ఆఫీసు ప్రేమలు.. అదుపు అదుపు!

ఔనన్నా.. కాదన్నా..ఆఫీసు ప్రేమలు పెరిగిపోతున్నాయన్నది వాస్తవం. అమెరికన్‌ సైకలాజికల్‌ ఇనిస్టిట్యూట్‌ అధ్యయనం ప్రకారం సహోద్యోగులతో ప్రేమలో పడిపోయేవాళ్లు, మనసు ఇచ్చిపుచ్చుకునేవాళ్లు భారత్‌లో 32శాతం.

Published : 03 Sep 2022 00:18 IST

ఔనన్నా.. కాదన్నా..ఆఫీసు ప్రేమలు పెరిగిపోతున్నాయన్నది వాస్తవం. అమెరికన్‌ సైకలాజికల్‌ ఇనిస్టిట్యూట్‌ అధ్యయనం ప్రకారం సహోద్యోగులతో ప్రేమలో పడిపోయేవాళ్లు, మనసు ఇచ్చిపుచ్చుకునేవాళ్లు భారత్‌లో 32శాతం. అయితే ప్రేమికుల మధ్య రొమాన్స్‌, గిల్లికజ్జాలు పని వాతావరణాన్ని దెబ్బతీయకూడదన్నదే పాయింట్‌. ఇలాంటి గూటి పక్షులు తమ అనుబంధాన్ని కొనసాగిస్తూనే మంచి ఉద్యోగి అనిపించుకోవాలంటే...
* మీ ప్రేమ గురించి ఆఫీసులో అందరికీ తెలియకుండా జాగ్రత్త పడితే సంస్థకు, ఉద్యోగులకూ మంచిది. ఈ సాన్నిహిత్యాన్ని అక్కడ ప్రదర్శించాలని చూస్తే అనుబంధానికే ఎసరు వచ్చే ప్రమాదం. కొన్ని సంస్థలు ఇలాంటి రిలేషన్‌షిప్‌లను ఆమోదించవు.
* ప్రేమికులైన ఉద్యోగులు ఏ  హోదాలో ఉన్నా.. పని విషయంలో సహోద్యోగులుగానే మెలగాలి. వాళ్ల హోదాకు అనుగుణంగా ప్రవర్తించాలి. దగ్గరివాళ్లనే చనువు, సాన్నిహిత్యం అసలు చూపించవద్దు.
*ఆఫీసు ఫోన్లు, కార్యాలయ సామాజిక మాధ్యమ బృందాల్లో వ్యక్తిగత సందేశాలు పంపుకోవడం శ్రేయస్కరం కాదు. మీ బంధం బట్టబయలు కావడమే కాదు.. ఈ చొరవను అందరూ హర్షించరు. దీనికి బదులు సొంత గ్యాడ్జెట్లను ఉపయోగించాలి.
* క్యాబిన్‌లో, క్యాంటీన్‌లో ముచ్చట్లు, ముద్దూమురిపాలు, స్పృశించడం... పని వాతావరణాన్ని దెబ్బ తీస్తుంది. ఇలాంటి వ్యవహారాలన్నీ ఆఫీసు బయటే అందంగా ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని