జగన్మాత ఇచ్చింది.. నందీశ్వరుడు లాక్కోబోయాడు

సౌందర్యలహరి ఆవిర్భావం గురించి కంచి స్వాములు చెప్పగా ఆనందగిరి స్వామి రాసిన శంకరవిజయంలోని ఇతివృత్తమిది.

Published : 09 May 2024 00:16 IST

మే 12 ఆది శంకరాచార్య జయంతి

సౌందర్యలహరి ఆవిర్భావం గురించి కంచి స్వాములు చెప్పగా ఆనందగిరి స్వామి రాసిన శంకరవిజయంలోని ఇతివృత్తమిది.

క్షీర సాగర మథనం వేళ లోకులందరూ భయంతో పరమశివుని శరణు కోరగా.. ఆ స్వామి చిరునవ్వుతో పరమేశ్వరి వంక చూశాడు. ఆ భయంకర జ్వాలల నుంచి లోకాలను రక్షించడం కర్తవ్యంగా భావించిన జగజ్జనని తన మంగళసూత్ర మహిమను నమ్మి ఈశునకు అనుమతినిచ్చింది.

సౌందర్య లహరి అమ్మవారి వైభవానికి ప్రతీక. అంతటి మహిమాన్విత స్తోత్రాన్ని గురుదత్తంగా ఉపాసించినపుడు ముత్తయిదువలకు మాంగల్య దోషాలు తొలగి సాధకులకు కామితార్థాలు నెరవేరతాయి.

సాక్షాత్తు ఆది దంపతుల అంశతో కాలడిలో జన్మించిన శంకరాచార్యులవారు కైలాసం వెళ్లి పార్వతీపరమేశ్వరులను దర్శించుకున్నారు. ఆ భక్తికి మెచ్చి పరమేశ్వరుడు 5 స్ఫటిక లింగాలను, పార్వతీదేవి శత శ్లోకాల మంత్రగ్రంథాన్ని ఇచ్చాడు. ఆ సంపదను ఆనందంగా స్వీకరించి, వారి ఆశీస్సులు అందుకున్నారు. జగన్మాత వైభవాన్ని తెలియజేసే ఆ పవిత్ర గ్రంథం కైలాసంనుంచి భూలోకానికి చేరడాన్ని శివభక్తుడైన నందీశ్వరుడు భరించలేక.. లాక్కోబోయాడు. దాంతో 59 శ్లోకాలున్న తాళపత్రాలు నందీశ్వరుని చేతికి చిక్కగా, 41 శ్లోకాలున్న తాళపత్రాలు ఆదిశంకరులవారికి దక్కాయి.

జగన్మాత తనకు ప్రేమగా ఇచ్చిన గ్రంథం పూర్తిగా దక్కలేదని శంకరాచార్యులు చింతిస్తుండగా- ‘ఆ 59 శ్లోకాలు నువ్వు పూరించాలన్నది నా సంకల్పం. కనుకనే ఇలా జరిగింది. నువ్వే రచించు’ అంటూ అమ్మవారి స్వరం వినిపించింది. అమ్మ ఆజ్ఞ విన్నదే తడవుగా పర్వత శిఖరం నుంచి దూకే ఉత్తుంగ గంగాప్రవాహంలా 59 శ్లోకాలు శంకరుల నోటినుంచి వెలువడ్డాయి. దేవీ ప్రసాదితమైన 41 శ్లోకాలు, ఆదిశంకరులు పలికిన 59 శ్లోకాలు కలిసి సౌందర్యలహరిగా ప్రసిద్ధికెక్కాయి. పరమశివుడు ప్రసాదించిన 5 స్ఫటికలింగాలు- కంచిలో యోగలింగంగా, కేదార్‌లో ముక్తిలింగంగా, నేపాల్‌లో వరలింగంగా, చిదంబరంలో మోక్షలింగంగా, శృంగేరిలో భోగలింగంగా వెలిశాయి.  

కొండూరి పద్మపార్వతీశం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు