చివరి ఆయకట్‌

జలాశయం పాత ఆయకట్టు 64 వేల ఎకరాల స్థిరీకరణ, కుడి ప్రధాన కాలువ ద్వారా కొత్తగా 1.20 లక్షల ఎకరాలకు నీరందించాలన్న లక్ష్యంతో 2003లో ప్రణాళిక రూపొందించారు. 118 కి.మీ పొడవున నిర్మించిన కుడి కాలువ మొత్తం సిమెంట్‌ లైనింగ్‌ చేస్తే వృథా తగ్గి..

Updated : 04 Jun 2022 04:05 IST

 లైనింగ్‌ పూర్తికాక అందని తోటపల్లి జలాలు  

రైతులకు వరప్రదాయిని తోటపల్లి జలాశయం ప్రధాన కుడికాలువ లైనింగ్‌ పనులకు మోక్షం కలగడం లేదు. ఫలితంగా ఏటా ఖరీఫ్‌లో చివరి ఆయకట్టుకు సాగునీరందక పంట కోల్పోతున్నారు.

న్యూస్‌టుడే-గరివిడి/చీపురుపల్లి: జలాశయం పాత ఆయకట్టు 64 వేల ఎకరాల స్థిరీకరణ, కుడి ప్రధాన కాలువ ద్వారా కొత్తగా 1.20 లక్షల ఎకరాలకు నీరందించాలన్న లక్ష్యంతో 2003లో ప్రణాళిక రూపొందించారు. 118 కి.మీ పొడవున నిర్మించిన కుడి కాలువ మొత్తం సిమెంట్‌ లైనింగ్‌ చేస్తే వృథా తగ్గి.. అదనంగా మరో 20 శాతం నీరు ఆదా అవుతుందని ఇంజినీరింగ్‌ అధికారులు అంచనా వేశారు. ఆ జలాలను చీపురుపల్లి నుంచి గజపతినగరం వరకు బ్రాంచి కెనాల్‌ తవ్వి మెరకముడిదాం, దత్తిరాజేరు, గజపతినగరం మండలాల్లో 15 వేల ఎకరాలకు, బొబ్బిలి, సీతానగరం, బాడంగి మండలాల్లో మరో 11 వేల ఎకరాలకు ఇవ్వొచ్చని భావించారు. నేటికీ కుడి కాలువ లైనింగ్‌ జరగకపోవడంతో నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. పైగా కాలువలో నీటి ప్రవాహం తగ్గి వృథా ఎక్కువవుతుండటంతో ముందుగా నిర్దేశించుకున్న 1.20 లక్షల ఎకరాల్లో చివరి ఆయకట్టుకు కూడా సక్రమంగా నీరందని పరిస్థితి నెలకొంది. పలుచోట్ల కాలువ గట్లు కోతకు గురి కాగా, పిచ్చి మొక్కలు పెరిగి నీరు వేగంగా పారడం లేదు.  

నిధులేవీ ?

కాలువ మొత్తం కాకపోయినా నీటి వృథా జరుగుతున్న ప్రధాన ప్రాంతాల్లో కనీసం 24 కి.మీ. పొడవునైనా లైనింగ్‌ పనులు చేయాలని.. ఇందుకు రూ.88 కోట్లు నిధులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటికీ మోక్షం లేదు. 

ప్రయోజనం ఇదీ 

* కాలువలో 10 నుంచి 15 అంగుళాల మందంలో సిమెంటు కాంక్రీట్‌తో లైనింగ్‌ నిర్మిస్తే నీటి పారుదల పెరుగుతుంది. 

* ప్రస్తుతం కాలువకు విడుదల చేసిన నీరు శివారు ప్రాంతానికి చేరేసరికి 10 నుంచి 12 రోజులు పడుతోంది. అదే లైనింగ్‌ జరిగితే రెండు, మూడు రోజుల్లోనే అందుతుంది. 

* నీటిలో 20 శాతం వరకు ఆదా అవుతుంది. కాలువలో తుప్పలు, పిచ్చి మొక్కలు మొలిచే అవకాశం ఉండదు. తద్వారా నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. 

* కాలువ గట్లు కోతకు గురయ్యే అవకాశం ఉండదు. భూగర్భంలో నీరు ఇంకకుండా నేరుగా కాలువ పొడవున జోరుగా ప్రవహిస్తుంది.

* ప్రస్తుతం పలుచోట్ల కాలువ గట్లు తవ్వి నీటిని చోరీ చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట పడుతుంది.

* కుడి కాలువ సీసీ లైనింగ్‌ పనులకు ఐదేళ్ల క్రితమే ప్రధానమంత్రి కిసాన్‌ సించాయి యోజన (పీఎంకెఎస్‌వై) కింద రూ.350 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు ఈ నిధులు రాలేదు.  

- రెడ్డి రామచంద్రరావు, ఈఈ తోటపల్లి ప్రాజెక్టు  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని