నే ఆడితే.. లోకమే ఆడదా..

‘స్టేజీ మీద ఎవరైనా స్టెప్పులేస్తారు...నాలాగా నీటిలో అదరగొడతారా?’ అని సవాల్‌ విసురుతున్నాడు జైదీప్‌ గోహిల్‌. ఒకటి కాదు.. రెండు కాదు.. రెండువందల సార్లు ఇలాంటి ఫీట్లు చేశాడు   ఈ ‘గుజరాత్‌ హైడ్రోమ్యాన్‌’. ఇతగాడి అరుదైన కళకి జనం నీరాజనం పడుతున్నారు.

Published : 16 Jul 2022 00:53 IST

‘స్టేజీ మీద ఎవరైనా స్టెప్పులేస్తారు...నాలాగా నీటిలో అదరగొడతారా?’ అని సవాల్‌ విసురుతున్నాడు జైదీప్‌ గోహిల్‌. ఒకటి కాదు.. రెండు కాదు.. రెండువందల సార్లు ఇలాంటి ఫీట్లు చేశాడు   ఈ ‘గుజరాత్‌ హైడ్రోమ్యాన్‌’. ఇతగాడి అరుదైన కళకి జనం నీరాజనం పడుతున్నారు.
జైదీప్‌కి చిన్నప్పుట్నుంచీ ఈత అంటే సరదా. ఐదేళ్ల నుంచి రోజూ దగ్గర్లోని నదికెళ్లి ఈత కొడుతుండేవాడు. అప్పట్నుంచే తనకి నీళ్లు నేస్తమయ్యాయి. ఓరోజు ఇలాగే నీళ్లలో ఉండగా ‘లోపలికి వెళ్లి డ్యాన్స్‌ చేయగలవా?’ అని సవాల్‌ విసిరాడు జైదీప్‌ తండ్రి. దాన్ని స్వీకరించి సరదాగా ప్రయత్నించాడు. తర్వాత ఇలా నీళ్లలో డ్యాన్స్‌ చేసేవాళ్లు ఎవరైనా ఉన్నారా అని అంతర్జాలం గాలించాడు. స్విమ్మింగ్‌ఫూల్‌ అడుగుకెళ్లి రోజూ నృత్యం సాధన చేసేవాడు. కొన్నాళ్లయ్యాక దుబాయ్‌ నుంచి ప్రత్యేకంగా డిజైనర్లను పిలిపించి 24 మిల్లీమీటర్ల మందమైన అద్దాలతో ఒక పెద్ద నీటి తొట్టెను ఇంటిదగ్గరే తయారు చేయించుకున్నాడు. అందులోకి ఆక్సిజన్‌ వచ్చేలా ఏర్పాట్లు చేశాడు. ట్రైప్యాడ్‌కి కెమెరా అమర్చి అందులోకి దిగి పాటలకు అనుగుణంగా నృత్యం చేసేవాడు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా క్రమంగా వాటిని అధిగమించాడు. ఈ నీటి తొట్టెలోనే రకరకాల సెట్టింగ్‌లు వేసి ఇప్పటివరకు రెండు వందలకుపైగా లఘు వీడియోలు రూపొందించాడు. అతడి అరుదైన ప్రతిభ దేశమంతా తెలిసింది. చాలామంది ప్రశంసించసాగారు. కొందరు బాలీవుడ్‌ తారలు సైతం జైదీప్‌ వీడియోలను షేర్‌ చేశారు. ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’ ప్రదర్శనతో బాగా పాపులర్‌ అయ్యాడు. ఇండియా మొదటి అండర్‌వాటర్‌ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న జైదీప్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడున్నర లక్షలమంది అనుసరిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని