నడిపించేది నాన్నే!

ఒకప్పుడు ఇంటి బాధ్యతల్ని మోస్తూ.. కనుసైగలతో పిల్లల్ని అదుపులో ఉంచేవాడు నాన్న. ఎప్పుడూ గంభీరంగా ఉండే నాన్న రానురానూ స్నేహితుడిలా మారిపోతున్నాడు

Updated : 18 Jun 2022 05:30 IST

రేపు.. ఫాదర్స్‌ డే

నాన్నంటే.. కొడుక్కి మొదటి హీరో.. కూతురికి మొదటి ప్రేమ..’
ఒకప్పుడు ఇంటి బాధ్యతల్ని మోస్తూ.. కనుసైగలతో పిల్లల్ని అదుపులో ఉంచేవాడు నాన్న. ఎప్పుడూ గంభీరంగా ఉండే నాన్న రానురానూ స్నేహితుడిలా మారిపోతున్నాడు. ‘మై డాడ్‌ ఈజ్‌ మై హీరో’, ‘మై డాడ్‌ ఈజ్‌ మై బెస్ట్‌ ఫ్రెండ్‌’ అని సామాజిక మాధ్యమాల్లో స్టేటస్‌ పెట్టుకునేంతగా పిల్లలకి దగ్గరవుతున్నాడు. ప్రేమ సంగతులు సైతం ‘షేర్‌’ చేసుకునేంత చొరవ ఇస్తున్నాడు. ఒకప్పుడు వాలు కుర్చీలో కూర్చొని ఆజ్ఞలు జారీ చేసే ఇంటి పెద్ద ఇప్పుడు వంట గదిలో అమ్మకి సాయం చేస్తున్నాడు. తప్పు చేస్తే దండించే ఆ పెద్దరికమే.. భుజం మీద చెయ్యేసి అలా చేయొద్దని ప్రేమగా మందలిస్తోంది. మునుపటిలా గద్దించడం లేదు.. గుడ్లురిమి చూడటం లేదు. ఈతరం నాన్నకి కంటిచూపుతోనే పిల్లల్ని అదుపులో పెట్టాలనే అత్యాశ అంతకన్నా లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. నాన్న అమ్మలా మారిపోయి పిల్లల్ని అక్కున చేర్చుకుంటున్నాడు.

నాన్నకేమైంది? ఎందుకిలా మారాడు?
ఇది కాలం తెచ్చిన మార్పో, నాన్నలో వచ్చిన పరివర్తనో.. ఏదేమైనా అంతా మనమంచికే. నిజం చెప్పాలంటే ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాలనే అత్యాశ ఈతరానిది. ఆ మనస్తత్వమే డాడీ అందిపుచ్చుకుంటున్నాడు. ఐదంకెల జీతం కన్నా ఎల్‌కేజీలో పాపకొచ్చే మార్కులు చూసే మురిసిపోతున్నాడు. ఆస్తులు పోగేసుకోవడం కన్నా తన ఐదేళ్ల పిల్లాడు అలవోకగా ఈత కొడుతుంటే వచ్చే ఆనందమే ఎక్కువంటాడు. కాసుల గలగలలకన్నా పిల్లల మొహాల్లో కనిపించే నవ్వుల కోసమే తపిస్తాడు.
మరోవైపు ఈ ఆధునిక యుగంలో అమ్మానాన్నలిద్దరూ తప్పక పని చేయాల్సిన పరిస్థితి. అందుకే మొహమాటాలు వదిలేసి ఇంటి బాధ్యతల్నీ పంచుకుంటున్నాడు నాన్న. ఈసమయంలో తన వారసులతో గడిపే క్షణాలు మరపురానివిగా మార్చుకోవాలనే తాపత్రయం తనది. పాప చిటికెనవేలు పట్టుకొని స్కూలుకి తీసుకెళ్లడం, డైపర్లు మార్చడం... ఇలా ప్రతిదాంట్లో ఆనందం వెతుక్కుంటున్నాడు. పిల్లలే తన భవిష్యత్తు అనుకునే వ్యక్తికి అంతకుమించిన ఆశ ఏముంటుంది మరి?
మిలీనియల్సూ.. ఈతరం అబ్బాయిలూ... ఈ సంగతులన్నీ మీకూ వర్తిస్తాయి. ఎందుకంటే రేపు మీరూ నాన్నవుతారు. మంచిని పంచుతూ.. పిల్లల్ని ప్రేమగా పెంచుతూ మంచి తండ్రిగా నిరూపించుకోవాలిగా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని