ప్రశాంతత.. పవిత్రత..

బుద్ధుడి వంక ఎవరైనా చూస్తే చాలు ముక్తి పొందేవారు. ఈ నేపథ్యంలో మనుషులు కర్మకాండలు మానేస్తే దేవతలకు హవిస్సులు అందవు.

Updated : 14 Mar 2023 13:37 IST

బుద్ధుడి వంక ఎవరైనా చూస్తే చాలు ముక్తి పొందేవారు. ఈ నేపథ్యంలో మనుషులు కర్మకాండలు మానేస్తే దేవతలకు హవిస్సులు అందవు. వాళ్లలో అధికశాతం కర్మకాండతో కలిగే యజ్ఞఫలం మీదే ఆధారపడి ఉంటారు. బుద్ధుడి కారణంగా ఆ క్రతువులన్నీ ఆగిపోయాయి. తమ శక్తులు కోల్పోయి, దేవతలు అలమటించే స్థితి వచ్చింది. ‘మనకు ముప్పు కలిగించేంత పవిత్రంగా ఉన్నాడు. ఇదిలాగే కొనసాగితే కష్టం. ఎలాగైనా ఇతణ్ణి తుదముట్టించాలి’ అనుకున్నారు. దాంతో బుద్ధుణ్ణి కలిసి ‘స్వామీ! మిమ్మల్నో వరం కోరడానికి వచ్చాం. మేం తలపెట్టిన యజ్ఞానికి పెద్ద అగ్నిగుండం కావాలి. అందుకు తగిన పవిత్ర స్థలం దొరకలేదు. ఇప్పుడు దొరికిందనుకుంటున్నాం. పరమ పవిత్రులైన మీరు నేలమీద పడుకుంటే మీ ఛాతీ మీద అగ్నిని రగల్చాలని ఉంది’ అన్నారు. బుద్ధుడు సరేననడంతో దేవతలు ఆయన ఛాతీ మీద అగ్నిగుండం ఏర్పాటుచేశారు. కానీ వాళ్లు ఆశించినట్టు ప్రాణం పోలేదు. శారీరక హింసతోనూ చంపలేక పోయారు. బుద్ధుడు శాంతంగా ‘ఇంతకీ మీకేం కావాలి?’ అనడిగాడు. ‘మీ ముఖాన్ని చూసినవారంతా ముక్తి పొందు తున్నారు. మమ్మల్ని పూజించడంలేదు’ అన్నారు. దానికి బదులుగా ‘కానీ మీరేం చేసినా.. ప్రశాంతత, పవిత్రతలను నశింపచేయలేరుగా’ అన్నాడు బుద్ధుడు.

గోవిందం ఉమామహేశ్వర రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని