ఫొటోలకి హారతులిచ్చా..రీల్స్‌కి ప్రదక్షిణలు చేశా!

అమీర్‌పేట్‌ సెంటర్లో ఆదరాబాదరాగా వెళ్తుంటే.. చుక్కల చుడీదార్‌ వేసుకున్న ఓ సూదంటు చూపుల చిన్నది ఒక్కసారిగా నన్ను మైకంలో ముంచెత్తింది.

Published : 03 Dec 2022 00:10 IST

అమీర్‌పేట్‌ సెంటర్లో ఆదరాబాదరాగా వెళ్తుంటే.. చుక్కల చుడీదార్‌ వేసుకున్న ఓ సూదంటు చూపుల చిన్నది ఒక్కసారిగా నన్ను మైకంలో ముంచెత్తింది. మైమరిచి తననే చూస్తుంటే.. ఆ క్షణమే మాయమై.. నా గుండెకు పెద్ద గాయం చేసింది. వెనకే ఫాలో అయితే లాభం లేదనుకొని ఆన్‌లైన్‌లో గాలమేసి పట్టుకోవడమే మేలనుకున్నా. చుట్టుపక్కల అడిగి మరీ సుందరాంగి సమాచారం సేకరించా. ఆపై అర్జెంటుగా ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌స్టాల్‌ చేసి.. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టి ప్రాణమంతా ఫోన్‌పైనే పెట్టేశా. మూడు రోజులకు నా మురిపెం తీర్చి దేవత వరమిచ్చింది. నా రిక్వెస్ట్‌ని తను యాక్సెప్ట్‌ చేయగానే.. నన్నే యాక్సెప్ట్‌ చేసినంత ఆనందంతో గెంతులేశా. నీ చిరునవ్వుకు ఫిదా అయ్యానంటూ.. చిరు సందేశాల నుంచి ఎడతెరిపి లేకుండా ఎసెమ్మెస్‌లు పంపా. ఫొటోలకి హారతులిచ్చా.. రీల్స్‌కి ప్రదక్షిణలు చేశా. తన ప్రతి పోస్టుకి లైక్‌ కొట్టా. నన్ను లైక్‌ చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేశా. తనని నీడలా ఫాలో అయితే నాకు తోడు నిలుస్తుందనుకుంటే.. నన్నో పీడలా భావించి దూరం దూరం అంది. ఆమె ఐడీలో నా ఇంటిపేరు చేర్పించాలని ఆశ పడితే.. ఓ కేడీలా చిన్నచూపు చూసి.. కేసు పెడతానని హెచ్చరించింది. ఆఖరికి నా మనసుని తనకి ఫార్వార్డ్‌ చేసి.. అభిప్రాయం అడిగితే.. నా ఖాతానే బ్లాక్‌ చేసి మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేసింది. తనకి మూడు ముళ్లు వేసి నా జీవితం సార్థకం చేసుకోవాలనుకుంటే.. మూడేళ్లుగా జాడే లేక.. నా జిందగీని నరకంలోకి నెట్టేసింది.
                         ఆకం శివసాయి, ఈమెయిల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని