అడ్డువెళ్తే.. అడ్డంగా కుమ్మేశారు!

పైసా పని చేయకున్నా.. అర్జెంటుగా అపర కుబేరుడిని కావాలని కలలు కంటున్న రోజులవి. బాగా క్యాష్‌ ఉన్న ఓ బడా బాబు దగ్గరికెళ్లి.. పెద్ద మొత్తం పెట్టుబడి రాబట్టాలన్నది నా ప్లాన్‌. నా ప్రతిభనంతా ప్రదర్శించి.. అతడితో వావ్‌ అనిపించుకోవాలనుకున్నా.

Published : 04 Nov 2023 00:02 IST

పైసా పని చేయకున్నా.. అర్జెంటుగా అపర కుబేరుడిని కావాలని కలలు కంటున్న రోజులవి. బాగా క్యాష్‌ ఉన్న ఓ బడా బాబు దగ్గరికెళ్లి.. పెద్ద మొత్తం పెట్టుబడి రాబట్టాలన్నది నా ప్లాన్‌. నా ప్రతిభనంతా ప్రదర్శించి.. అతడితో వావ్‌ అనిపించుకోవాలనుకున్నా. అతడిచ్చే పైకంతో లక్షలు సంపాదించి ఎక్స్‌ప్రెస్‌ రాజాలా దూసుకెళ్లాలనుకున్నా. కానీ ఏం లాభం? నేను ఎంత ప్రయత్నించినా పట్టించుకోకుండా.. నీ జబర్దస్త్‌ వేషాలు నా దగ్గర చూపించకు అంటూ సౌందర్యలహరిప్యాలెస్‌లోకి వెళ్లిపోయారు. అయినా నేను పట్టు వీడకుండా ఆయననే అనుసరిస్తుంటే.. మనసు మమత అనే ఇద్దరమ్మాయిలు ఎదురయ్యారు. వాళ్లదీ, నాదీ ఒకటే అభిరుచి. ఉన్నఫళంగా కోట్లు కూడబెట్టడం. ఆ డబ్బుతో వాళ్లు స్టార్‌ మహిళలా వెలిగిపోవాలని తహతహలాడుతుంటే.. శ్రీమంతుడు అయిపోవాలన్నది నా కల. నా ఆశని పసిగట్టి ఆడదే ఆధారం అనుకుంటూ వాళ్ల మాటలు విని మోసపోవద్దు.. చివరకు నీకు స్వాతి చినుకులే మిగులుతాయని హెచ్చరించాడా పెద్దాయన. అయినా ఆయనను ఒప్పించే హడావుడిలో నేనుండగా.. అర్జెంటుగా బయల్దేరి రమ్మంటూ భార్యామణి ఫోన్‌ చేసింది. ఆదరాబాదరగా వెళ్లి చూడగా.. అక్కడ అత్తాకోడళ్లకు భీకరంగా పోరు జరుగుతోంది. అడ్డుకోవాలని మధ్యలో వెళ్తే ఆడాళ్లా.. మజాకా అంటూ అడ్డదిడ్డంగా నన్ను కుమ్మేశారు. ఈ బాధలు భరించలేక తూర్పు వెళ్లే రైలు ఎక్కి సన్యాసుల్లో కలవాలని నిర్ణయించుకున్నాను. పెట్టేబేడా సర్దేసుకొని బయల్దేరుతుంటే.. అమ్మ వచ్చి అడ్డంగా నిలుచుంది. గువ్వాగోరింకలా ఉంటారని మీకు పెళ్లి చేస్తే.. కోడల్ని వదిలి అర్ధాంతరంగా ఎక్కడికెళ్తావంటూ నిలదీసింది. ఆపై మౌనపోరాటం మొదలు పెట్టింది. ఇదంతా గమనించిన నా శ్రీమతి తప్పైపోయిందని అమ్మ కాళ్లపై పడిపోయింది. కరిగిపోయిన అమ్మ నా కోడలు బంగారం అంటూ గుండెలకు హత్తుకుంది. ఇద్దరు కలిసి మనకు మనసు మమతలుకు కొదవ లేదనీ, ఎక్కడికీ వెళ్లొద్దని బతిమాలారు. వాళ్ల మాటలు విన్నాక.. డబ్బుకన్నా.. అనుబంధాలే ముఖ్యమని గ్రహించాక.. మా కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయని నమ్మకం కుదిరింది. అత్యాశను వదిలేసి.. అన్నదాతకు మించిన పని ఏముంటుందని ఆరోజే పొలంలోకి దిగాను.

బి.సృజని, వెంకటాపురం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని