ఫ్రెండ్‌ కోసం వెళ్తే పెళ్లిచూపులు

పాతికేళ్లు దాటి పదేళ్లైనా పెళ్లి కాలేదనే దిగులుతో ఓరోజు మంచం పట్టాను. పరామర్శించడానికి వచ్చిన దోస్త్‌ జబర్దస్తీ చేసి మరీ నన్ను ఆసుపత్రికి లాక్కెళ్లాడు. ఫ్రెండు కోసం వెళ్తే అక్కడే పెళ్లిచూపులు జరుగుతాయని కలలో కూడా ఊహించలేదు.

Updated : 06 Jan 2024 08:54 IST

పాతికేళ్లు దాటి పదేళ్లైనా పెళ్లి కాలేదనే దిగులుతో ఓరోజు మంచం పట్టాను. పరామర్శించడానికి వచ్చిన దోస్త్‌ జబర్దస్తీ చేసి మరీ నన్ను ఆసుపత్రికి లాక్కెళ్లాడు. ఫ్రెండు కోసం వెళ్తే అక్కడే పెళ్లిచూపులు జరుగుతాయని కలలో కూడా ఊహించలేదు. నా మనసుకు నచ్చిన వాళ్లంతా నాతో మనువుకి దూరంగా ఉంటారనే నా అంచనాలను పటాపంచలు చేసిందో అమ్మడు అక్కడ. వెళ్లగానే బుల్లి గౌనులో బ్యూటిఫుల్‌గా ఉన్న ఓ నర్సు దర్శనం ఇచ్చింది. ప్రేమకు భావం చాలు.. భాష అక్కర్లేదనుకొని ఆమె మలయాళీ అయినా మ్యారేజీకి సిద్ధమయ్యాను. పర్సును చూడకుండా పల్సు చూసే ఆమెని ఆరు నూరైనా ప్రేమించి పెళ్లాడాలనుకున్నాను. ప్రాబ్లెమ్‌ ఏంటని తను నా నాడి పట్టుకోగానే.. నిన్ను చూడగానే నా మనసు గాడి తప్పిందన్నాను. నీతో పెళ్లైతేనే నా బతుకు జట్కా బండి ముందుకెళ్తుందని తడుముకోకుండా చెప్పాను. నా మాటలకు ముందు అవాక్కైనా.. ఆపై ఓ చిరునవ్వు విసిరేసరికి నా దశ తిరిగిందని మురిసిపోయాను. అదే ఊపులో నీకు తాళి కట్టి, నా ఆలిని చేసుకుంటానని కుండబద్దలు కొట్టేశాను. తను అంగీకరిస్తే, తొందర్లోనే పెళ్లి బాజాలు మోగించాలనుకుంటే.. ఏమీ చెప్పకుండా నా మనసుని గింగిరాలు తిప్పింది. ఆ నీరసంలో నేను డీలా పడిపోతే.. ఓ చిరునవ్వు నవ్వి, బెడ్‌ మీద ఉన్న పేషెంట్‌కి సెలైన్‌ ఎక్కిస్తే తేరుకున్నట్టు హుషారయ్యా. తన చేతితో నా గుండెపై స్టెతస్కోప్‌ పెట్టి చూడగానే నా హార్ట్‌బీట్‌ 143 కొట్టుకోసాగింది. ఆపై తను విసిరిన కొంటెచూపులు నా గుండెకు సిరంజిల్లా గుచ్చుకున్నాయి. అలాగే నవ్వుతూ నాతో మాట్లాడుతుంటే.. అనస్తీషియా ఇవ్వకుండానే మత్తులోకి జారుకున్నాను. ఇంకా ఆలస్యం చేస్తే ఏకంగా కోమాలోకి వెళ్లిపోతాననిపించింది. అందుకే ఏమైనా ఫర్వాలేదని రోజ్‌ ఇచ్చి రోసీకి ప్రపోజ్‌ చేశాను. ముసిముసిగా నవ్వుతూ నా ప్రేమని యాక్సెప్ట్‌ చేయడంతో వెంటిలేటర్‌పై ఉన్న రోగికి ఆక్సిజన్‌ అంది బతికినట్టు ఊపిరి పీల్చుకున్నాను. అంతా ఓకే అనుకొని ఆమెతో సరాసరి అత్తారింటికి వెళ్తే.. ‘రోసీకి ఇదివరకే సంబంధం చూశాం. నెలరోజుల్లో పెళ్లి’ అని పెద్దలు చెప్పడంతో.. కరోనా నుంచి కోలుకొని ఊపిరి పీల్చుకున్న వాడికి, సెకండ్‌ వేవ్‌ అటాక్‌ చేసినట్టు అయింది నా పరిస్థితి. ఇంక చేసేదేమీ లేక.. అవమానం భరించలేక.. ముఖానికి మాస్కు.. కళ్లకి కర్చీఫ్‌ అడ్డు పెట్టుకొని కన్నీళ్లు కనిపించకుండా అక్కడ్నుంచి తిరిగొచ్చాను.

పంగా సాంబశివారెడ్డి, కడప


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు