కలవకున్నా.. విడిపోదీ స్నేహం

భుజం భుజం రాసుకోవాలి.. బాతాఖానీ కొట్టాలి.. పార్టీలూ ఉండాలి.. స్నేహమంటే ఇంతేనా? ఈ అభిప్రాయం ఉంటే వెంటనే మార్చేసుకోండి. ఎంతో దూరంలో ఉన్నా.. ఏళ్లకొద్దీ మాట్లాడుకోకపోయినా.. ఫ్రెండ్షిప్‌కి వచ్చిన ఢోకా ఏమీ లేదని ఓ అధ్యయనంలో తేలింది.

Published : 08 Oct 2022 00:27 IST

భుజం భుజం రాసుకోవాలి.. బాతాఖానీ కొట్టాలి.. పార్టీలూ ఉండాలి.. స్నేహమంటే ఇంతేనా? ఈ అభిప్రాయం ఉంటే వెంటనే మార్చేసుకోండి. ఎంతో దూరంలో ఉన్నా.. ఏళ్లకొద్దీ మాట్లాడుకోకపోయినా.. ఫ్రెండ్షిప్‌కి వచ్చిన ఢోకా ఏమీ లేదని ఓ అధ్యయనంలో తేలింది. మరి ఎందుకు ఇలాంటి స్నేహం కలకాలం నిలిచి ఉంటుందంటే...

* ఏళ్లు గడిచిన తర్వాత కూడా పాత జ్ఞాపకాలు గుర్తుకు రాగానే పెదాలపై చిరునవ్వు వచ్చి చేరుతుందంటే అది ఆరోగ్యకరమైన అనుబంధం. వాళ్లు గడ్డుకాలంలో స్నేహితుడి ముఖంలో చిరునవ్వుకై తపిస్తారు. వాళ్ల సంతోషం కోసం శక్తిమేరా ప్రయత్నిస్తారు. ఎట్టి సందర్భాల్లోనూ, ఎంతకాలమైనా ఈ పాత స్నేహితులు ఒకర్నొకరు మర్చిపోయే పరిస్థితే ఉండదు.
* మంచి స్నేహితులు ఒకరిలో మరొకరు లోపాలు వెతకరు. దీర్ఘకాలం తర్వాత కలిసినా తమ మధ్య అల్లుకున్న మధుర స్మృతులనే గుర్తు చేసుకుంటారు. ఏళ్ల తర్వాత ఎదురుపడ్డా క్షణం ఆలస్యం చేయకుండా ఒకర్నొకరు హత్తుకుంటారు తప్ప.. దూరమయ్యాం కదాని దూరదూరంగా ఉండరు.
* జుట్టు నెరిసినా బాల్యస్మృతులు కళ్ల ముందరే మెదులుతుంటాయి. కర్ర ఊతంగా పట్టుకోవాల్సిన సందర్భం వచ్చినా.. క్లాస్‌రూం తుంటరి పనులు జ్ఞాపకముంటాయి. ఒకరికొకరు ఎదురుపడగానే ఉత్సాహం లావాలా ఎగజిమ్ముతుంటుంది.
* స్నేహం పాతబడినకొద్దీ మరింత పరిమళిస్తుందే తప్ప దానికి గడువు తేదీ ఉండదు. ఫోన్‌ చేయలేదు.. వాట్సప్‌లో పలకరించలేదు... అనే చిన్నచిన్న విషయాలు పట్టించుకోరు. ఒక్కసారి ఎదురుపడగానే ఎప్పుడో తప్పిపోయిన ప్రాణం తిరిగి వచ్చిందని భావిస్తారు.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని