ఈ యేటి.. పాఠాలు

సామాన్యులు కష్టాల్ని తలచుకొని ఏడుస్తూ కూర్చుంటారు.. విజయాలకి పొంగిపోతుంటారు. స్థితప్రజ్ఞులు పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. మరింత ఎదగడానికి నిచ్చెన మెట్లలా మలచుకుంటారు.

Published : 30 Dec 2023 00:33 IST

సామాన్యులు కష్టాల్ని తలచుకొని ఏడుస్తూ కూర్చుంటారు.. విజయాలకి పొంగిపోతుంటారు. స్థితప్రజ్ఞులు పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. మరింత ఎదగడానికి నిచ్చెన మెట్లలా మలచుకుంటారు. వ్యక్తిగత జీవితంలోనే కాదు.. మనసు ఉండాలేగానీ ఈ ఏడాది దేశంలో జరిగిన కొన్ని సంఘటనల నుంచీ మనం పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవచ్చు.

ః భారతీయ రైల్వే చరిత్రలోనే ఘోర ప్రమాదాల్లో ఒకటి ఈ సంవత్సరం జూన్‌లో జరిగింది. కోరమాండల్‌, హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఢీకొని దాదాపు తొమ్మిది వందల మంది చనిపోయారు. ఒకరిద్దరు ఉద్యోగుల ఏమరుపాటు, అలక్ష్యం, చిన్న సాంకేతిక తప్పిదం ఈ ఘోరకలికి కారణమైంది. దీన్నుంచి తేరుకోవడానికి జనం, దేశానికి చాలా కాలమే పట్టింది.

 పాఠం: ఒక్కోసారి మనం చేసే చిన్న పొరపాటే పెను ప్రమాదానికి కారణమవుతుంది. ఆ తప్పిదాలు.. మనల్నే కాదు.. మనపై ఆధారపడ్డవారినీ, మన పక్కనున్న వారినీ ఇబ్బంది పెడతాయి. మనం బాధ్యతాయుతమైన పని, హోదాలో ఉన్నప్పుడు నిత్యం అప్రమత్తంగా, ఏమరుపాటుగా ఉండాల్సిందేనని ఈ సంఘటన తెలియజెప్పుతుంది.

 ఆగస్టులో మన చంద్రయాన్‌-3 జాబిల్లిని చేరింది. ఇది వందలమంది శాస్త్రవేత్తల రెండు దశాబ్దాల కష్టం, స్వప్నం. గతంలో చంద్రయాన్‌-2 ఆశించినట్టుగా నింగికెగరలేదు. ఆ వైఫల్యంతో అప్పటి ఇస్రో ఛైర్మన్‌ కె శివన్‌ కన్నీరు మున్నీరయ్యారు. అయినా తప్పిదాలను సరిదిద్దుకొని నాలుగేళ్లకే మనం చంద్రుడిని అందుకున్నాం. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా సగర్వంగా తల ఎత్తుకున్నాం.
పాఠం: పడిపోవడం తప్పు కాదు.. పడ్డాక లేచి, గెలిస్తేనే గొప్ప. వందలమంది శాస్త్రవేత్తలు ఏళ్లకేళ్లు రాత్రింబవళ్లు కష్టపడ్డా.. వేల కోట్ల రూపాయల వ్యయమైనా.. అపజయం ఎదురైందని కుంగిపోలేదు. స్థైర్యం కూడగట్టుకొని మళ్లీ సిద్ధమయ్యారు. తప్పిదాల్ని సరిదిద్దుకున్నారు. విజయం సాధించారు. అప్పుడే కాడి వదిలేస్తే.. అరుదైన విజయం మన చేతికందేదా?

  • మైదానాల్లో ప్రత్యక్షంగా వేలమంది అభిమానుల మద్దతు.. వరుసగా తొమ్మిది మ్యాచ్‌లు గెలిచిన ఘనత.. సొంత దేశంలోనే ఫైనల్‌. నవంబరులో జరిగిన క్రికెట్‌ వరల్డ్‌కప్‌ మనదే అనుకున్నారంతా. ఏమైంది? ఆఖరికి చివరిమెట్టుపై చతికిలపడ్డాం. కప్పుని ఆస్ట్రేలియాకి అప్పగించేశాం.


పాఠం: ఏమరుపాటు, అతి ఆత్మవిశ్వాసం, ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడం.. కారణం ఏదైనా కావొచ్చు. అవి తేలిగ్గానే ఉంటాయి. కానీ గొప్ప చరిత్ర సృష్టించే అవకాశానికి మోకాలడ్డుతాయి. భారత జట్టు విషయంలో జరిగింది అదే. అతి ఆత్మవిశ్వాసంతో విర్రవీగితే.. గెలుపు ముంగిట బొక్కబోర్లా పడటం ఖాయం. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిందే.

  •  అగ్ర కథానాయకుడి హోదా.. చేతిలో సొంత నిర్మాణ సంస్థ.. తను ఊ అంటే.. వరుసకట్టే నిర్మాతలు.. ఇన్ని సానుకూలతలు ఉన్నా బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్‌ తొందరపడలేదు. అంతకుముందు వరుస వైఫల్యాలు ఎదురవడం.. కరోనా ప్రభావం థియేటర్లపై పడటం.. ఆచితూచి కథలు ఎంచుకోవడం.. ఏదైతేనేం.. ఐదేళ్లు ఎదురు చూశాడు. బలంగా దూసుకొచ్చాడు. ‘పఠాన్‌’, ‘జవాన్‌’, ‘డంకీ’లతో మూడు భారీ విజయాలు అందుకున్నాడు.

పాఠం: సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే.. దాని అర్థం అది ఓటమి కాదు. అదను కోసం ఎదురుచూస్తుందని. సమయం మనది కానప్పుడు తల వంచుకొని ఉండటంలో తప్పేం లేదు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహం, ఆవేశం పనికిరావు. సరైన సమయం కోసం ఎదురుచూసే ఓపిక ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని