వాటా అడిగాడనే చంపేశాడు

కర్నూలు వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన డ్రైవర్‌ ఎండీ అబ్దుల్‌ రహీమ్‌ హత్య కేసులో ప్రధాన నిందితులైన కె.హరికృష్ణారెడ్డి (38), గనిపినేని అశోక్‌ కుమార్‌ (29)ను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో సీఐ శంకరయ్య,

Updated : 04 Jun 2022 06:34 IST

 డ్రైవరు హత్య కేసులో ప్రధాన నిందితుల అరెస్టు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన డ్రైవర్‌ ఎండీ అబ్దుల్‌ రహీమ్‌ హత్య కేసులో ప్రధాన నిందితులైన కె.హరికృష్ణారెడ్డి (38), గనిపినేని అశోక్‌ కుమార్‌ (29)ను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో సీఐ శంకరయ్య, ఎస్సైలు పెద్దయ్యనాయుడు, చిరంజీవి, రామయ్యతో కలిసి కర్నూలు డీఎస్పీ కె.వి.మహేష్‌ శుక్రవారం వివరాలు వెల్లడించారు.

కర్నూలు వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన హరికృష్ణారెడ్డి డీసీఎం వాహనానికి అబ్దుల్‌ రహీమ్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లె నుంచి హైదరాబాద్‌కు తన వాహనంలో తరలించే స్క్రాప్‌నకు బిల్లులు లేకపోవటంతో దొంగ సరకుగా భావించిన హరికృష్ణారెడ్డి దానిని తానే అమ్ముకోవాలన్న దురాలోచన కలిగింది. ఈ క్రమంలో తన యజమాని చెప్పిన విధంగా సదరు స్క్రాప్‌ను ఏప్రిల్‌ 26న హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్యాక్టరీలో అబ్దుల్‌ రహీమ్‌ అమ్మేయగా రూ.3.84 లక్షలు వచ్చింది. సరకు విక్రయించే సమయంలో వాహనం నంబరు మార్చి కొనుగోలుదారుడికి మస్కా కొట్టాడు. వచ్చిన రూ.3.84 లక్షల్లో తనకు సగం వాటా ఇవ్వాలని అబ్దుల్‌ రహీమ్‌ డిమాండ్‌ చేయటంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. హరికృష్ణారెడ్డి కోపంతో అబ్దుల్‌ రహీమ్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. పాత నేరస్థుడైన అశోక్‌ను జత చేసుకుని మరో లారీలో పెబ్బేరు వెళ్లారు. తెలివిగా హరికృష్ణారెడ్డి తన సెల్‌ఫోన్‌ను ఇంటి వద్దే ఉంచి వెళ్లాడు. పెబ్బేరు నుంచి ఫోన్‌ చేయగా అక్కడికి వచ్చిన అబ్దుల్‌ రహీమ్‌కు మద్యం తాగించి లారీలో తాడుతో గొంతు బిగించి చంపేశారు. రూ.3.84 లక్షల మొత్తంలో రూ.20 వేలు అశోక్‌కు ఇచ్చాడు. తర్వాత వెంట తెచ్చుకున్న సిమెంట్‌ రింగుల్లో శవాన్ని ఉంచి కంకర, తవుడుతో నింపి కర్నూలుకు తీసుకొచ్చారు. మళ్లీ తన అన్న లక్ష్మీకాంత్‌రెడ్డి సాయంతో ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలో గంటవానిపల్లె చెరువులో పడేశారు. తన కుమారుడి జాడ కనపడటం లేదంటూ మే 6న అబ్దుల్‌ రహీమ్‌ తల్లి మొహరున్నీసా కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతను ఏప్రిల్‌ 19న ఇంట్లో నుంచి వెళ్లాడని, అదే నెల 27న ఫోన్‌ చేసి తన యజమానితో గొడవ జరిగినట్లు చెప్పి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నట్లు ఆమె పోలీసులకు వివరించారు. సీఐ శంకరయ్య అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొదట లక్ష్మీకాంతరెడ్డిని మే 11న అరెస్టు చేసి విచారించగా గంటవానిపల్లె చెరువులో పడేసిన విషయాన్ని చెప్పాడు. పరారీలో ఉన్న హరికృష్ణారెడ్డి, అశోక్‌ను కర్నూలు సమీపంలోని వెంగన్నబావి వద్ద శుక్రవారం అరెస్టు చేసి రెండు లారీలను సీజ్‌ చేసి రూ.2.74 లక్షల స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. తన సరకును అమ్మినందుకుగాను స్క్రాప్‌ యజమాని ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లాలో మరో కేసు నమోదైందని సీఐ తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని