ధీశాలి దయాశీలి

కళ్లలో దీప్తులు చిందించే ఆయన ఎంత ధీశాలో, అంత దయాశీలి. వజ్రం లాంటి సంకల్పమే కాదు, వెన్నలాంటి సహృదయముంది! ఒక్కమాటలో చెప్పాలంటే మూర్తీభవించిన మానవతావాది స్వామి వివేకానంద.

Updated : 14 Mar 2023 13:32 IST

జనవరి 12
స్వామి వివేకానంద జయంతి

కళ్లలో దీప్తులు చిందించే ఆయన ఎంత ధీశాలో, అంత దయాశీలి. వజ్రం లాంటి సంకల్పమే కాదు, వెన్నలాంటి సహృదయముంది! ఒక్కమాటలో చెప్పాలంటే మూర్తీభవించిన మానవతావాది స్వామి వివేకానంద.

బేలూరులో రామకృష్ణమఠం నిర్మాణం జరుగుతోంది. రేయనకా, పగలనకా కష్టపడు తున్న కార్మికులతో స్వామి వివేకానంద ఆప్యాయంగా మాట్లాడేవారు. కుశల ప్రశ్న లడిగితే ఆ నిరుపేదలు తమ గోడునంతా వెళ్లబోసుకునేవారు. ఆ Ëవెతలు వింటూ వివేకానంద కదిలిపోయి కన్నీళ్లు పెట్టుకుంటే కూలీలు ఖిన్నులయ్యేవారు. ఆ తర్వాత స్వామి పలకరించినా వాళ్లు తమ కష్టాలను ప్రస్తావించక పొడిపొడిగా జవాబిచ్చేవారు. స్వామీజీ మరీ మరీ అడిగితే ‘నీతో మాట్లాడాలంటే మాకదోలా ఉంటుంది సామీ! ఏమైనా చెబితే నువ్వు మా కన్నా ఎక్కువ బాధపడతావు. అవన్నీ చెప్పి నిన్ను నొప్పించటం ఇష్టం లేదు’ అనేవారు. ఇలాంటి ఉదంతాలెన్నో!

కదిలించిన ఆకలిచావు

ఒకరోజు స్వామి మిత్రా ఇంట్లో దినపత్రిక చదువుతున్నారు. అందులో ‘ఈ మహా నగరంలో ఓ వృద్ధుడు అన్నం దొరకక ఆకలితో మరణించాడు’ అనే వార్త చూసి చలించిపోయారు. ఆ రోజంతా అన్నం తినకుండా అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కిన భరతావనిలో ఆకలి చావులేమిటని ఆవేదనచెందారు. కాలాంతరంలో ‘నా దేశంలో కుక్క కూడా ఆకలితో చనిపోవటాన్ని భరించలేను’ అన్నారోసారి. కరుణను వర్షించే స్వామీజీ నేత్రాలు అయస్కాంతంలా ఆకర్షించేవి.

ప్లేగువ్యాధి వ్యాపించిన రోజుల్లో..

ఒకసారి బెంగాల్లో ప్లేగు వ్యాపించింది. ఆ మహమ్మారి విలయ తాండవానికి ప్రజలు అసువులు బాస్తున్నారు. ఆ దయనీయ స్థితిలో స్వామి రామకృష్ణమఠం కోసం కొన్న భూమిని సైతం విక్రయించటానికి సిద్ధమయ్యారు. కానీ పరిస్థితులు అదుపులోకి రావటంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ‘తోటివారి కన్నీళ్లు తుడవటం కోసం చావడానికైనా సిద్ధమే. పరుల సేవ కోసం యావచ్ఛక్తిని వినియోగించండి. గొప్ప సంపదలతో కంటే పరోపకారంతోనే అసలైన ఆనందం లభిస్తుంది. జ్ఞానమార్గంలో పురోగమిస్తారు’ అన్నారోసారి.

సహృదయం.. సాహసం

స్వామీజీగా మారక ముందు వారి పేరు నరేంద్రనాథ్‌. ఆత్మీయులు నరేన్‌ అని ప్రేమగా పిలిచేవారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు నరేన్‌లో బాల్యం నుంచే ధీరోదాత్తతతో పాటు దయాగుణమూ చిగురించింది. ఆరేళ్ల వయసులో బంధువులతో తీర్థయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పక్కనే నడుస్తున్న మిత్రుడు కనిపించక వెనక్కి చూడగా.. దూసుకొస్తున్న గుర్రబ్బండి కనిపించింది. పరుగున వెళ్లి మిత్రుణ్ణి పొదివి పట్టుకుని మరో వైపుకు దొర్లాడు. నరేన్‌ స్పందించటం క్షణం ఆలస్యమైనా అతడి ప్రాణాలు దక్కేవి కావు. ఆ సాహసాన్ని చూసి అంతా దిగ్భా‌్రంతులయ్యారు. మనసారా ఆశీర్వదించారు. ఆ ఉదంతాన్ని విన్న ఆయన మాతృమూర్తి భువనేశ్వరీ దేవి ప్రేమగా అక్కున చేర్చుకుని ‘నరేన్‌! ఈ ధీరత్వాన్నీ, దయాగుణాన్నీ జీవితాంతం కాపాడుకో! వీర పురుషుడిగా వర్ధిల్లు నాయనా’ అంటూ ఆశీర్వదించింది.

స్వామీజీకి ఆధ్యాత్మిక చింతన ఎంత ముఖ్యమో, సేవాతత్పరత అంతే ముఖ్యం. దీనులపట్ల అఖండ సానుభూతి. అపరిమిత ప్రేమ. ఆ మానవీయ కోణమే ఆయన నిర్వహించిన మహత్కార్యాలన్నింటికీ ప్రేరణ. ‘జగత్తుకు మేలుచేస్తూ మోక్షాన్ని సాధించు’ అన్న నినాదంతో శ్రీకారం చుట్టిన రామకృష్ణ సంఘానికి చుక్కాని. అందుకే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వివేకానందకు నివాళులర్పిస్తూ ‘అవధులు లేని త్యాగం, అచంచల కృషి, అంతులేని ప్రేమ, అజరామరమైన సాహసం.. లాంటి సద్గుణరాశితో విరాజిల్లే వివేకానందను మించినవారు లేరు. ఆ మహోన్నతుడే నాకు మార్గదర్శి’ అన్నారు.

బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని