అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి!

అది ఫిబ్రవరి నెల.. యువ హృదయాలు ప్రేమ జపం చేసే మాసం. ఊరి నుంచి నగరానికి వెళ్లే దారిలో ఉన్నా. బస్సులో నా పక్క సీటు ఖాళీగా ఉంది.

Updated : 04 Mar 2023 08:39 IST

 

ఏదో సరదాగా..

అది ఫిబ్రవరి నెల.. యువ హృదయాలు ప్రేమ జపం చేసే మాసం. ఊరి నుంచి నగరానికి వెళ్లే దారిలో ఉన్నా. బస్సులో నా పక్క సీటు ఖాళీగా ఉంది. నా హృదయంలో ఓ అమ్మాయికి చోటూ ఉంది. ఈ ప్రయాణం నా ప్రేమ ప్రయాణానికి నాంది కావాలని ఆశపడ్డా. అందమైన కురులు.. అచ్చెరువొందే సౌందర్యం ఉన్న ఓ అతిలోక సుందరి వచ్చి నా పక్కన కూర్చోవాలని కలలు కన్నా. ఆ దేవుడు నా మొరను ఆలకించినట్టున్నాడు. అప్సరసలాంటి అమ్మాయి సరాసరి వచ్చి నా సరసన కూర్చునేలా చేశాడు. ఆమెని చూడగానే నాలో ప్రేమ గంటలు గణగణమని మోగాయి. క్షణం ఆలస్యం చేయకుండా సరసంగా మాటలు కలిపా. నీరసంగా తనూ ఊకొట్టింది. బస్సుతోపాటు నాలో కోర్కెల వేగమూ పెరిగింది. కాసేపయ్యాక అది ఫిబ్రవరి మాసమని గుర్తొచ్చింది. ఓ తాజా రోజా పువ్వు ఇచ్చి ఆమెతో నా పెళ్లికి బాజాలు మోగిద్దామనే ఊహల్లో తేలిపోయా. ఆమె ఒప్పుకుంటే సంచిలో ఉన్న కాజా తీసి తన నోటికి అందిద్దామనుకున్నా. నా మోజు తీరేలా.. జాతీయ రహదారిపై సాఫీగా సాగిపోతున్న నా ప్రేమ ప్రయాణానికి టోల్‌గేట్‌లా అడ్డొచ్చాడు కండక్టర్‌. నాకు తన పక్కన చోటిచ్చి.. నా సుందరాంగిని మరో అతివ పక్కన కూర్చోమన్నాడు. ‘రాహుకాలంలో శనిలా వచ్చాడేంటి’ అని గొణుక్కొని.. అయినా ఫర్వాలేదు ఓ శుభసమయం చూసి ఆ అమ్మాయి సెల్‌ నెంబర్‌ కనుక్కుందామనుకున్నా. బస్సు దిగేటప్పుడు తనని ప్రేమారా ఓమారు పిలిచా. వెనక్కి తిరిగి ఓరకళ్ల చూపులతో నా ప్రేమని స్వీకరిస్తుందనుకుంటే.. ‘బై.. అన్నయ్యా’ అని చెప్పి నా గుండెలో బాంబులు పేల్చింది. అంతటితో నా కలల్ని నేలమట్టం చేసుకొని.. బస్టాప్‌లోనే నా ప్రేమకు ఫుల్‌స్టాప్‌ పెట్టేసుకొని వడివడిగా ముందుకు అడుగులేశా.

 పి.సాంబశివారెడ్డి, కడప


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని