అతి వాడకం.. అన్‌సబ్‌స్క్రైబ్‌ ప్లీజ్‌!

పక్క దిగకముందే ఫేస్‌బుక్‌లో లైక్‌ల లెక్కలు... అర్ధరాత్రి దాటినా వాట్సప్‌ నోటిఫికేషన్లపై ఆరాటం... పదేపదే ఇన్‌స్టా రీల్స్‌పై యావ... ప్రతి నిమిషానికీ ఫోన్‌ తడుముకునే అలవాటు... మన పోస్టులకి క్లిక్స్‌ రాకపోతే బాధ..

Published : 17 Sep 2022 00:40 IST

పక్క దిగకముందే ఫేస్‌బుక్‌లో లైక్‌ల లెక్కలు... అర్ధరాత్రి దాటినా వాట్సప్‌ నోటిఫికేషన్లపై ఆరాటం... పదేపదే ఇన్‌స్టా రీల్స్‌పై యావ... ప్రతి నిమిషానికీ ఫోన్‌ తడుముకునే అలవాటు... మన పోస్టులకి క్లిక్స్‌ రాకపోతే బాధ.. పక్కవాళ్లకి వస్తే ఏడుపు... ఇదీ మీ పరిస్థితా? అయితే మీకు కావాలో బ్రేక్‌! అదే యావలో ఉంటే మానసిక రుగ్మతలు ఖాయమనీ.. వాటి బారిన పడకముందే ‘డిజిటల్‌ డిటాక్స్‌’ బాట పట్టమంటున్నారు మానసిక నిపుణులు.

ప్రతి సామాజిక మాధ్యమ నిర్వాహకులు తమ యాప్‌ని ఎక్కువమంది చూడాలి.. అత్యధిక సమయం వెచ్చించాలనుకుంటారు. కానీ చిత్రంగా.. ఇన్‌స్టాగ్రామ్‌ తమ యాప్‌లో ‘టేక్‌ ఏ బ్రేక్‌’ ఫీచర్‌ జోడించింది. ‘బ్రేక్‌ జరూరీ హై’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో విస్తృత ప్రచారం చేసింది. అంతర్జాలానికే అతుక్కుపోయే యువతను ఆ వ్యసనం నుంచి బయట పడేసేందుకే ఈ ప్రయత్నమట. రెండేళ్ల కిందటిదీ ముచ్చట. ఇప్పటికీ ఆ పరిస్థితిలో మార్పేం లేదు. నిజానికి స్మార్ట్‌ఫోన్‌, సామాజిక మాధ్యమాలు రెండువైపులా పదునున్న కత్తిలాంటివి అన్నది అందరూ చెప్పే మాటే. వాడకం తీరులోనే లాభనష్టాలుంటాయి.  తాత్కాలిక ఆనందాల ఊబిలోకి దిగిపోతే మానసిక ఒత్తిళ్లకు గురవడం ఖాయం. వాడకం వ్యసనంలా మారితే అసలుకే మోసం. అందుకే ఈ వర్చువల్‌ వరల్డ్‌కి విరామం ప్రకటించి వాస్తవిక ప్రపంచంలోకి రావాలంటారు. యూనివర్సిటీ ఆఫ్‌ బాత్‌ పరిశోధకులు సామాజిక మాధ్యమాలను విరివిగా వాడే యువతపై రెండేళ్లపాటు అధ్యయనం చేశారు. అందులో 61శాతం మంది ఏదో ఒక సమయంలో.. కొద్దిరోజులైనా వాటికి అడిక్ట్‌ అయిపోతున్నారట. అందులో పూర్తిగా కూరుకొనిపోయి మానసిక సమస్యలు కొని తెచ్చుకుంటున్నవారు తొమ్మిది శాతం ఉన్నారంటున్నారు. వీరిలో విపరీతమైన ఉద్రేకం, ఆందోళన, మానసిక కుంగుబాటు చెలరేగుతున్నట్టు తేల్చి చెప్పారు. ఈ పరిస్థితి రాకముందే యువత మేల్కొనాలి.

వీళ్లకి కావాలి బ్రేక్‌..
* ఇతరుల పోస్టులు, కామెంట్లకు అతిగా స్పందించేవారు. సామాజిక మాధ్యమాల్లో వాదనకు దిగేవారు.
* అందం, ప్రేమ, కెరియర్‌, సంబంధాలు, ఆరోగ్యం, జీవితం.. ఇలా ప్రతీ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకునే వారు.
* వీళ్లు పొద్దున బెడ్‌ దిగుతూనే ఫోన్‌ అందుకుంటారు. రాత్రి పడక ఎక్కేవరకూ వదలరు.
* స్నేహితులు, సహోద్యోగులు.. పక్కనున్నా.. ఏదైనా చర్చ నడుస్తున్నా వీళ్లు మాత్రం అంతర్జాలంలోనే.
* పొగడ్తల కోసం ఎదురుచూస్తుంటారు. అనుకున్నంత స్పందన రాకపోతే నిరుత్సాహానికి గురవుతారు.
* సమయం, సందర్భం లేకుండా వీడియోలు చేస్తారు. సెల్ఫీలు తీసుకొని పోస్ట్‌ చేస్తుంటారు.

బయట పడదామిలా..
* ఏకాగ్రత చెడగొట్టే సామాజిక మాధ్యమాల నోటిఫికేషన్లు ఆఫ్‌ చేయండి. ఫలానా సమయంలోనే నోటిఫికేషన్లు వచ్చేలా సెట్‌ చేసుకోవాలి.
* సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోయే సమయంలోనే స్నేహితులతో షికారుకు వెళ్లడం, నడక, వ్యాయామం, బయటికెళ్లడం లాంటివి పెట్టుకోవాలి.
* అనారోగ్యకరమైన చర్చలు, నెగెటివ్‌ కామెంట్‌ చేసేవాళ్లకు దూరంగా ఉండాలి.  
* వీలైతే యాప్స్‌ని తొలగించడం ఉత్తమం. కుదరకపోతే రోజులో ఫలానా సమయంలోనే వాడాలని నియమం పెట్టుకోవాలి.
* పుస్తకాలు చదవడం, కోర్సులో చేరడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం లాంటి వ్యాపకం పెట్టుకుంటే ఫోన్‌ వాడాలనే ధ్యాస తగ్గుతుంది.
* ఇంటర్నెట్‌ వాడకాన్ని రోజుకి అరగంట చొప్పున తగ్గిస్తూ వస్తే మానసిక ఒత్తిళ్లు దూరమవుతాయని ఆస్ట్రియా పరిశోధకులు చెబుతున్నారు.

విరామం ఎందుకంటే..
* ఎక్కువ గంటలు తెర ముందు గడిపితే.. ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు మొదలవుతాయి.
* ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఔట్‌ (ఫోమో) వల్ల ఏదో కోల్పోతున్నాం భావనలో ఉంటారు. అదేపనిగా అంతర్జాలంలో ఉంటే నిద్రకు అంతరాయం.
* పోస్టులు, రీల్స్‌కి ఆశించనంత స్పందన రాకపోతే కొందరు కుంగిపోతారు.
* మన పోస్టులకు అందరూ సానుకూలంగా స్పందించరు. కొందరు ట్రోలింగ్‌ చేస్తారు. ప్రతికూల కామెంట్‌ చేస్తారు. సున్నిత మనస్కులు దీన్ని తట్టుకోలేరు.
* అదేపనిగా తెర ముందే ఉంటే శరీరానికి వ్యాయామం కొరవడి బరువు పెరుగుతారు.
* స్క్రీన్‌ టైం ఎక్కువైతే కంటిచూపు సమస్యలొస్తాయి. మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
* టైం మేనేజ్‌మెంట్‌ తెలియదు. ఉద్యోగులు పనిపై దృష్టి పెట్టలేరు. విద్యార్థులు చదువు నిర్లక్ష్యం చేస్తారు.


తారలే వదిలేస్తుంటే..

దక్షిణాది అగ్ర తార సమంత ఈమధ్య సామాజిక మాధ్యమాలకు తాత్కాలిక విరామం ప్రకటించింది. విషప్రచారం, ప్రతికూల వ్యాఖ్యల నుంచి దూరంగా ఉండటానికి తనలా చేస్తున్నానంది. రానా దగ్గుబాటి, ఆమిర్‌ఖాన్‌, హీనాఖాన్‌, సోనాక్షి సిన్హా, ఫాతిమ సనాషేక్‌లు సైతం గతంలోనే వదిలేశారు. ఈమధ్య కాలంలో సామాజిక మాధ్యమాలు మంచి ఆదాయ వనరులుగానూ మారాయి. యూట్యూబ్‌ వీడియోలు, ఇన్‌స్టాలో కంపెనీల తరపున పోస్టులు పెడుతూ సెలెబ్రిటీలు ఈమధ్య బాగానే సంపాదిస్తున్నారు. అయినా వాళ్లే అంతర్జాలాన్ని పక్కన పెడుతున్నప్పుడు.. మనం వాటికి బానిసల్లా మారి మానసిక రోగాల బారిన పడటం అవసరమా అన్నది ఆలోచించాలి.


అదొక ఊహా ప్రపంచం

నాలుగైదేళ్ల కిందట ఇంటర్నెట్‌ని రోజుకి పది, పన్నెండు గంటలైనా వాడేవాణ్ని. క్లాసులో స్నేహితులతో చాటింగ్‌, ఫొటోలు పంపుకోవడం ఘనకార్యాలుగా భావించేవాణ్ని. దీంతో పనులన్నీ వాయిదా పడేవి. చదువులో వెనకబడ్డాను. మరోవైపు నా స్నేహితులేమో సమయం సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత కొందరిని కలిసి అభిప్రాయాలు పంచుకున్నా. అప్పటిదాకా నేను ఊహా ప్రపంచంలో ఉన్నానని అర్థమైంది. సన్నిహితుల సలహాతో నవలలు చదవడం, వాకింగ్‌కి వెళ్లడం, ధ్యానం చేయడం.. అలవరచుకున్నా. సెల్‌ఫోన్‌ చూడొద్దని కొన్నాళ్లు రీఛార్జ్‌ చేయడమే ఆపేశా. మొదట్లో కష్టంగా అనిపించినా తర్వాత అలవాటైంది. ఇప్పుడు అవసరం ఉంటేనే సామాజిక మాధ్యమాలు తెరుస్తున్నా. 

- అనిల్‌, బీటెక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు