అనుబంధం పదిలంగా..

తండ్రి అయ్యాకే.. తండ్రి విలువ తెలుస్తుందంటారు. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ.. కడదాకా తోడుండేది ఆయన. ఆ నాన్నతో అనుబంధాన్ని మరింత దృఢం చేసుకోవాలంటే ఏం చేయాలి?

Published : 17 Jun 2023 00:05 IST

తండ్రి అయ్యాకే.. తండ్రి విలువ తెలుస్తుందంటారు. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ.. కడదాకా తోడుండేది ఆయన. ఆ నాన్నతో అనుబంధాన్ని మరింత దృఢం చేసుకోవాలంటే ఏం చేయాలి?

* వయసు, అభిప్రాయాల్లో తేడాలున్నా.. కొన్ని అభిరుచులు, అలవాట్లు, ఇష్టాల్లో.. పిల్లలు, తండ్రికి లంకె కుదురుతుంది. క్రికెట్‌, సినిమా, రెస్టరంట్‌, గార్డెనింగ్‌.. ఇలాంటివి. ఇవి కలిసే చేసినప్పుడు, చూసినప్పుడు కచ్చితంగా మరింత దగ్గరవుతారు.

* తండ్రి అయ్యేసరికే నాన్నకి ఎన్నో అనుభవాలుంటాయి. ‘డాడీ.. మీ జీవితంలోని బెస్ట్‌, వరస్ట్‌ అనుభవాలేంటో చెప్పండి’ అని ఒక్కసారి అడిగిచూడండి. మిమ్మల్ని ప్రేమగా దగ్గరకు తీసుకొని ఆయన కష్టం, కన్నీళ్లు, కలలు, కల్లలు, కల్లోలాలు, స్నేహితులు, లక్ష్యాలు, విజయాలు, పరాజయాలు.. అన్నీ మీ ముందు ఉంచుతారు.

* ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేముందు, కష్టాల ఊబిలో ఇరుక్కుపోయినప్పుడు.. ఒక్కసారి నాన్నని అడిగి చూడండి. ఆయన కచ్చితంగా ‘ది బెస్ట్‌’ ఇస్తారు. మిమ్మల్ని ఆ కడగండ్ల నుంచి గట్టెక్కిస్తారు. అవి ఏళ్లకొద్దీ కాచి వడబోసిన అనుభవసారాలు.

* నాన్నకి దగ్గరయ్యే మరో మార్గం ఆయన చేసే పనిలో చేదోడువాదోడుగా ఉండటం. అది చిన్నదైనా.. ఆయనను జీవితంలో మరో మెట్టు ఎక్కించేదైనా.. తనకి అమితమైన ఆనందాన్ని కలగజేస్తుంది. మీ బంధాన్ని దృఢం చేస్తుంది. ఆయన బండి తుడవడం, ఇంటికి రాగానే సపర్యలు చేయడం, బిల్లులు చెల్లించడం.. ఆ మాత్రం చాలు నాన్న మిమ్మల్ని చూసి పొంగిపోవడానికి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని