ప్రేమంటే మోజు..పెళ్లంటే చేదు!

పాతిక దాటగానే కుర్రకారు పెళ్లి కోసం పరుగులు పెట్టడం మన దగ్గర రివాజు. చైనాలో మాత్రం ముప్ఫై వచ్చినా ఆ ముద్దూ ముచ్చటకి దూరం దూరం అంటోంది చైనా యువత.

Updated : 08 Jul 2023 04:10 IST

 

పాతిక దాటగానే కుర్రకారు పెళ్లి కోసం పరుగులు పెట్టడం మన దగ్గర రివాజు. చైనాలో మాత్రం ముప్ఫై వచ్చినా ఆ ముద్దూ ముచ్చటకి దూరం దూరం అంటోంది చైనా యువత. ‘మీరు పెళ్లి చేసుకుంటే మేం నజరానాలిస్తాం. మీరు పిల్లల్ని కంటే బహుమతులతో ముంచెత్తుతాం’ అని ప్రభుత్వం నెత్తీనోరూ బాదుకుంటున్నా.. వాళ్ల మనసు వీసమెత్తైనా కరగడం లేదు. ఈ ట్రెండ్‌కి చాలానే కారణాలున్నాయి.

పెళ్లి మాటెత్తకున్నా.. వయసొచ్చాక వలపు ముచ్చట్ల జోరు అయితే భారీగా సాగిస్తోంది అక్కడి యువత. ప్రేమలు, డేటింగ్‌లు, బ్లైండ్‌ డేట్‌లు, సహజీవనాలతో పాశ్చాత్య దేశాలతో పోటీ పడుతోంది. కానీ వివాహమే అప్రాధాన్య విషయంగా మారిపోతోంది. వయసు ముదిరినా.. మనసు మనువుకై వెంపర్లాడకపోవడంలో ఉన్న మతలబు ఏంటంటే.. పెళ్లైతే స్వేచ్ఛ కోల్పోతాం.. ఆర్థిక చిక్కుల్లో పడతాం అని అత్యధికులు భావిస్తున్నారట. చైనా మినిస్ట్రీ ఆఫ్‌ సివిల్‌ అఫైర్స్‌ లెక్కల ప్రకారం ఈ జూన్‌లో గత 37 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయట. చైనా సెన్సస్‌ ఇయర్‌బుక్‌ లెక్కల ప్రకారం 2010లో అమ్మాయిలు, అబ్బాయిల పెళ్లి సగటు వయసు 28.6ఏళ్లు కాగా 2020 నాటికి అది నాలుగేళ్లు పెరిగింది.

అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లోనే ఈ ఆసక్తి మరింత సన్నగిల్లుతోందట. అక్కడి కార్యాలయాలు, సంస్థల్లో మహిళలపై ఇప్పటికీ వివక్ష ఎక్కువే. మనతో పోల్చితే మాతృత్వపు సెలవులూ తక్కువేనట. పెళ్లి చేసుకుంటే ఎక్కడ కెరియర్‌లో వెనకబడిపోతామో అనే అభిప్రాయం బలంగా నాటుకుపోవడంతో అతివలు అటువైపు చూడటం లేదు. చదువు, ఉద్యోగ లక్ష్యాల కోసం వాళ్లు ఏడడుగుల బంధాన్ని ఏడెనిమిదేళ్లైనా వాయిదా వేసుకుంటున్నారు. దీంతోపాటు చైనాలో ఆర్థిక మందగమనం సైతం పరోక్షంగా పెళ్లి ఆశలపై దెబ్బ కొట్టడం ఓ కారణం అంటున్నారు నిపుణులు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది నిరుద్యోగిత రేటు 20.8 శాతంగా నమోదైంది. కొలువు కొడతాం అనే నమ్మకం లేకపోవడం.. సంసారం ఓ గుదిబండగా మారుతుందనే అభిప్రాయం.. వెరసి, చైనీయులు పెళ్లి బంధాన్ని వాయిదాల్లోకి మార్చేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని