మఠం భూమి మాయం

మఠం భూమికే రక్షణ కరవైంది. ఏళ్లుగా మఠం పేరుపై ఉన్న భూమిని అమ్మకానికి పెట్టడం వివాదానికి దారి తీసింది. మద్దికెరకు చెందిన రెవెన్యూ ఉత్తరం గ్రూపులోని సర్వే నంబరు 591లో 12.76 ఎకరాలు, 607 సర్వే నంబరులో 12.73 ఎకరాలు

Published : 04 Jun 2022 02:52 IST

మద్దికెర, న్యూస్‌టుడే: మఠం భూమికే రక్షణ కరవైంది. ఏళ్లుగా మఠం పేరుపై ఉన్న భూమిని అమ్మకానికి పెట్టడం వివాదానికి దారి తీసింది. మద్దికెరకు చెందిన రెవెన్యూ ఉత్తరం గ్రూపులోని సర్వే నంబరు 591లో 12.76 ఎకరాలు, 607 సర్వే నంబరులో 12.73 ఎకరాలు మొత్తంగా 25.49 ఎకరాల సాగు భూమి ఉంది. దీనిని ఇప్పటి వరకు స్థానిక రాఘప్పస్వామి కుటుంబ సభ్యులు సాగు చేసుకుంటున్నారు. ఏడాది క్రితం విజయవాడకు చెందిన శ్రీసత్యాత్మతీర్థ స్వామీజీ ఉత్తారాది మఠం పేరుతో పట్టాదారులు పాసు పుస్తకాలు పొందారు. ఏడాది తర్వాత ఎవరికీ తెలియకుండా మద్దికెరకు చెందిన ఓ వ్యక్తికి ఈ భూమిని ఎకరా రూ.5.30 లక్షలకు విక్రయించడం వివాదం తలెత్తింది.

విక్రయించరాదని స్థానికుల నిరసన

మఠం పేరుతో ఉన్న ఈ భూమిని అమ్మేందుకు వీలు లేకపోయినా.. ఎలా ఒప్పంద పత్రం రాసుకున్నారని స్థానికులు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకం పొంది ఎలా విక్రయిస్తారని స్థానికులు శ్రీనివాసులు, కృష్ణ, వార్డు సభ్యుడు కృష్ణలు మఠం నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. 

మఠం నుంచి హక్కు ఉంది.. విక్రయిస్తామని వాసుదేవాచార్యులు తేల్చి చెప్పారు. కొన్న వారికి వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు మఠం ద్వారా హక్కు ఉందని స్థానికులతో వాదనకు దిగారు. సమాచారం అందుకొన్న పోలీసులు వచ్చి సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. 

ఎట్టి పరిస్థితిలో  రిజిస్ట్రేషన్‌ కాదు: నాగభూషణం, తహసీల్దారు, మద్దికెర 

సర్వే నంబరు 591, 607లో ఉన్న 25.49 ఎకరాల భూమికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే గతంలో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశాం. ఈ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ అయ్యే అవకాశం లేదు. మఠం పేరుతో ఉండటంతో అమ్ముకొనేందుకు వీల్లేదు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని