Civils Ranker:సివిల్స్‌ సుధీరుడు

మొదటిసారి ప్రిలిమ్స్‌లో విజయం.. రెండోసారి మెయిన్స్‌లో సత్తా.. మూడోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తుది ఫలితంలో నిరాశ.   

Updated : 04 Jun 2022 06:16 IST

 మూడుసార్లు విఫలమైనా నమ్మకం కోల్పోలేదు 

 ‘న్యూస్‌టుడే’తో సివిల్స్‌ 69వ ర్యాంకర్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి

మొదటిసారి ప్రిలిమ్స్‌లో విజయం.. రెండోసారి మెయిన్స్‌లో సత్తా.. మూడోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తుది ఫలితంలో నిరాశ.   
మిగిలింది రెండు అవకాశాలే !! అపజయాలకు కుంగిపోకుండా నాలుగో ప్రయత్నం ప్రారంభించారు.  చేసిన తప్పులు సరిదిద్దుకొంటూ రెట్టించిన కసితో చదివి నాలుగోసారి 69వ ర్యాంకు సాధించారు కోవెలకుంట్లకు చెందిన గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి. 

తన విజయ పథాన్ని ‘న్యూస్‌టుడే’తో పంచుకొన్నారు. ఖరగ్‌పూర్‌  ఐఐటీలో ఏరోస్పేస్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆయన సివిల్స్‌ వైపు ఎందుకు వెళ్లారు. ఒత్తిడి  ఎలా అధిగమించారు.. తదితర అంశాలు ఆయన మాటల్లో...!!! 

 న్యూస్‌టుడే, కోవెలకుంట్ల

వైఫల్యాలే విజయానికి మెట్లు

నేను ఐదేళ్ల నుంచి సివిల్స్‌కు    ప్రయత్నిస్తున్నా. నాతోపాటు చదివినవారు ఉద్యోగాలు చేస్తూ రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నారు. కొంత మంది విదేశాల్లో పీహెచ్‌డీలు పూర్తి చేశారు. నేను సివిల్స్‌లో మూడుసార్లు విఫలమయ్యా. ఇక మిగిలింది రెండు అవకాశాలే. ఇవన్నీ నాలో కాస్త ఒత్తిడిని పెంచాయి. ఎంత ఒత్తిడి ఉన్నా.. ఎన్ని వైఫల్యాలు ఎదురైనా ఏదో ఒకసారి విజయం వరిస్తుందనే నమ్మకంతో పట్టుదలగా ముందుకెళ్లా.

ఒక్కో పుస్తకాన్ని పదిసార్లు చదివా

ఒక్కో పుస్తకాన్ని పదిసార్లు చదివా. సుభాష్‌ కశ్యప్‌ రాసినవి బాగా ఉపయోగపడ్డాయి. ఆయన భారత రాజ్యాంగంపై బాగా రాశారు. ప్రాథమిక (బేసిక్‌) అంశాల్లో పట్టు సాధించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు తిరగేశా. దిల్లీలో శిక్షణకు వెళ్లినప్పుడు ప్రతీది నోట్‌ చేసుకున్నా. అంతర్జాలంలో వెతికితే బేసిక్, మెటీరియల్స్‌ చాలా పుస్తకాలు దొరుకుతాయి. వాటిని పరిశోధించి జాబితా తయారు చేసుకున్నా.. వాటిని ఒకసారి చదివి వదిలేయకుండా పలుమార్లు చదివి సారాంశాన్ని పట్టుకున్నా. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఉపయోగపడతాయి. మార్కెట్లో ఎకానమిక్‌ వికాస్‌ అని ఉంది. అందులో బేసిక్స్‌ చాలా బాగా రాశారు. 

అమ్మానాన్నే ఓదార్చారు 

మూడు ప్రయత్నాల్లో విఫలమైనా.. నిరుత్సాహపడకుండా నాపై నమ్మకంతో అమ్మానాన్న ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. అది నాలో మరింత పట్టుదల పెంచింది. మొదటిసారి ప్రిలిమ్స్‌లో విఫలమైనప్పుడు చాలా బాధపడ్డా. ఆ సమయంలో అమ్మానాన్న నా దగ్గరుండి ఓదార్చి ఆ బాధ నుంచి బయటపడేలా చేశారు. మా అమ్మమ్మ సింగిరెడ్డి లక్ష్మీదేవి నాతోపాటే ఉండి మూడేళ్లు వండి పెట్టింది. నా విజయం వెనుక వీరందరి శ్రమ ఉంది. 

అంతర్జాలంలో విస్తృత సమాచారం

శిక్షణ తీసుకోవాలా వద్దా అన్నది వాళ్ల వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. నేను సివిల్స్‌ ఎంచుకున్నా.. గైడ్‌ చేసేవాళ్లు లేరు. ఎలా చదవాలి.. ఏం చేయాలో అవగాహన పెంచుకునేందుకు శిక్షణలో చేరా. అది నాకు ఉపయోగపడింది. ప్రస్తుతం అంతర్జాలంలో మంచి  పుస్తకాలు, విషయ పరిజ్ఞానం అందుబాటులో ఉంది. నాకు అవి బాగా  ఉపయోగపడ్డాయి. మార్కెట్లో లభించిన పుస్తకాలు, శిక్షణ తరగతులతోపాటు ఇంటర్నెట్‌లో లభించే సమాచారాన్ని తీసుకుని చదువుకునేవాణ్ణి. 

సాధారణ విద్యార్థులూ సాధించొచ్చు

కలెక్టర్‌ అత్యంత ఉత్తేజకరమైన ఉద్యోగం. ఇదే నన్ను సివిల్స్‌ వైపు వెళ్లేలా చేసింది. మా సీనియర్లు చాలా మంది సివిల్స్‌ సాధించారు. వారంతా నాలానే సాధారణ విద్యార్థులు. వారు సాధించినప్పుడు నేనెందుకు సాధించకూడదని అనుకున్నా. అందులో చాలా మంది ఒకేసారి విజయం సాధించలేదు. రెండు, మూడు ప్రయత్నాల్లో లక్ష్యాన్ని చేరుకున్నవారే.మూడు ప్రయత్నాల్లో విఫలమైనా.. నిరుత్సాహపడలేదు. పట్టుదలతో చదివి మంచి ర్యాంకు సాధించగలిగా.  

సీనియర్ల సలహాతో సివిల్స్‌ వైపు

ఐఐటీ చదివిన విద్యార్థులకు చాలా మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయని అనుకుంటారు. ఐఐటీలోని అన్ని డిపార్ట్‌మెంట్లలో కోర్‌ రంగాలకు సంబంధించి మన దేశంలో ఎక్కువ అవకాశాలు లేవు. కంప్యూటర్‌ సైన్సుకు అవకాశాలుంటాయి. ఏరోస్పేస్‌ రంగాల్లో అవకాశాలు తక్కువ.. మూడు, నాలుగో ఏడాది చదివే సమయంలో ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. అది దక్కడం కాస్త ఇబ్బంది. దీనిపై స్పష్టత వచ్చాక సీనియర్లను సంప్రదించా. చాలా మంది సివిల్స్‌ సాధించారు. వారి సలహా తీసుకొని నేనూ సివిల్స్‌ వైపు అడుగులు వేశా. 

మార్కులు చూసి మార్చుకుని

మార్కుషీట్‌ విడుదలైనప్పుడు నాకు ఏయే పేపర్లో మార్కులు తక్కువగా వచ్చాయో విశ్లేషించుకున్నా. ఎస్సే, ఎథిక్స్‌ పేపర్లో మార్కులు తక్కువగా వచ్చాయి. కెమిస్ట్రీ పేపర్లో వచ్చిన మార్కులతో ఇంటర్వ్యూ వరకు వెళ్లా. మూడుసార్లు ఎక్కువ మార్కుల కోసం ప్రయత్నించా. నాలుగోసారి అలా కాకుండా అన్ని పేపర్లల్లో సగటుకుపైగా మార్కులు వచ్చినా మంచి ర్యాంకు వస్తుందని అంచనా వేశా. సులభంగా.. అర్థమయ్యేలా అన్ని పేపర్లు రాయడంతో గతంలో కంటే అన్ని పేపర్లో పది చొప్పున మార్కులు పెరిగాయి. ఇంటర్వ్యూలో మంచి మార్కులు రావడంతో 69వ ర్యాంకు సాధించా. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని