ఆవగింజంత ఆశతో..ఉల్లిపాయంత ఉత్సాహంతో!

డిగ్రీ పూర్తై ఏళ్లు గడిచినా నోటిఫికేషన్ల జాడ లేదాయే. కన్నవాళ్ల చీవాట్లకు అడ్డుకట్ట పడదాయే! ఇక కొలువు ఆశకు టాటా చెప్పి కూరగాయల యాపారం బాట పట్టా. అదృష్టం తలుపు తట్టినట్టు తొలి రోజే బీటెక్‌ చదివే పూబోణీ వచ్చి బోణీ చేసింది.

Updated : 29 Jul 2023 02:19 IST

డిగ్రీ పూర్తై ఏళ్లు గడిచినా నోటిఫికేషన్ల జాడ లేదాయే. కన్నవాళ్ల చీవాట్లకు అడ్డుకట్ట పడదాయే! ఇక కొలువు ఆశకు టాటా చెప్పి కూరగాయల యాపారం బాట పట్టా. అదృష్టం తలుపు తట్టినట్టు తొలి రోజే బీటెక్‌ చదివే పూబోణీ వచ్చి బోణీ చేసింది. పొట్లకాయంత పొడవైన కురులు.. వంకాయలాగా నిగనిగలాడుతున్న ముఖం.. కీరలాంటి కళ్లు.. చిలగడ దుంపలాంటి చెవులు, ముల్లంగిలాంటి పొడుగాటి ముక్కు.. ఆలూలాంటి గుండ్రని ముఖంతో తనని చూడగానే లవ్‌లో పడిపోయాను. మర్నాడు రాగానే మొహమాటం లేకుండా మాట కలిపాను. నా మనసులోని మాట తెలుపుతూ ప్రేమలేఖ ఇచ్చి పడేద్దామని ఫిక్స్‌ అయ్యాను. బీరకాయంత పొడుగు కాగితంపై.. గుమ్మడికాయంత ప్రేమను గుమ్మరించి.. బెండకాయంత పెన్నుతో.. ఉసిరికాయలా ఉత్సాహంతో.. పచ్చిమిర్చీలా ఘాటు పదాలతో.. పొనగాకులాంటి పొగడ్తలతో రాయడం మొదలు పెట్టాను. తనను తలచుకోగానే అప్పుడే తోటలోంచి తుంచిన తోటకూరలా తాజాగా అనిపించింది. కొత్తిమీర నలిపితే వచ్చే సువాసనల్లా మనసులో ఆస్వాదన మొదలైంది. తను నా ప్రేమకి సై అంటే అల్లం, మిరియాలు, మసాలాలు దట్టించి చేసిన కూరలా జీవితం కమ్మగా ఉంటుందనిపించింది. ఆమె మనసు గెలుచుకోవాలని ఖరీదైన క్యాప్సికాల పొట్లం కట్టి.. దానికి క్యాలీఫ్లవర్‌ జత చేసి అందులో నా లేఖ పెట్టి ఓ పిల్లోడి చేత పంపాను. తను సానుకూలంగా స్పందిస్తుందని ఆవగింజంత ఆశతో.. ఉల్లిపాయంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. కాకరకాయంత చేదువార్త చెప్పొద్దనీ.. కూరలో కరివేపాకులా నన్ను తీసిపారేయొద్దనీ.. ఎంతకీ దిగిరానంటున్న టమాటా ధరలా నాకు అందకుండా పోవద్దనీ వేడుకుంటున్నాను.
పంగా సాంబశివారెడ్డి, ఈమెయిల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని