వడ్డీతో వడ్డాణం చేయిస్తా

నిన్ను చూస్తుంటే.. మూలధనంలా ముద్దుగా కనిపిస్తున్నావు. కొంటె చూపులతో వడ్డీలాగా ఊరిస్తున్నావు. నిత్యం కళ్లెదురుగా ఉండే నువ్వు.. ఆస్తిలాంటి నా మనసును దోచావు.

Updated : 20 May 2023 11:53 IST

 

డియర్‌ భూమి!

నిన్ను చూస్తుంటే.. మూలధనంలా ముద్దుగా కనిపిస్తున్నావు. కొంటె చూపులతో వడ్డీలాగా ఊరిస్తున్నావు. నిత్యం కళ్లెదురుగా ఉండే నువ్వు.. ఆస్తిలాంటి నా మనసును దోచావు. రుణంలాంటి నీ వయసు, కాపుకొచ్చిన పంటలాంటి నీ సొగసు.. యంత్రం లాంటి నన్ను ఏదో మంత్రం వేసినట్టు కట్టి పడేశాయి. చేతిలో ఎంత నగదు ఉన్నా.. నీ చిరునవ్వుకు సరిరాదని, బ్యాంకులో ఎంత పోగేసుకున్నా నీ చేతి గాజు విలువ కూడా చేయదని తెలుసుకున్నాను. నీ పలుకు తొలి పద్దు, నీ మౌనం ఎదురు పద్దు, నువ్వు ఇచ్చే వరం జంట పద్దుగా భావించి.. గుడ్‌విల్‌లా నా గుండెల్లో నీపై ప్రేమను పెట్టుబడిగా పెట్టాను. ప్రతిఫలంగా నీ ఇష్టాన్ని పంచితే.. మూలధనంపై వచ్చిన వడ్డీతో వడ్డాణం చేయిస్తా. అమ్మకాలతో అందిన కమీషన్‌తో కమ్మలు కొనిపెడతా. నా చిల్లర ఖర్చులు తగ్గించుకొని మరీ చీరలు కొనిస్తా. ఫర్నిచర్‌ అమ్మి పట్టీలు తెచ్చిస్తా. సఖీ.. ఆస్తి, అప్పుల పట్టిలాగా అందంగా ఉన్నావని నిన్ను చూసి అట్రాక్ట్‌ కాలేదు. లాభనష్టాల ఖాతాలో నీ క్యారెక్టర్‌ని క్రెడిట్‌ చేశాను. నీలోని కోపం, బాధను డెబిట్‌ చేశాను. ప్రతిఫలంగా నీ మనసులో కలిగే ప్రేమ, ఆప్యాయత, అనురాగం కోసం ఆరాట పడుతున్నాను. బంగారం తరుగుదలలా కాకుండా తరగని ప్రేమను పంచుతావని ఆశిస్తూ. - ఇట్లు నీ ప్రేమ భూస్వామి.
పంపినవారు: ఆర్‌.శ్రీనివాసులు, బి.కొత్తకోట


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని