టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అప్పగించాలి

జిల్లాలో పూర్తయిన టిడ్కో గృహాలను నెలాఖరులోగా లబ్ధిదారులకు అప్పగించాలని కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలానీ సామూన్‌ అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరారు.

Published : 04 Jun 2022 02:52 IST

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : జిల్లాలో పూర్తయిన టిడ్కో గృహాలను నెలాఖరులోగా లబ్ధిదారులకు అప్పగించాలని కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలానీ సామూన్‌ అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరారు. స్థానిక కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో శుక్రవారం టిడ్కో గృహాల కేటాయింపు, అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరు తదితర అంశాలపై బ్యాంకు మేనేజర్లు, మెప్మా అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంద్యాల ఎస్సార్బీసీ కాలనీలో, నందమూరినగర్‌లో పూర్తయిన 4 వేల గృహాలను ఈనెల 30లోగా లబ్ధిదారులకు స్వాధీనపర్చాలని టిడ్కో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రాజశేఖర్‌ను ఆదేశించారు. గృహాల్లో చేరిన వెంటనే జులై నుంచి నెల వాయిదాల ప్రకారం రుణాల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సార్బీసీ కాలనీలో 3824, నందమూరినగర్‌లో 3,904, అయ్యలూరిమెట్టలో 2,272 గృహాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో టిడ్కో రుణాల మంజూరుపై బ్యాంకర్లకు కేటాయించిన లక్ష్యాల మేరకు ఆలస్యం లేకుండా మంజూరు చేయాలని కోరారు. లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ వెంకటనారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటకృష్ణ, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.

దిశ యాప్‌పై నేడు ప్రత్యేక డ్రైవ్‌ 

నంద్యాల నేరవిభాగం : నంద్యాల జిల్లాలో దిశ యాప్‌పై శనివారం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించానున్నట్లు కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలానీ సామూన్, ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలో శుక్రవారం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మహిళలకు రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ దిశ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారని వెల్లడించారు. స్మార్ట్‌ ఫోన్లు ఉన్న వారంతా దిశ యాప్‌ను తప్పనిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు. ఆపద సమయంలో అండగా ఉండే ఈ యాప్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ప్రమాదంలో ఉన్న వారు ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడికి చేరుకొని రక్షణ కల్పిస్తారన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని