పెళ్లి కోసం ఎన్నికలలు

పట్టువదలని రాజకీయ నాయకుడు ప్రతి ఎన్నికల్లో నామినేషన్‌ వేసినట్టు.. వయసు ముదిరిన నేనూ పెళ్లి కోసం ఎన్నో ఏళ్లుగా నామినేషన్‌ వేస్తూనే ఉన్నాను. పోటీ చేసే అభ్యర్థి అఫిడవిట్లో అన్ని వివరాలూ సమర్పించినట్టే.. నా అర్హతలన్నీ అచ్చేసి పెళ్లి కూతురు వేట మొదలు పెట్టాను.

Updated : 25 Nov 2023 01:43 IST

ట్టువదలని రాజకీయ నాయకుడు ప్రతి ఎన్నికల్లో నామినేషన్‌ వేసినట్టు.. వయసు ముదిరిన నేనూ పెళ్లి కోసం ఎన్నో ఏళ్లుగా నామినేషన్‌ వేస్తూనే ఉన్నాను. పోటీ చేసే అభ్యర్థి అఫిడవిట్లో అన్ని వివరాలూ సమర్పించినట్టే.. నా అర్హతలన్నీ అచ్చేసి పెళ్లి కూతురు వేట మొదలు పెట్టాను. పదవి కోసం నాయకులు పదేపదే పార్టీలు మార్చినట్టు.. పెళ్లి కుదరాలని రకరకాల ప్రయత్నాలు చేశాను. పంతులుగారితో మొదలెట్టి.. మ్యాట్రిమొనీల్లో గాలించి.. ఆ యాప్‌ ఈ యాప్‌ అనకుండా అన్నిచోట్లా అమ్మాయిని వెతికాను. అయినా ఎంత చేసినా నామినేషన్‌ చెల్లని అభ్యర్థిగా మిగిలిపోతున్నాను. ఆఖరికి ఎవరో అనామక అభ్యర్థి జాక్‌పాట్‌ కొట్టి పార్టీ టికెట్‌ దక్కించుకున్నట్టు.. నాకో అందాలబొమ్మతో సంబంధం కుదిరే అవకాశం వచ్చింది. ఈసారి లక్కీఛాన్స్‌ వదులుకోవద్దని అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాను. తాయిలాలతో కాబోయే అత్తమామలను బుట్టలో వేసుకున్నాను. ప్రలోభాలతో తన అన్నదమ్ముల్ని నావైపు తిప్పుకున్నాను. ఆమెను నాకు దక్కేలా చేస్తే ఎంతో చేస్తానని బంధువులందరికీ హామీలిచ్చాను. మొత్తానికి అన్ని ఈక్వేషన్లూ కుదిరి మా పెళ్లి చూపులు ఘనంగా జరిగాయి.

అంతా ఓకే అనుకొని బలమైన పార్టీ వేవ్‌లో సులువుగా నెగ్గే అభ్యర్థిలా నిశ్చింతగా ఉన్నాను. ఫలితాలు ప్రకటించే సమయంలా నా పెళ్లిరోజు రానే వచ్చింది. మూడు ముళ్లు పడే సమయానికి అకస్మాత్తుగా ఒకడు ఊడిపడ్డాడు. విజయం దక్కినట్టే దక్కి, ఆఖరి రౌండ్లో ఫలితం తారుమారైనట్టు.. వాడొచ్చి నా కాబోయే భార్యని పెళ్లి పీటల మీద నుంచి పక్కకి తీసుకెళ్లిపోయాడు. ‘మాది ఒక పార్టీకి, ఆ పార్టీ గుర్తుకి ఉన్నంత గాఢమైన అనుబంధం’ అంటూ అందరిముందూ ప్రచారం చేసేశాడు. లక్ష మెజారిటీతో గెలుస్తా అనుకున్నవాడికి, డిపాజిట్‌ గల్లంతైతే ఎలా ఉంటుందో.. అలాగైంది నా పరిస్థితి. రాత్రికి రాత్రే పార్టీ ఫిరాయించిన నాయకుడిలా.. ‘ఏదో లోకంలో ఉండి నీకు ఓకే చెప్పానుగానీ.. నేను ప్రేమించింది ఇతగాడినే’ అంటూ మాట మార్చేసింది ఆ అమ్మాయి. దాంతో అసెంబ్లీలో అడుగుపెట్టి ‘అధ్యక్షా..’ అంటూ గొంతెత్తాలని కలలు కన్న ఆశావహుడి కలలు కల్లలైనట్టు నా ఆశలు ఆవిరయ్యాయి. ఎమ్మెల్యేగా ఎన్నికై, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయాలనుకున్న వాడికి, నీ ఎన్నికే చెల్లదంటూ న్యాయస్థానం తీర్పు చెబితే ఎంత బాధ ఉంటుందో.. అంతలా మథన పడిపోయాను. అయినా.. ఓటు అనే ఆయుధంతో రాజకీయాల కుళ్లు కడిగేయాలని కంకణం కట్టుకున్న ఓటరులా.. నా పెళ్లి కోసం మళ్లీమళ్లీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను.

పంపినవారు: ఇంచెర్ల ధనలక్ష్మి, మనోజ్‌ గోపగాని


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని