దన్నగా సుగ్రీవుడికి తండ్రి స్థానంలో ఉన్న నువ్వు అతని భార్యను చెరపట్టావు. దుందుభి అనే రాక్షసుడి విషయంలో సుగ్రీవుడిది పొరపాటే కానీ తప్పు అనిపించుకోదు. దానికతడు పశ్చాత్తాపం చెంది క్షమించమన్నాడు కూడా. అయినా సుగ్రీవుణ్ణి చంపాలని చూశావు. అతని భార్యతో అధర్మంగా ప్రవర్తించావు. భరతుడి రాజ్య ప్రతినిధిగా లోకంలో ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి అధర్మంగా ప్రవర్తించిన నిన్ను బాణంతో కొట్టాను. నీ పాపానికి అనేక జన్మల వరకు నిష్కృతి లేదు. కానీ చేసిన నేరానికి రాజదండన అనుభవించి చనిపోతే నీకు స్వర్గప్రాప్తి కూడా కలుగుతుంది. ఇది నీకు మరణం ప్రసాదించిన వరం. ఇక చెట్టుచాటుగా కొట్టడం అనేది నీకు నేను విధించింది శిక్షే కానీ, అది యుద్ధం కాదు. రాజు శిక్ష విధించినప్పుడు నేరస్థుడికి ఆయుధం ఇచ్చి ఎదురుగా వచ్చి యుద్ధం చేయడు. నేను నరుణ్ణి, నువ్వు వానరుడివి. జంతువును ఉచ్చుబిగించి, వలపన్ని, చాటు నుంచి- ఎలాగైనా వేటాడవచ్చు. కనుకనే అలా చేశాను. పరకాంతను ఎత్తుకెళ్లిన రావణాసురుడి కంటే తమ్ముడి భార్యను చెరపట్టడమనే అతి పెద్ద తప్పు చేసిన అధర్మపరుడివి నువ్వు. నీ నుంచి సాయం ఎలా ఆశిస్తాను?’ అంటూ బదులిచ్చాడు. ఆ వివరణతో తన ప్రవర్తనకు పశ్చాతాపం చెంది, రాముడికి నమస్కరించాడు వాలి. రాముడి దోషం లేదని నమ్మాడు కాబట్టే.. వాలికి మామ అయిన సుషేణుడు యుద్ధంలో రాముడి పక్షంలో పోరాడాడు. రావణుడి శక్తి ఆయుధానికి బలైన లక్ష్మణుణ్ణి బతికించాడు. హనుమంతుడికి సంజీవ పర్వత ఆనవాళ్లు తెలియచేసి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం నుంచి సేనలను కాపాడాడు. అందువల్ల వాలి వధ విషయంలో వాలికి, అతని కుటుంబ సభ్యులకు లేని సందేహం మనకు ఉండాల్సిన అవసరం లేదు.

సీత లేకుంటే శక్తిహీనుడే..

రామచంద్రుని వ్యక్తిత్వం మీద ఆరోపిస్తున్న మరో మచ్చ.. సీత అగ్నిపరీక్ష. అంతఃపురంలో హాయిగా కాలం గడపతగిన అవకాశాలున్నా రాముణ్ణి విడిచి ఉండలేక అరణ్యానికి వచ్చిన సాధ్వి ఆమె. రావణుడు సీతనెత్తుకుపోతే నీళ్లలోంచి బయటపడిన చేపలా విలవిలలాడాడు రాముడు. అదీ వారి అనుబంధం. ‘సీత రాముడి బహిఃప్రాణం. ఆమె పక్కన లేకుంటే ఇక సంహరించాల్సిన పనిలేదు. తనంత తానే శక్తిహీనుడవుతాడు’ అంటూ చెప్పిన అకంపనుడి మాటలు వారిద్దరి అనురాగాన్ని తెలియజేస్తాయి.

అనుమానించింది.. నిందించింది..

పది నెలలు అరణ్యమంతా గాలించి, నానా యాతనా పడి, సముద్రానికి వారధి కట్టి, వానరసైన్యంతో లంకకు చేరి, ప్రాణాలకు తెగించి రావణుణ్ణి జయించాడు రాముడు. అయితే దుఃఖంతో, ప్రేమతో, ఆత్రుతతో వచ్చిన సీత శీలాన్ని శంకించాడు. నిజానికప్పుడు సీతమ్మతల్లితో ‘కంటి రోగంతో బాధపడుతున్న వాడికి దీపకాంతి సరిగా కనపడనట్లే.. నీ శీలం పట్ల ఇక్కడ కొందరికి సందేహం ఉంది. వారికి ప్రతినిధిగా నేను నిన్ను అనుమానిస్తున్నాను’ అన్నాడు రాముడు. దీపానికి మకిలి అంటదు, సమస్య చూపులోనే ఉంది. సీత పవిత్రమైందని తెలిసినా రాజైన రాముడు లోకమనే కంటితో చూస్తూ.. సీత అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నాడు. రేపు తను చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్టించినప్పుడు తన పక్కన కూర్చునే పట్టమహిషి పవిత్రమైందేనన్న భావన ప్రజలకు కలిగేందుకే ఈ అగ్నిపరీక్ష. పవిత్రమైందని తెలిసినా, అగ్నిపరీక్ష అనే అపనింద సీతమ్మవారికి అవమానకరమే కదా! నిజమే కానీ.. మారీచుడు ‘హా లక్ష్మణా! హా సీతా!’ అని అరిచినప్పుడు లక్ష్మణుడు పలకలేదు. సీత ఎంత చెప్పినా అతడు పర్ణశాల నుంచి కదల్లేదు. అప్పుడు సీత ‘అవసరమైతే అగ్నిలోనైనా దూకుతాను కానీ నీకు లొంగను’ అని బిడ్డలాంటి మరిదిని అనుమానించి, నిందించింది. ఆ కర్మఫలమే సీతమ్మకు అగ్నిలో దూకాల్సిన పరిస్థితులను కల్పించింది. ఒకవేళ సీత అగ్నిలో కాలిపోతే? ఉహూ.. కాలదు! అది సీత పట్ల రాముడికున్న గాఢ విశ్వాసం. హనుమంతుడి తోకకు నిప్పంటించినప్పుడు సీత అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. సీత ప్రార్థిస్తే హనుమ తోకను కాల్చకుండా రక్షించిన అగ్నిదేవుడు సీతను కాలుస్తాడా? ఇదీ సీత పట్ల రాముడి విశ్వాసం. అంత ధైర్యంగా సీత అగ్నిలో దూకటం తన పట్ల తనకున్న నమ్మకం. అంతగా పరస్పర విశ్వాసం కలిగిన ఆదర్శ దంపతులు సీతారాములు. సీత అగ్నిపరీక్ష గురించి తెలిసిన జనకమహారాజు- ‘రాముడు పరీక్ష పెడితే పెట్టాడు కానీ నా కూతురిని పరీక్షించడానికి అగ్నికున్న అర్హత ఏమిటి?’ అన్నాడు. అదీ తన బిడ్డపట్ల జనకుడికున్న విశ్వాసం.

ఆదర్శరాజ్యం.. ఆదర్శ ప్రభువు..

వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీత వంటి భార్యామణియున్‌
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును కలడే

అంటూ చాటుపద్యం ఉంది. సీత వంటి భార్య లేదు (రాణి కాదు), రాముడి లాంటి రాజు లేడు (భర్త కాదు) అన్నాడు కవి. రాజధర్మానికి మచ్చుతునక శ్రీరామచంద్రుడు. అవతార పరిసమాప్తికి ముందు నియమోల్లంఘన చేసినందుకుగాను తనకు ఆరో ప్రాణమైనప్పటికీ.. లక్ష్మణుడికి మరణ దండన విధించిన రాజు రాముడు. రాజుగా వీసమెత్తు అటుగానీ, ఇటుగానీ మొగ్గని వ్యక్తిత్వం రాముడిది. అందుకే నేటికీ ఆదర్శ రాజ్యమంటే రామ రాజ్యమే, ఆదర్శ ప్రభువు ఎప్పటికీ ఆ శ్రీరామచంద్రుడే.

డా.ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వర రావు త్రిపురాంతకం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని