సాయంత్రం ఆరు దాటితే నీటిలోకి దిగనీయం

‘రుషికొండ బీచ్‌ వద్ద సాయంత్రం ఆరు గంటలు దాటితే పర్యాటకులను సముద్రంలోకి వెళ్లేందుకు అనుమతించడం లేదు. బీచ్‌లో ఎంత సమయమైనా గడపొచ్చు. నీటిలోకి ఎవరూ వెళ్లకుండా గస్తీ ఏర్పాటు చేశాం. బ్లూఫ్లాగ్‌ నిబంధనల ప్రకారం సాయంత్రం ఆరు తరువాత

Updated : 04 Jun 2022 05:49 IST

రుషికొండ తీరంలో బ్లూఫ్లాగ్‌ నిబంధనల అమలు

పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకులు రమణ

ఈనాడు, విశాఖపట్నం: ‘రుషికొండ బీచ్‌ వద్ద సాయంత్రం ఆరు గంటలు దాటితే పర్యాటకులను సముద్రంలోకి వెళ్లేందుకు అనుమతించడం లేదు. బీచ్‌లో ఎంత సమయమైనా గడపొచ్చు. నీటిలోకి ఎవరూ వెళ్లకుండా గస్తీ ఏర్పాటు చేశాం. బ్లూఫ్లాగ్‌ నిబంధనల ప్రకారం సాయంత్రం ఆరు తరువాత సముద్రంలోకి ఎవర్నీ అనుమతించకూడదు. చీకటి పడ్డాక అలల తీవ్రతకు ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉండడం వల్ల సందర్శకుల రక్షణ నేపథ్యంలో ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నాం. ముఖ్యంగా రుషికొండ తీరంలో సురక్షిత ప్రాంతం, నిషేధిత ప్రాంతాలను తెలిపేలా హెచ్చరిక బోర్డులు పెట్టించామ’ని పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు రమణ పేర్కొన్నారు. ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. 

వసతులు మెరుగు: రుషికొండ బీచ్‌కు వచ్చిన అంతర్జాతీయ బ్లూఫ్లాగ్‌ గుర్తింపు నవీకరణకు జులైలో దరఖాస్తు చేయనున్నాం. ఇందుకు అవసరమైన అన్ని ప్రమాణాలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ వసతులను మెరుగుపరుస్తున్నాం. గతంలో కొవిడ్‌ వల్ల నిర్వహణ ఆగిపోయింది. అప్పట్లో ఏర్పాటు చేసినవి దెబ్బతిన్నాయి. అత్యవసరంగా తాగునీటి శుద్ధి ప్లాంట్లు పెట్టిస్తున్నాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. మరుగుదొడ్లు, స్నానాల గదులు నిర్వహణలో ఉంచాం. బ్లూఫ్లాగ్‌ జెండాను పెట్టించాం. గతంలో ప్రైవేటు సంస్థ నిర్వహణ చేపట్టేది. ప్రస్తుతానికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహణ చేపడుతున్నాం. ఎక్కడా వ్యర్థాలు, శుభ్రత లోపించకుండా అప్రమత్తంగా ఉంటున్నాం.  

సింహాచలం పర్యాటక పనులపై నివేదిక 

సింహాచలం దేవస్థానం ప్రసాద్‌ పథకానికి ఎంపికైన విషయం తెలిసిందే. సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) మార్పుల తరువాత రూ.60 కోట్ల నిధుల మంజూరుకు కేంద్ర పర్యాటక శాఖ అంగీకరించింది. ఇందులో ఏరకమైన పనులు చేపట్టాలో ముందుగానే సూచించింది. క్యూలైన్లు, నిరీక్షణ గదులు, నీటి సరఫరా కేంద్రాలు, క్లాక్‌ రూమ్స్, బ్యాటరీ వాహనాలు.. ఇలా పర్యాటకుల అవసరాలు తీర్చే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రస్తుతానికి అంచనా నివేదిక పంపించాలి. దాన్ని కేంద్ర పర్యాటకశాఖ ఆమోదించిన తరువాత టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మరో మూడు నెలల్లో పూర్తవనుంది. ఆ తరువాత పనులు ప్రారంభమవుతాయి.  

నవంబరుకు లంబసింగి రిసార్టు అందుబాటులోకి..: శీతాకాలం ప్రారంభం నాటికి లంబసింగి హిల్‌ రిసార్టు ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే గుత్తేదారు ఎంపిక పూర్తవగా ఒప్పంద చర్యలు జరుగుతున్నాయి. మధ్యలో నిలిచిపోయిన సమావేశ మందిరం, కొన్ని గదులను పూర్తిచేయాలి. ఈ ప్రాజెక్టును విస్తరించాలని చూస్తున్నాం. అదనంగా కనీసం 20 గదులైనా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం పర్యాటక ప్రాజెక్టులో అనుభవమున్న కేరళకు చెందిన ఆర్కిటెక్టును సంప్రదించాం. ఆయన ఇప్పటికే దీన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.

తీరంలో భారీ పీపీపీ ప్రాజెక్టు: భీమిలి మండలం అన్నవరంలో ఓ భారీ ప్రాజెక్టు వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒబెరాయ్‌ సంస్థ భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. గత నెలలోనే కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. నూతన పర్యాటక విధానం ప్రకారం వివిధ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఎవరికైనా ఆసక్తి ఉంటే సంప్రదించొచ్చు. పాండ్రంగిలో మ్యూజియం, విశ్రాంతి గదులను రూ.2 కోట్లతో నిర్మిస్తున్నాం. కె.కోటపాడులోనూ అల్లూరికి సంబంధించి ఆంఫీ థియేటర్‌ పనులు జరుగుతున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని