నో నో.. టెలిఫోనోఫోబియా

ఎప్పుడూ ఫోన్‌తోనే అని ఆడిపోసుకుంటారు గానీ.. కొందరికి ఫోన్‌ మోగితే ఒంట్లో వణుకు. కాల్‌ ఎత్తాలంటే సంకోచం.. ఎవరికైనా చేయాలంటే భయం

Updated : 15 Jul 2023 05:12 IST

ఎప్పుడూ ఫోన్‌తోనే అని ఆడిపోసుకుంటారు గానీ.. కొందరికి ఫోన్‌ మోగితే ఒంట్లో వణుకు. కాల్‌ ఎత్తాలంటే సంకోచం.. ఎవరికైనా చేయాలంటే భయం. ఇది ఫోన్‌ కాల్‌ యాంగ్జైటీ. దీన్నే టెలిఫోనోఫోబియా అంటున్నారు. కరోనా సమయంలో అత్యధికంగా చెడు వార్తలు వినడంతో.. ఈ రకమైన ఫోబియా యువతలో పెరిగిపోతోందంటున్నాయి అధ్యయనాలు.

కారణాలేంటి?

చెడు జరుతుందనే భయం: ఫోన్‌ వస్తే ఎక్కడ చెడు వార్తలు వినాల్సి వస్తుందోననే భయంతోనే ఈ ఆందోళన ఎక్కువ అవుతుందట.

సిద్ధంగా లేనప్పుడు: ఫోన్‌ మాట్లాడే సందర్భానికి సిద్ధంగా లేనప్పుడు, అవతలి వాళ్లతో మాట్లాడే ఓపిక లేనప్పుడు ఈ ఒత్తిడి పెరుగుతుంది.

అత్యవసరం: ఎవరైనా ఆపదల్లో ఉన్నవారు ఫోన్‌ చేస్తే.. వాళ్లకి సాయం చేయలేననే అశక్తత.. డబ్బులు ఇవ్వాల్సి ఉన్నవారు అడుగుతారనే భయమూ ఈ టెలిఫోనోఫోబియాకి ఓ కారణం.

బయట పడేదెలా?

కొన్ని విషయాలు, సందర్భాలు ఏవీ మన చేతిలో ఉండవు. మనకి ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడొచ్చుగానీ.. అవతలి వాళ్లని నియంత్రించలేం. ఈ విషయం ఒకటికి నాలుగుసార్లు మననం చేసుకుంటే ఆందోళన తగ్గే అవకాశం ఉంటుంది. ఫోన్‌ వస్తే జడుసుకునే పరిస్థితులు ఏంటి? అవి ఒక జాబితాగా రాసుకొని ఆ ఫోన్‌ రాకముందే దానికి సన్నద్ధం కావాలి. ఫోన్‌ కాల్‌ భయం అనిపించినప్పుడు మెసేజ్‌లు, ఈమెయిళ్లు, చాటింగ్‌ ద్వారా సంభాషణ కొనసాగించవచ్చు. ఒత్తిడి తగ్గడానికి ఇదొక మార్గం.

ఎంత భయం ఉన్నా.. కావాలనే మొహంపై చిరునవ్వు పులుముకోండి. ఫోన్‌ కాల్‌ వచ్చిన ప్రతిసారీ దీన్నో అలవాటుగా మార్చుకుంటే కొన్నాళ్లకి ఇది ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని