నిర్వహణ మాట.. వాణిజ్య బాట

రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వారే విక్రయించుకునే అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రైతుబజార్లు ఏర్పాటు చేసింది. కర్షకుల సంక్షేమం, సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన వీటి నిర్వహణ భారాన్ని ఇక భరించలేమని..

Published : 04 Jun 2022 02:52 IST

రైతుబజార్ల ద్వారా ఆదాయ ఆర్జనకు యత్నాలు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వారే విక్రయించుకునే అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రైతుబజార్లు ఏర్పాటు చేసింది. కర్షకుల సంక్షేమం, సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన వీటి నిర్వహణ భారాన్ని ఇక భరించలేమని.. వాటి ద్వారా వచ్చే ఆదాయంతోనే నిర్వహించాలని కొన్నాళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం రైతుబజార్ల   చుట్టూ దుకాణాలు నిర్మించి అద్దెకివ్వడం  ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నంద్యాల రైతుబజారు చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో గదులు నిర్మించి అద్దెకు ఇవ్వాలనే  ప్రతిపాదనలు తయారయ్యాయి. వీటికి రేపోమాపో ఉన్నతాధికారులు పచ్చజెండా ఊపనున్నారు.

ఆదరణ అంతంతే..

ఉమ్మడి జిల్లాలో కర్నూలు నగరంలో 3, నంద్యాల 2, ఆదోని, ఆళ్లగడ్డ, ఆత్మకూరులో ఒక్కొక్కటి చొప్పున రైతు బజార్లు ఉన్నాయి. నంద్యాల శ్రీనివాస సెంటర్, టెక్కె మార్కెట్‌ యార్డులో ఉన్న వాటిలో కూరగాయలు, ఆకుకూరల విక్రయాలు జరుగుతున్నాయి. ఆళ్లగడ్డ, ఆత్మకూరులో రైతుబజార్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. నంద్యాల శ్రీనివాసనగర్‌లోని రైతుబజార్‌లో 92 స్టాళ్లు ఉన్నాయి. ఇందులో పొదుపు సంఘాల సభ్యులకు నాలుగు, రైతులకు 22 స్టాళ్లు కేటాయించారు. 12 స్టాళ్లలో ప్రైవేటు వ్యాపారులు పాలు, నిత్యావసరాలు, మాంసం తదితర దుకాణాలను నిర్వహిస్తున్నారు. మరో 54 ఖాళీగా ఉన్నాయి. టెక్కె మార్కెట్‌యార్డులో 28 స్టాళ్లు ఉండగా పొదుపు సభ్యులు మూడు, రైతులు మరో రెండు దుకాణాలు నిర్వహిస్తున్నారు. మిగతావన్ని ఖాళీగా ఉన్నాయి. నంద్యాలలో రెండు రైతుబజార్లకు ప్రజల నుంచి అనుకున్న మేర ఆదరణ లభించడం లేదు. సమీపంలోనే పెద్ద మార్కెట్‌ ఉండడంతో శ్రీనివాసనగర్‌ రైతుబజార్‌ వైపు వినియోగదారులు వెళ్లడం లేదు. టెక్కె రైతుబజారు అందరికీ అందుబాటులో లేని కారణంగా ప్రజలు పెద్దగా రావడం లేదు. దీంతో ఇక్కడ వ్యాపారం నిర్వహించేందుకు విక్రయదారులు ఆసక్తి చూపడం లేదు.

ఆదాయ మార్గాల అన్వేషణ

నంద్యాలలోని రెండు రైతుబజార్ల నిర్వహణకు ప్రస్తుతం నెలకు రూ.49 వేలు ఖర్చవుతోంది. అద్దెల రూపంలో వస్తున్నది రూ.29 వేలు మాత్రమే. దీంతో శ్రీనివాసనగర్‌ రైతుబజార్‌ను విస్తరించాలని మార్కెటింగ్‌ శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. రైతుబజారు చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో దుకాణాలు నిర్మించి అద్దెకు ఇస్తే మరో రూ.1.20 లక్షల వరకు రాబడి వస్తుందని అంచనా వేశారు. ఈ అద్దె కూడా తరచూ పెంచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భారీ ఎత్తున ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నట్లు వివరాలు పొందుపరుస్తూ మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌కు కొద్దికాలం కిందట ఇక్కడి అధికారులు ప్రతిపాదనలు పంపారు. అక్కడి నుంచి ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతుబజార్లను సక్రమంగా నిర్వహించ లేకనే ఆదాయ మార్గాలుగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆదేశాలు అమలు చేశాం: సుజాతరెడ్డి, ఏపీఎం, డీఏటీవో, నంద్యాల 

నంద్యాల రైతుబజార్‌కు సంబంధించి భవనాలు నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాం. ఇటీవల కొత్తగా రైతుబజార్లలో అద్దెలు పెంచలేదు. ఐదు నెలల    క్రితం జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల  మేరకు పెంచాం. మరోసారి పెంచే ఆలోచన లేదు. ఆత్మకూరు, ఆళ్లగడ్డ రైతుబజార్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

పెరిగిన అద్దె భారం

రైతుబజార్లలోని స్టాళ్లకు అద్దె భారం పెరిగిపోయింది. రెండేళ్ల క్రితం వరకు స్టాల్‌కు రూ.600 వరకు నెల అద్దె ఉండగా.. లాక్‌డౌన్‌ తర్వాత దీన్ని రూ.1100 చేశారు. ఈ ఏడాది జనవరిలో మరో రూ.400 పెంచి రూ.1500 వసూలు చేస్తున్నారు. నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో వరి ఇతర పంటల సాగు మాత్రమే ఉంది. కూరగాయల సాగు కనిష్ఠ స్థాయిలో ఉంది. దీంతో కూరగాయలు, ఆకుకూరలు పండించే వారు ఈ ప్రాంతంలో నామమాత్రమే. దీంతో రెండు బజార్లలో రైతుల పేరిట కొంతమంది వ్యాపారులే వచ్చి విక్రయాలు సాగిస్తున్నారు. వీరు కూడా పంటలు అందుబాటులో ఉన్న సమయంలో మాత్రమే వస్తున్నారు. మిగతా సమయంలో ఈ ప్రాంగణాలు బోసిపోతున్నాయి. సరకు నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడం కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది. తరచూ పెంచుతున్న అద్దెలతో మిగతా వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చేందుకు జంకుతున్నారు. కొద్ది నెలల్లో మరో రూ.500 పెంచుతామని చెబుతున్నారని.. ఇలా పెంచితే తాము వ్యాపారం ఎలా చేసుకోవాలని ఓ మహిళా వ్యాపారి వాపోయారు. ఉదయం వేళల్లో మాత్రమే కొందరు వినియోగదారులు ఇక్కడికి వస్తున్నారని.. అద్దెలు పెంచితే ఇక తాము వ్యాపారం చేయలేమని విక్రేతలు నిట్టూరుస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు